దేశ వ్యాప్తంగా బీజేపీ దెబ్బకు ప్రాంతీయ పార్టీల దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ కావడం గురించి కథలుకథలుగా చెప్పుకుంటున్నాం. తమకు ప్రమాదకారిగా మారుతున్నాడనే అనుమానం వస్తే చాలు… ఈడీ, సీబీఐ, ఐటీలను కేంద్రంలో అధికారంలో చెలాయిస్తున్న బీజేపీ రంగంలోకి దింపే సంగతి తెలిసిందే. అలాంటి బీజేపీని జనసేనాని పవన్‌కల్యాణ్ చావు దెబ్బతీశారు. ఈ వాస్తవం బీజేపీకి తెలిసే సరికి, జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది.
అయితే బీజేపీని మట్టి కరిపించిన ఇద్దరు తెలుగు నేతలు మనవాళ్లే కావడం గర్వించాల్సిందే. ఆ ఇద్దరు చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్. ఏపీలో తాను అధికారం కోల్పోవడంతో పాటు కేంద్రంలో మళ్లీ బీజేపీ ఘన విజయం సాధించడంతో చంద్రబాబు తన మేధస్సును ఉపయోగించారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నలుగురు రాజ్యసభ సభ్యుల్ని బీజేపీలోకి పంపారు. అంతటితో చంద్రబాబు ఆగిపోలేదు. ఆ తర్వాత ఏం చేశారో ఇప్పుడిప్పుడే బీజేపీకి, తెలుగు సమాజానికి అర్థమవుతోంది.
ఏపీలో సమయం, సందర్భం లేకుండానే బీజేపీతో జనసేనాని పవన్‌కల్యాణ్ పొత్తు పెట్టుకున్నారు. ఇదేంటబ్బా… వేళకాని వేళ ఇదేం రాజకీయం అని అందరికీ అనుమానం వచ్చింది. అయితే అప్పటికే 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, బీజేపీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుని వున్నాయి. దీంతో నీకు మొగుడు లేడు, నాకు భార్య లేదు…ఒకరికొకరం అంటూ ఇద్దరూ కలిసిపోయారు. పొత్తు కుదుర్చుకున్న సందర్భంలో భవిష్యత్‌లో ఎలా నడవాలో మాట్లాడుకున్నారు.
ఆ తర్వాత పెళ్లి తనతో, ప్రేమ కార్యకలాపాలు టీడీపీతో పవన్ సాగించడంపై బీజేపీకి ఏదో అనుమానం కొట్టింది. పవన్‌తో సావాసం ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎట్లా? అని బీజేపీ నేతలు తమకు తాము సర్ది చెప్పుకున్నారు. ఎన్నికల సమయం సమీపిస్తున్న నేపథ్యంలో పవన్ అసలు రంగు నెమ్మదిగా బయటపడింది. కుటుంబ, అవినీతి రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా, ప్రత్యామ్నాయంగా ఇద్దరం కలిసి ప్రజల ముందుకెళ్దామని బీజేపీ అంటే… జనసేనాని ఊహూ అని నిరాకరించారు.
కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా మాత్రమే పని చేస్తానన్నారు. జగన్‌ను గద్దె దించడానికి రోడ్ మ్యాప్ కావాలని డిమాండ్ చేశారు. ఇదేంటి, మనం అధికారంలోకి రావడానికి ఏం చేయాలో ఆలోచిద్దామని, కేవలం ఒక నాయకుడిని టార్గెట్ చేయడం ఏంటని బీజేపీ హితబోధ చేసింది. అబ్బే, జగన్‌పై విద్వేషం నింపుకున్న పవన్‌కు అవేవీ మనసుకు ఎక్కలేదు. చంద్రబాబుతో లోపాయికారి కలయికకు తెరదించి, బహిరంగంగానే చెట్టపట్టాలేసుకుని తిరగడం స్టార్ట్ చేశారు.
జగన్‌కు అనుకూల వైఖరితో బీజేపీ వుందనే అభిప్రాయాన్ని సృష్టించేందుకు పవన్ శక్తివంచన లేకుండా కృషి చేశారు. తద్వారా బీజేపీని బలహీనపరచడానికే పవన్ పరోక్షంగా పని చేశారనే వాస్తవాన్ని బీజేపీ గ్రహించింది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని పవన్‌ను బీజేపీ కోరింది. పొత్తు ధర్మాన్ని పాటించకుండా, వైసీపీని ఓడించాలని మాత్రమే పవన్ పిలుపు ఇచ్చారు.
ఈ నేపథ్యంలో బీజేపీ కీలక సమావేశంలో తమతో పవన్ పొత్తు కుదుర్చుకున్నప్పటికీ వ్యవహరించిన తీరు ఒక్కొక్కటిగా సమీక్షించుకున్నారు. తమను ఎదగకుండా చేయడానికే పవన్‌ను చంద్రబాబు పంపారనే చేదు నిజాన్ని బీజేపీ నేతలు గ్రహించారు. అందుకే సమావేశం తర్వాత పవన్‌పై బీజేపీ నేత మాధవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. “ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీని ఓడించాలని మాత్రమే పవన్‌కల్యాణ్ పిలుపు ఇచ్చారు. బీజేపీ అభ్యర్థుల్ని గెలిపించాలని ఎక్కడా చెప్పలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు మద్దతు ఇవ్వాలని కోరినా పవన్ స్పందించలేదు” అని బీజేపీ నేత పీవీఎన్ మాధవ్ అన్నారు.
పవన్ అబద్ధాలకోరు అని బీజేపీ నేత పరోక్షంగా చెప్పకనే చెప్పారు. ఇటీవల జనసేన ఆవిర్భావ సభలో పవన్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను మద్దతు ఇవ్వాలని అనుకున్నప్పటికీ బీజేపీ ముందుకు రాలేదన్నట్టు చెప్పారు. ఇప్పుడు బీజేపీ అసలు వాస్తవం ఏంటో చెప్పింది. జనసేనాని పవన్‌కల్యాణ్ నీతులు కోటలు దాటుతుంటాయని, చేతలు మాత్రం గడప దాటడం లేదని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనాని మాయమాటలకు లొంగిపోవద్దని, అతనితో సంబంధం లేకుండానే ఎదగాలని బీజేపీ ఒక నిర్ణయం తీసుకుంది.
ఇంతకాలం జనసేనతో పొత్తు వల్ల తాము నష్టపోయామని బీజేపీ ఆవేదన చెందుతోంది. ఇదంతా చంద్రబాబు వ్యూహంలో భాగంగా పవన్‌కల్యాణ్ నటించారని బీజేపీ గ్రహించింది. పవన్‌కల్యాణ్ వెండితెరపై కంటే, రాజకీయ తెరపై అద్భుతంగా నటిస్తారని తమతో పొత్తు ద్వారా నిరూపించుకున్నారని బీజేపీ నేతలు అంటున్నారు. పవన్ రాజకీయ నటనకు ఆస్కార్‌కు మించి ఏదైనా అవార్డ్ ఇస్తే సరిపోతుందని బీజేపీ నేతల భావన.