ఏపీ సర్కార్‌కు తెలిసో లేదా తెలియదో కానీ… ఉపాధ్యాయులు మాత్రం ప్రతి చర్యను కక్ష సాధింపుగా భావిస్తున్నారు. తాజాగా ఉగాది పండుగను బుధవారం తెలుగు సమాజం వైభవంగా జరుపుకుంటోంది. ముఖ్యంగా రాయలసీమలో ఈ పండుగను బాగా జరుపుకుంటారు. సంక్రాంతిని కోస్తా ప్రాంతంలో బాగా జరుపుకునే సంగతి తెలిసిందే.
ఇదిలా వుండగా ప్రతి ఏడాది మూడు నాలుగు లోకల్ హాలిడేస్ వుంటాయి. వీటిని స్థానికంగా ప్రాధాన్యం ఉన్న పండుగలు, ఇతరత్రా కార్యక్రమాలకు ఉపాధ్యాయులు ఇచ్చేవాళ్లు. గతంలో ఇదంతా మండల స్థాయిలోనే జరిగేది. స్థానిక ఎంఈవో దృష్టికి ప్రాధాన్యత అంశాన్ని తీసుకెళితే, లోకల్ హాలిడే ఇచ్చేవారు. ఇప్పుడు ప్రతిదీ విజయవాడ స్థాయిలో కేంద్రీకృతం చేయడంతో సమస్య ఉత్పన్నమైంది.
తాజాగా ఉగాది మరుసటి రోజు పార్న పండుగను రాయలసీమలో ఘనంగా జరుపుకునే సంగతి తెలిసిందే. అయితే 40 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా పార్నకు లోకల్ హాలీడే లేకుండా చేశారని ఉపాధ్యాయ లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. హిందువుల ప్రధాన పండుగలలో ఉగాది ఒకటని, పార్నకు లోకల్ హాలిడే ఇచ్చుకునే పరిస్థితి లేకపోవడం ఏంటనే నిలదీత ఉపాధ్యాయ లోకం నుంచి వెల్లువెత్తుతోంది.
ఇది ముమ్మాటికీ ఉపాధ్యాయులపై కక్ష సాధింపు చర్యగా ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. లోకల్ హాలిడేకి బదులు మరో రోజు పని చేయడం ఆనవాయితీగా వస్తోందని, అయితే వాటిని ఉపయోగించుకునే హక్కు స్థానికంగా లేకపోవడం ఏంటని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ ఉన్నతాధికారులు వెంటనే లోకల్ హాలిడే ఇచ్చుకునే అవకాశాన్ని కల్పించడంతో పాటు పార్నకు సెలవు ఇవ్వాలని కోరుతున్నారు.
చివరికి ఇది మతం రంగు పులుముకుంటోంది. హిందువులపై వివక్షతోనే ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని విమర్శలకు దారి తీస్తోంది. ఏపీ సర్కార్‌కు అలాంటివేవీ లేకపోయినా, కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల చివరికి వైసీపీ ప్రభుత్వం నష్టపోతుందన్నది వాస్తవం. కావున ఆయా ప్రాంతాల పండుగల ప్రాధాన్యాన్ని గుర్తించి లోకల్ హాలిడే ఇచ్చుకునే సౌలభ్యాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది.