సరైన టైమ్ లో సరైన నిర్ణయం అన్నది ఏ వ్యక్తికి, ఏ సంస్ధకు అయినా అవసరం. రాజకీయాల్లో వ్యూహ, ప్రతి వ్యూహాలకు కూడా ఇది చాలా అవసరం. కానీ ఈరోజు పవన్..చంద్రబాబు కలిసిన తీరు, మాట్లాడిన వైనం మాత్రం నూటికి నూరు శాతం రాంగ్ టైమ్ అనే చెప్పాలి. ఈ సందర్భానికి నేపథ్యాన్ని చూస్తే..
పాయింట్ వన్.. వైకాపా విశాఖ గర్జన తలపెట్టింది. దాని మీద కాస్త గట్టి హడావుడి చేయడం మొదలైంది.
పాయింట్ టూ… ఉన్నట్లుండి పవన్ విశాఖ టూర్ ఫిక్స్ చేసుకున్నారు. అది కూడా విశాఖ గర్జన రోజే అక్కడకు వెళ్లాలనుకున్నారు.
పాయింట్ త్రీ…అరెస్టయిన జనసైనికులు అందరినీ విడుదల చేసే వరకు విశాఖ వదలను అన్నారు.
పాయింట్ ఫోర్… కానీ వున్నట్లుండి వెనక్కు హైదరాబాద్ రాకుండా విజయవాడ వెళ్లారు. అదెందుకు అంటే హైకోర్టులో లీగల్ ఫైట్ కోసం అన్నారు. నిజానికి అది చేసేది పవన్ కాదు లాయర్లు.
పాయింట్ ఫైవ్… ఉన్నట్లుండి భాజపా మీద తనకు రోడ్ మ్యాప్ ఇవ్వడం లేదని ఆరోపణ చేసారు. మోడీ మీద గౌరవం వున్నా తన ఫైట్ తాను చేసుకుంటా అన్నారు.
పాయింట్ సిక్స్…ఇలా అన్న కొద్ది సేపటికే చంద్రబాబు హుటాహుటిన హైదరాబాద్ నుంచి వచ్చి పవన్ ను కలిసారు.
(విశాఖలో హడావుడి జరిగింది..విజయవాడలో మీటింగ్ జరిగింది. రెండూ నోవాటెల్ హొటల్ లోనే…ఆ హోటల్ యాజమాన్యంతో చంద్రబాబు-లోకేష్ లకు సన్నిహిత సంబంధాలున్నాయని వినిపిస్తూనే వుంటుంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విశాఖ నోవాటెల్ లో ఎన్ని ప్రభుత్వ సదస్సులు జరిగాయి. ఎంత బిల్లులు చెల్లించారు అన్నది వేరే సంగతి కాదు)
పాయింట్ సెవెన్… ప్రభుత్వంపై పోరాటం కోసం తెలుగుదేశం, వామపక్షాలను కలుపుకుని ముందుకు వెళ్తారని జనసేన అధిపతి పవన్ ప్రకటించారు.
(భాజపా..వామపక్షాలు ఒక ఒరలో ఇమిడే కత్తులు కావు..అవి ఉప్పు..నిప్పు అని అందరికీ తెలుసు. మరి అలాంటి వామపక్షాలతో వెళ్లడం అంటే భాజపాను వదిలేసుకుంటున్నా అని చెప్పకనే చెప్పినట్లు కదా?)
ఇదీ సంఘటనల సీక్వెన్స్. ఇక క్లారిటీ కావాల్సింది ఒకటే భాజపా తప్పక పవన్ వెనుకే వుంటుందా? లేక ఏమంటుంది అన్నది తేలాలి.
సరే ఇప్పుడు ఈ సీక్వెన్స్ లు అన్నీ కలుపుకుని చూస్తే ఏమి అర్థం అవుతుంది. వైకాపా గర్జన…వెంటనే అక్కడ వాలిన పవన్..ఆ ఊపు మీద వున్న పవన్ కు మద్దతు అనే మిష మీద వచ్చి కలిసిన చంద్రబాబు. అప్పటికే భాజపాతో ఇండైరెక్ట్ గా తెగతెంపులు ప్రకటించిన పవన్.
అసలే విశాఖకు వెళ్లిందే చంద్రబాబు తెరవెనుక ఆదేశాలు అని ప్రతిపక్షాలు పెడుతున్న గోల సద్దు మణగక ముందే పవన్ ఇలా చేయడం అంటే రైట్ అనాలా? రాంగ్ అనాలా?
సరే కేవలం మద్దతు ప్రకటించడానికి చంద్రబాబు వస్తే, గంట సేపు ఏకాంతంగా పవన్ తో చర్చలు ఏమిటి? వాటి సారాంశం ఏమిటి? ఆ చర్చల్లో నాదెండ్ల మనోహర్ కు, నాగబాబుకు ఎందుకు చోటు లేదు?
మరి ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు. ఇదంతా ఓ స్క్రీన్ ప్లే ప్రకారం జరుగుతున్నది అని అనుకోరా? మరి అలా అనుకుంటే ఇది రాంగ్ టైమ్ లో రాంగ్ డెసిషన్ కాదా? వైకాపా ప్రచారానికి ఊతం ఇచ్చినట్లు కాదా? పైగా ఎన్నికలకు ఇంకా ఏణ్ణర్థం టైమ్ వుంది. ఇక జగన్ ఇప్పట్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లరు. భాజపా తన పరిస్థితి ఏమిటి అన్నది డిసైడ్ చేసుకోవాలి. తాను కూడా జగన్ ను వదిలి తేదేపాతో వెళ్లాలా? లేదా? అన్నది డిసైడ్ చేసుకోవాలి.
అలా డిసైడ్ చేసున్నపుడే వస్తుంది అసలు మజా. తెలుగుదేశం వైపు వెళ్తే ఇక కథే లేదు. టోటల్ జగన్ సినిమా ముగింపు దిశకు చేరుకుంటుంది. కాదూ తెలుగుదేశం వైపు వెళ్లకపోతే అప్పుడు వస్తుంది అసలు మజా. అలాంటి మజాకు ఇంత త్వరగా అవకాశం ఇవ్వడం అన్నది రాంగ్ టైమ్ లో రాంగ్ డెసిషన్ కాదా?
పైగా జనాల దృష్టిలో ఇప్పుడే బాబు-పవన్ ఎప్పటికీ ఒక్కటే అన్నది బయటపడిపోతే ఎలా? పొద్దున్నేమో తనను ప్యాకేజ్ స్టార్ అంటే చెప్పుతో కొడతా అన్నారు. మధ్యాహ్నం వేళకు బాబుతో కలిసి గంట సేపు ఏకాంత చర్చలు జరిపారు. ఇప్పుడు మరి ఏ స్టార్ అని అంటారు వైకాపా జనాలు. ఇది కూడా రాంగ్ టైమ్ లో రాంగ్ డెసిషన్ కాదా?
ఏమైతేనేం జగన్ కు ఓ క్లారిటీ ఇచ్చేసారు పవన్..బాబు కలిసి. తాము కలిసి వస్తున్నాం యుద్దానికి. కాసుకోమని. ప్రజల్లో, తెలుగుదేశం మద్దతు దారుల్లో ఒకటే భావన వుంది. దేశం..సేన కలిస్తే జగన్ పని అవుట్ అని. ఇది జగన్ దృష్టికి కూడా వచ్చే వుంటుంది. అందువల్ల ఇక ఇప్పుడు ఈ డ్యామేజ్ ను కంట్రోల్ చేసుకోవాలి. దానికి ఏణ్ణర్థం టైమ్ వుంది. అంత ముందుగా జగన్ ను అలెర్ట్ చేసింది పవన్ నే. అదే ఆయన రాంగ్ టైమ్ లో రాంగ్ డెసిషన్.