ప్రజాస్వామ్య పరిరక్షణకు జనసేనాని పవన్‌కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సరికొత్త నిర్వచనం చెప్పారు. వైసీపీ నేతల్ని చెప్పుతో కొడతానని, నా కొడుకుల్లారా రండ్రా తేల్చుకుందాం అని పదేపదే పవన్‌కల్యాణ్ తిట్టిన తర్వాత వాళ్లిద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలపై నోరు పారేసుకున్న పవన్‌కల్యాణ్‌కు 40 ఏళ్ల ఇండస్ట్రీ చంద్రబాబు సంఘీభావం పలకడానికి వెళ్లారట! ఇంతకంటే జోక్ మరేదైనా వుంటుందా?
పవన్‌కల్యాణ్, చంద్రబాబు ఉమ్మడిగా నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రధానంగా చెప్పిన అంశం …. ఇది ఎన్నికలకు సంబంధించిన భేటీ కాదని, ప్రజాస్వామ్య పరిరక్షణకే కలిశామని, మున్ముందు కూడా కలుస్తామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటేనే, ఎన్నికలుంటాయంటాయని పవన్‌కల్యాణ్ చెప్పడం విశేషం. చంద్రబాబు పాలన చూసిన వాళ్లు, అలాగే తాజాగా పవన్‌కల్యాణ్ విపరీత దూషణలు విన్నాక… వీళ్లిద్దరూ కలిసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారని జనం నమ్ముతారా? మనసంతా విద్వేషాన్ని నింపుకున్న వీళ్లు ప్రజాస్వామ్య పరిరక్షణ చర్యలు చేపడతారంటే, దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా వుంది.
ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడడం ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాదు. దేశంలో మోడీ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రజాస్వామ్యం ఏ స్థాయిలో ప్రమాదంలో పడిందో కథలుకథలుగా చెప్పుకుంటున్నారు. అంతెందుకు, 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రజాస్వామ్యానికి ప్రధాని మోడీ ఏ రకంగా పాతరేశారో మన చంద్రబాబు నాయుడి ప్రసంగాల్ని వింటే తెలుస్తుంది. ఏపీలోనే ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారని కాసేపు అనుకుందాం. అయితే పవన్, చంద్రబాబు మాత్రమే ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడగలరని అనుకోవడమే ఎనిమిదో వింత. ఎందుకంటే గతంలో వీళ్లిద్దరితో పాటు బీజేపీ కలిసి ఏపీలో సాగించిన అరాచక, అప్రజాస్వామిక విధానాల వల్లే జగన్ ఘన విజయం సాధించారని విస్మరిస్తే ఎలా?
ప్యాకేజ్ స్టార్ అనే సన్నాసి వెధవల్ని చెప్పుతో కొట్టి పళ్లు రాలగొడతా (చేతిలోకి చెప్పు తీసుకుని చూపుతూ), మాటకు ముందు, తర్వాత నా కొడుకుల్లారా అంటూ ప్రత్యర్థులను తూలనాడిన నాయకుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానని చెబితే నమ్మేదెలా? ఒక్కో నా కొడుకును మెడ పిసికి చంపేస్తా అని ఆవేశంతో ఊగిపోయిన నాయకుడు అసలు రాజకీయాలకే అనర్హుడని చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారు. ఇలాంటి వ్యక్తి నేరపాలన నుంచి ఆంధ్రాకు విముక్తి కలిగిస్తాననడం వింతల్లోకెల్లా వింత. మెడ పిసికి చంపుతాననడం పవన్‌కల్యాణ్ దృష్టిలో నేరం కిందికి వస్తుందా? రాదా? ఈయనా నేరాలు, ఘోరాల గురించి నీతులు, సూక్తులు చెప్పేవి? ఎవరి చెవిలో పువ్వు పెట్టడానికి ఈ నీతి కబుర్లు?
బహుశా భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక పార్టీ అధ్యక్షుడు ఈ రకమైన బజారు భాష ఎవరూ, ఎప్పుడు మాట్లాడి వుండరు. ఆ దుర్మార్గమైన ఘనత పవన్‌కల్యాణ్‌కే దక్కింది. ప్రతిపక్ష నాయకుడిగా పీక పిసికి చంపుతా, నా కొడుకుల్లారా, చెప్పుతో కొడతా అని వార్నింగ్ ఇచ్చే వ్యక్తికి అధికారాన్ని అప్పగిస్తే… ఇక ఆ పాలన ఎలా వుంటుందో ఒక్కసారి ఊహించుకోవచ్చు. వైఎస్ జగన్ ప్రతిపక్ష నాయకుడిగా నంద్యాల ఉప ఎన్నిక సమయంలో చంద్రబాబును కాల్చి వేయండి అని పిలుపు ఇవ్వడం పెద్ద దుమారం రేపింది. అంతకు మించి ఆయన ఎప్పుడూ ఇలాంటి బజారు భాషను ప్రయోగించలేదు.
పవన్‌కల్యాణ్‌ను ఉద్దేశించి దత్తపుత్రుడంటూ పొలిటికల్ సెటైర్‌ను జగన్ విసిరారు. ఇందుకు కౌంటర్‌గా సీబీఐ దత్త పుత్రుడని పవన్ కూడా విమర్శించారు. రాజకీయాల్లో సెటైర్స్ సహజం. ఆ మాత్రం విమర్శలను తట్టుకోలేని వారు ఒక పార్టీని ఎలా నడుపుతారు? ఇక అధికారం అప్పగిస్తే… హిట్లర్‌కు మించిపోరా?
ఇకపై వైసీపీతో యుద్ధమే అంటూ, రాడ్లతోనా, హాకీ స్టిక్కులతోనా, దేంతోనైనా రెడీగా ఉన్నానని పవన్ హెచ్చరించడం ప్రజా స్వామిక లక్షణమా? ప్రజాస్వామ్యంలో యుద్ధం అంటే బ్యాలెట్ పోరు. ఆ మాత్రం జ్ఞానం లేకుండానే ఈ అజ్ఞాని నోటికొచ్చినట్టు మాట్లాడ్డం ప్రజామోదం పొందుతుందా? రాజకీయ అవసరాల కోసం పవన్‌కు చంద్రబాబు సంఘీభావం ప్రకటించారనేది జగమెరిగిన సత్యం.
తాను మాత్రం అందర్నీ తిడ్తానని, తననెవరూ ఏమీ అనకూడదని పవన్ కోరుకోవడం ఏంటి? రాజకీయ విమర్శలు చేస్తే, వాటికి సమాధానం ఇవ్వడం, ప్రతిగా ప్రశ్నలతో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేయడం ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓ భాగం. చర్యకు ప్రతిచర్య వుంటుందని సైన్స్ చెబుతుంది. ఇవేవీ పరిగణలోకి తీసుకోకుండా నా కొడుకుల్లారా, చెప్పుతో కొడ్తా, రాండిరా తేల్చుకుందాం అనే వాళ్లు ప్రజాస్వామ్య పరిరక్షణకు కాదు, నియంతృత్వాన్ని బతికించేందుకు మాత్రమే పనికొస్తారు.
సోషల్ మీడియాలో చిన్నచిన్న అభ్యంతరకర పోస్టులను పెట్టిన వారిపై కేసులు, అరెస్ట్‌లకు పాల్పడే జగన్ ప్రభుత్వం… పవన్‌కల్యాణ్ విషయంలో ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికర పరిణామం. ఇటీవల మంత్రి కారుమూరి నాగేశ్వరరావు జనసేన కార్యకర్తల గురించి చెప్పిన మాట… పవన్‌కే వర్తిస్తుందని చెప్పక తప్పదు. తోకలేని కోతులుగా మంత్రి అభివర్ణించిన సంగతి తెలిసిందే. పవన్ సంస్కారి అని, ఆయన అభిమానులు విపరీత పోకడలకు వెళ్తుంటారని చాలా మంది చెప్పేవాళ్లు. కానీ ఆ అభిప్రాయం తప్పని తేలిపోయింది. పవన్ నైజమే అది అని నిర్ధారణ అయ్యింది.
ఒకే జాతిపక్షులన్నీ ఒకే గూటికి చేరుతాయనే సామెత చందాన …పవన్ మార్క్ క్యారెక్టర్ ఉన్నవాళ్లంతా ఒక పార్టీగా జత కట్టారు. తామే ప్రజాస్వామ్య పరిరక్షకులమని పవన్, చంద్రబాబు కలిసి చెప్పడం, ఆ మాటల్ని మనం వినాల్సి రావడం… కలికాల మహత్యం అని సరిపెట్టుకోవాలేమో!
సొదుం రమణ