ప్రముఖ కవి ఆరుద్ర ఒక జోకు చెప్పేవారు.
ఓ కుర్రాడు.. తను ప్రేమించిన అమ్మాయి వద్దకు వెళ్లి.. ‘నువ్వు గనుక నా ప్రేమను ఒప్పుకోకపోతే నేను చచ్చిపోతాను’ అన్నాడు. ఆ అమ్మాయి ‘ఒప్పుకోను’ అంది! ఆ కుర్రాడు చచ్చిపోయాడు! అరవయ్యేళ్ల తర్వాత! -అనేది ఆ జోకు.
సదరు కుర్రాడు చచ్చిపోతానని అన్నాడే తప్ప ఎప్పుడు చచ్చిపోతాననేది ఆ అమ్మాయితో చెప్పనేలేదు. ఆమె కాదంది. వాడి దారి వాడు చూసుకున్నాడు.. నింపాదిగా ఓ అరవయ్యేళ్ల తర్వాత చచ్చిపోయాడు.. వాడు చావడం ఏంటి? చావే వాడిని వెతుక్కుని వచ్చి ఉంటుంది!
ఇప్పుడు రాహుల్ గాంధీ విషయంలో ఆ జోకు గుర్తుకొస్తోంది. రాహుల్ గాంధీ పార్టీ సమావేశాలు నిర్వహించడానికి కర్ణాటకకు వెళ్లారు. లింగాయత్ లకు చెందిన ఒక మఠాన్ని సందర్శించి మఠాధిపతి పతి శివమూర్తి మురఘ శరణరు నుంచి ‘ఇష్టలింగ దీక్ష’ స్వీకరించారు. ఇది కేవలం లింగాయత్ శాఖకు చెందిన వారు మాత్రమే ఆచరించే దీక్ష! ఈ దీక్ష తీసుకోవడం ద్వారా.. రాహుల్ కూడా లింగాయత్ శాఖలోకి ప్రవేశించినట్టు ఆ తర్వాత మరో స్వామీజీ వ్యాఖ్యానించారు కూడా.
ఈ సందర్భంగానే.. హవేరి హోసముట్ స్వామీజీ రాహుల్ రాజకీయ భవితవ్యం గురించి జోస్యం చెప్పారు. ఇందిర, రాజీవ్ ప్రధానిగా చేశారు. ఇప్పుడు రాహుల్ లింగాయత్ శాఖలోకి ప్రవేశించారు కాబట్టి ఆయన కూడా ప్రధాని అవుతారు అని జోస్యం చెప్పారు. ఈ జోస్యం రాహుల్ అభిమానులకు కమ్మగానే వినిపించవచ్చు. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధాని అభ్యర్థి అనే హోదా నుంచి.. ఈ దేశానికి ప్రధాని అనే హోదాకు రాహుల్ ఎప్పుడు రూపాంతరం చెందుతారనేది నిజానికి చాలా పెద్ద ప్రశ్నే! లింగాయత్ స్వామి జోస్యం పుణ్యమాని అది నిజమైపోతుందని ఫ్యాన్స్ ఎదురుచూడవచ్చు.
ఇక్కడే ఆరుద్ర జోకు గుర్తుకొస్తోంది. స్వామి జోస్యం గట్టిదే అయినప్పటికీ.. అది నిజమయ్యేది ఎప్పటికి? ఇంకా ఎన్నేళ్లకు? ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా దేశంలో అధికారంలోకి వచ్చే పరిస్థితిలో లేదు. కనీసం యూపీఏ కూటమిగా కూడా అధికారం చేపడుతుందనుకోవడం కల్ల. ఇంకా అనేకానేక బలసమీకరణలు, బలగాల పునరేకీకరణలు జరిగితే ఏదైనా అవకాశం ఉండొచ్చు. అంత భారీ స్థాయిలో కిచిడీ కూటమి ఏర్పడితే.. దానికి సారథిగా రాహుల్ కు అవకాశం దక్కుతుందా అంతకు మించిన కొమ్ములు తిరిగిన నేతలు ఇతర పార్టీలనుంచి పోటీ పడరా? అనేవన్నీ జవాబులేని ప్రశ్నలే!
అందుకే.. స్వామీజీ జోస్యం బాగుంది గానీ.. అది నెరవేరేది ఎన్నటికి? అని పార్టీ వారే విస్తుపోతున్నారు! ఈ జన్మలోనేనా? వచ్చే జన్మ వరకు వెయిట్ చేయాలా? అనే సెటైర్లూ పడుతున్నాయి! ఈ ఆశలపై నీళ్లు చల్లే ట్విస్టు ఏంటంటే.. ఒక స్వామీ ప్రధాని అవుతావని ప్రకటిస్తే.. అసలు లింగాయత్ దీక్ష ఇచ్చిన శివమూర్తి స్వామి వచ్చి.. ఆయనను వారించి ‘అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు.. అది ప్రజలు మాత్రమే నిర్ణయిస్తారు’ అంటూ రాహుల్ ఉత్సాహానికిన బ్రేకు వేయడం కొసమెరుపు!