ఉమామహేశ్వరి బలవన్మరణం వెనుక తమ పాత్ర లేకుంటే తండ్రీకొడుకులిద్దరూ సీబీఐ విచారణ కోరవచ్చు కదా!
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మరణానికి ఆయన అల్లుడు, పూర్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెట్టిన మానసిక క్షోభే కారణమనేది నిర్వివాదాంశం. 1994 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడింటి రెండు వంతుల మెజారిటీతో గెలిచి, రామారావు గారు మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. కనీవినీ ఎరగని ఆధిక్యంతో సీఎం పదవి అధిష్టించిన మామ ఎన్టీఆర్‌ను ఏడాది కూడా తిరగకుండానే పదవీచ్యుతిడిని చేయాలని అప్పట్లో చంద్రబాబు ఆరంభం నుంచే కుట్రలు, కుతంత్రాలకు తెరతీశారు.
అప్పటికి ఏడాది ముందే ఎన్టీఆర్ రచయిత్రి లక్ష్మీ పార్వతిని పెళ్లాడారు. 1985లో భార్య బసవరామ తారకం మరణానంతరం కుటుంబసభ్యులు తన ఆలనాపాలనా పట్టించుకోకుండా ముఖం చాటేయడంతో ఏకాకి అయిన ఎన్టీఆర్‌కు దగ్గరయ్యారు లక్ష్మీ పార్వతి. అయితే, ఆమెతో తమ తండ్రి రెండో వివాహాన్ని ఆయన కుటుంబ సభ్యులు ఆమోదించకపోవడం చంద్రబాబుకు పదునైన ఆయుధంగా మారింది. అందుకే ఎన్టీఆర్ కుటుంబసభ్యులు చాలా మందిని ముందుచూపుతో చంద్రబాబు కూడగట్టుకున్నారు. లక్ష్మీ పార్వతిని రాజ్యాంగేతర శక్తిగా చిత్రించారు. ఈ కుట్ర అమలులో రెండు ప్రధాన తెలుగు దినపత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతితోపాటు అనేక పత్రికలు చంద్రబాబుకు తోడ్పడ్డాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్‌ను భార్య చేతిలో కీలుబొమ్మగా, దృతరాష్ట్రుడిగా చంద్రబాబు, ఆయన బృందం తెలుగు మీడియా ద్వారా దుర్మార్గంగా, విపరీతంగా ప్రచారం చేశాయి.
రెండు శాఖలు అప్పగించినా చల్లారని అల్లుడు గారు
తెలుగుదేశంలో గ్రూపు రాజకీయాలు ఉధృతస్థాయిలో మొదలుబెట్టారు చంద్రబాబు. లక్ష్మీ పార్వతి పేరు చెప్పి చంద్రబాబు తెలుగుదేశం శాసనసభా పక్షంలో చెప్పుకోదగ్గ సంఖ్యలో పార్టీ శాసనసభ్యులను తన వర్గంగా కూడగట్టడాన్ని ఎన్టీఆర్ స్వయంగా చూశారు. అయినా, అల్లుడిని అదుపుచేసే ప్రయత్నం ఆయన చేయలేదు. ఏనాటికైనా తప్పు తెలుసుకుంటాడని ఆశించారు. బుజ్జగింపు చర్యల్లో భాగంగా, చంద్రబాబుకు ఎప్పుడూ లేనిది ఆర్థిక, రెవెన్యూ శాఖలు రెండూ అప్పగించారు రామారావు. అంతటితో ఆగలేదు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుని అసెంబ్లీ స్పీకర్‌గా నియమించడానికి కూడా ఎన్టీఆర్ అంగీకరించారు. అలాగే, ఎన్టీఆర్ తన మూడో అల్లుడికి సన్నిహితులైన ఎలిమినేటి మాధవరెడ్డి వంటి ఐదారుగురిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
ఇంతచేసినా ముఖ్యమంత్రి రామారావు పూర్వపు ఎన్టీఆర్ కాదనీ, రెండో భార్య చేతిలో కీలుబొమ్మ అనే దుష్ప్రచారం చంద్రబాబు అనుకూల మీడియా ఉవ్వెత్తున చేయడం ప్రారంభించింది. లక్ష్మీపార్వతి అంతులేని అవినీతికి పాల్పడుతున్నారని, భార్య అక్రమాలకు ఎన్టీఆర్ వత్తాసు పలుకుతున్నారంటూ కట్టుకథలు ప్రచారం చేసింది. నెమ్మదిగా మధ్యతరగతి ప్రజల్లో ఎన్టీఆర్‌ను పలచన చేసే కార్యక్రమం అనూహ్యమైన రీతిలో సాగింది. ఈ ప్రచారంతో రామారావు నొచ్చుకున్నారు. మానసికంగా బలహీనమయ్యారు. బాధతో ఖిన్నుడయ్యారు. కాని, చంద్రబాబు, ఆయన ముఠా నెమ్మది మీద తమ తప్పు తెలుకుంటారనే భ్రమల్లోంచి రామారావు బయటపడకపోవడం చంద్రబాబుకు కలిసొచ్చే అంశం అయింది. 1994 డిసెంబర్ 12 నుంచి 1995 ఆగస్టు 15 వరకూ అంటే, ఎనిమిది నెలల కాలంలో పన్నిన కుట్రలు, కుతంత్రాలు ఎట్టకేలకు ఫలించాయి.
ఆగస్టు 16న వెన్నుపోటుకు తెగబడిన చంద్రబాబు
‘‘ప్రజల కోర్కెల ఆధారంగా నా విధానాలు రూపొందించాను. వారి ఆకాంక్షలకు అనుగుణంగా నేను కృషిచేస్తున్నాననే భావనతో వారు నాపై నమ్మకం ఉంచారు,’’ అని 1995 ఆగస్టు 16న జరిగిన ఓ కార్యక్రమంలో రామారావు ఆవేశపూరితంగా మాట్లాడారు. అప్పటికే అల్లుడు బాబు పోకడల గురించి ఆయనకు సూచనప్రాయంగా తెలిసింది. తనపై భారీ స్థాయిలో చంద్రబాబు వర్గం, అనుకూల పత్రికలు దుష్ప్రచారం చేస్తున్నాగాని బాబు తనను వెన్నుపోటు పొడుస్తారని గాని, రహస్య సమాలోచనలతో కుట్ర చేస్తారని గాని రామారావు అంచనా వేయలేకపోయారు. రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజన్స్ విభాగాన్ని సైతం చంద్రబాబు తన గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. ఈ సంగతి ఎన్టీఆర్‌కు తెలియదు. వాస్తవాలు ఎన్టీఆర్‌కు తెలియకుండా ఇలా అన్ని రకాల ప్రభుత్వ వ్యవస్థలను తన కనుసన్నల్లో నడిపించారు ఆర్థిక, రెవెన్యూ మంత్రి చంద్రబాబు.
అయితే, తన వెనుక ఏదో జరుగుతోందనే సమాచారం ఎన్టీఆర్‌కు చేరింది. బాబు కుట్రలను రామారావు పూర్తిగా నమ్మలేదు గాని తనపై జరుగుతున్న దుష్ప్రచారం ప్రభావం ఆయనపై ఎక్కువగానే పడింది. మానసికంగా కుంగిపోతున్నాగాని తాను కూర్చున్న ముఖ్యమంత్రి పీఠాన్ని చంద్రబాబు లాగివేయడానికి సిద్ధమౌతున్నారన్న సమాచారాన్ని మాత్రం ఎన్టీఆర్ నమ్మలేదు. పైన చెప్పిన కార్యక్రమంలో ఎన్టీఆర్ ఆవేశంగా ప్రసంగించిన రెండు వారాలకు తెలుగుదేశం ఎమ్మెల్యేలు కొందరిని నగరం నడిబొడ్డున ఉన్న వైస్రాయ్ హోటెల్ శిబిరానికి చంద్రబాబు తరలించారు. ఖిన్నుడైన రామారావు వెంటనే చంద్రబాబు సహా ఆయన ముఠాలోని మంత్రులను గవర్నర్ కృష్ణకాంత్ గారికి చెప్పి బర్తరఫ్ చేయించారు. ఈ లోగా మెజారిటీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు చంద్రబాబు వర్గంలో చేరారనే అబద్ధాన్ని విపరీతంగా ప్రచారం చేసిన ఫలితంగా నిజంగానే చాలా మంది శాసనసభ్యులు ‘వెన్నుపోటు’ వర్గంలో చేరారు. ఊహించని పరిణామంతో దిగ్భ్రాంతికి గురైన రామారావు కొంత కోలుకుని బాబు నియంత్రణలో ఉన్న ఎమ్మెల్యేలు బసచేస్తున్న ట్యాంక్ బండ్ పక్కనున్న వైస్రాయ్ హోటెల్ ముందుకు వెళ్లారు. ‘చైతన్యరథం’పై నిలబడి వెళ్లిన ముఖ్యమంత్రి రామారావుపై చంద్రబాబు తన కిరాయి మనుషులతో చెప్పులు విసిరేయించారు. తనపై చెప్పులు పడినాగాని ఎన్టీఆర్ లెక్కచేయలేదు. హోటెల్ లోపలికి వెళ్లి చంద్రబాబు నిర్బంధంలో ఉన్న తన తమ్ముళ్లకు (ఎమ్మెల్యేలు) విముక్తి కల్పించాలన్న ఆదేశం సహా రామారావు ఇచ్చిన అనేక ఉత్తర్వులను పోలీసులు పెడచెవినపెట్టారు. ఆయన ఎంత మొత్తుకున్నా పోలీసులు సహా ప్రభుత్వ యంత్రాంగం ముఖ్యమంత్రి ఆదేశాలను తుంగలోకి తొక్కింది.
రాజీకి సిద్ధమైన రామారావు హతాశుడయ్యారు.
ముఖ్యమంత్రి పదవిలో ఉన్న తన మాట సాగకపోయినాగాని ఆగ్రహించలేదు రామారావు. నమ్మకద్రోహానికి తిరుగుబాటు పేరుతో కళ్ల ముందే దుర్మార్గానికి తెగబడిన అల్లుడు చంద్రబాబుతో రాజీ చర్చలకు రామారావు సిద్ధమైనా తిరస్కారమే ఎదురైంది. స్పీకర్, గవర్నర్ కూడా చంద్రబాబు మాటలు నమ్మారు. కాదు, నమ్మేలా చేశారు బాబు. కాదు, వారిద్దరూ చంద్రబాబుతో కుమ్మకయ్యారంటే మేలేమో. చివరికి ఆగస్టు నెలాఖరుకు గుండెనొప్పితో హైదరాబాద్‌లోని మెడిసిటీ ఆస్పత్రిలో చేరిన రామారావుతో సీఎం పదవికి రాజీనామా చేసే పరిస్థితి సృష్టించారు చంద్రబాబు. నమ్మిన అల్లుడే వెన్నుపోటు పొడిచి 1995 సెప్టెంబర్ ఒకటిన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడంతో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు శారీరకంగా, మానసికంగా కుంగిపోయాడు. తమ ప్రియతమ నేతపై ప్రజల్లో సానుభూతి తగినంతగా రాకుండా చంద్రబాబు చేయించిన విషప్రచారం పనిచేసింది. అయినా, ఎన్టీఆర్ సెప్టెంబర్ ఒకటి నుంచి ఐదు నెలలకు అంటే 1996 జనవరి మూడో వారం వరకూ తనదైన శైలిలో చంద్రబాబుపై రాజీలేని పోరాటం సాగించారు. కాని, చంద్రబాబు తన సీఎం కుర్చీని హఠాత్తుగా, బలవంతంగా గుంజుకుపోయినా రామారావు తట్టుకుని నిలబడ్డారు.
అయితే, తాను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ ఎన్టీఆర్‌ను మానసికంగా కుంగదీసే, క్షోభపెట్టే ప్రచారం చంద్రబాబు రెట్టించిన వేగంతో చేశారు. నటుడిగా, 59 సంవత్సరాల వయసులో రాజకీయాల్లోకి వచ్చాక ఉక్కు క్రమశిక్షణతో బతికిన ధీశాలి రామారావు అల్లుడి దెబ్బకు కుదేలయ్యే పరిస్థితి వచ్చింది. అసలే గుండె సమస్యతో బాధపడుతున్న రామారావు శారీరక ఆరోగ్యం పైకి బాగానే ఉంది. కాని, చంద్రబాబు పెట్టిన మానసిక క్షోభ తారక రామారావును కనిపించని దెబ్బదీసింది. 1996 జనవరి 17 రాత్రి వరకూ మామూలుగా ఉన్న రామారావు మరుసటి రోజు తెల్లవారు జామున (18న) కన్నుమూశారు. జీవితంలో ఎన్నెన్నో ఆటుపోట్లు ఎదుర్కున్న ఎన్టీఆర్ కన్నుమూశారు. అల్లుడు పెట్టిన క్షోభ, వెన్నుపోటుకు ఆయన గుండె ఆగిపోయింది. ఇదంతా అందరికీ తెలిసిన చరిత్ర. మరణించిన మరుక్షణం నుంచే చంద్రబాబుకు మామ ఎన్టీఆర్ ఆరాధ్యదైవంగా మారిపోయారు. మామగారి మరణానికి మాత్రం తాను కారణం కానే కాదని చంద్రబాబు ఇప్పటికీ బుకాయిస్తూ ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుని రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నాలు మానలేదు.
హరికృష్ణకూ తప్పని చంద్రబాబు క్షోభ
మామ ఎన్టీఆర్ పై తిరుగుబాటు పేరుతో సాగిన వెన్నుపోటు కార్యక్రమంలో తనకు సంపూర్ణ సహకారం అందించిన నందమూరి తారక రామారావు కుటుంబ సభ్యులు చాలా మందిని చంద్రబాబు వాడుకుని వదిలేశారు. రెండో అల్లుడు, మాజీ మంత్రి, వెన్నుపోటు సమయానికి బాపట్ల ఎంపీ అయిన డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరావు చంద్రబాబు చేతుల్లో నమ్మకద్రోహానికి గురైన తొలి నందమూరి కుటుంబ సభ్యుడు. అలాగే తండ్రి ఎన్టీఆర్‌పై తిరుగుబాటులో రక్తసంబంధం కూడా విస్మరించి సహకరించిన నందమూరి హరికృష్ణను మరి కాస్త మెత్తగా దువ్వి దెబ్బదీశారు చంద్రబాబు.
1995 సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు తనకు వెన్నుదన్నుగా నిలిచిన హరికృష్ణను రవాణా మంత్రిగా తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. అప్పటికి అసెంబ్లీ సభ్యుడు కాని హరికృష్ణ ఆరు నెలలలోగా శాసనసభకు ఎన్నిక కాకపోతే మంత్రి పదవి పోతుందనే నిబంధన ఉంది. ఎన్టీఆర్ మరణంతో హిందూపూర్ అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉంది. అయినాగాని, హరికృష్ణను ఏదో ఒక స్థానం నుంచి ఉప ఎన్నికలో గెలవడానికి వీలుగా టీడీపీ ఎమ్మెల్యే ఎవరితోనైనా రాజీనామా చేయించే వీలుంది. కాని, చంద్రబాబుకు హరికృష్ణ చేసిన మేలు శాశ్వతంగా గుర్తు పెట్టుకోవాలనే ఉద్దేశం లేదు. అవసరం తీరింది కాబట్టి ఇక వదిలించుకోవాలనే నిర్ణయానికి వచ్చి ఉప ఎన్నికలో హరికృష్ణను అసెంబ్లీకి పంపే ప్రయత్నం చేయలేదు. మంత్రిగా ఆరు నెలలు నిండే సమయానికి హరికృష్ణ ఈ పరిస్థితుల్లో రాజీనామా చేయక తప్పలేదు. తర్వాత హిందూపురం శాసనసభ ఉప ఎన్నికలో గెలిచాక కూడా హరికృష్ణకు చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వలేదు. ఇలా చివరికి ఎమ్మెల్యేగా హరికృష్ణ కెరియర్ 1999లో ముగిసింది. దీంతో హరికృష్ణ తీవ్ర మానసిక ఒత్తిడికి, క్షోభకు గురయ్యారు. బావ దగ్గుబాటితో కలిసి హరికృష్ణ అన్నా టీడీపీ అనే పార్టీ పెట్టారు. 1999 ఆగస్టు–సెప్టెంబర్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. బాబు దెబ్బతో కోలుకోలేకపోయారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న కాలంలో (2004–2009) చేసిన పాపం కడుక్కునే ప్రయత్నంలో భాగంగా హరికృష్ణను రాజ్యసభకు పంపారు చంద్రబాబు. అంతకుమించి పార్టీలో బావమరిదికి విలువ లేకుండా చేశారు. సమైక్యాంధ్ర ప్రదేశ్ ఉద్యమంలో భాగంగా రాజ్యసభకు రాజీనామా చేశారు హరికృష్ణ. కాని, 2014 విభజిత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం హరికృష్ణకు చంద్రబాబు ఇవ్వలేదు. చివరిసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక కూడా హరికృష్ణ తెలుగుదేశంలో నిరాదరణకు గురయ్యారు. ఎలాంటి పదవి ఇవ్వకుండా రకరకాల పద్ధతుల్లో హరికృష్ణను వేధించారు చంద్రబాబు. చివరికి రాజకీయంగా చెల్లని నాణెంగా మిగిలాననే దిగులు చివరి రోజుల వరకూ హరికృష్ణను వేధించింది.
కోడెలను దారుణంగా వాడుకుని వదిలేశారు.
2014–2019 మధ్యకాలంలో ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా పనిచేసిన డాక్టర్ కోడెల శివప్రసాదరావు కూడా చంద్రబాబు పెట్టిన మానసిక క్షోభతోనే 2019 సెప్టెంబర్‌లో కన్నుమూశారు. మంత్రి పదవి ఇవ్వడం ఇష్టంలేక కోడెలకు స్పీకర్ పదవి కట్టబెట్టారు చంద్రబాబు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోద్బలంతో, మాయమాటలతో 23 మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి నిస్సిగ్గుగా పాలకపక్షమైన తెలుగుదేశంలోకి ఫిరాయించారు. దశలవారీగా జరిగిన ఈ అప్రజాస్వామిక, చట్టవ్యతిరేక పరిణామంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదును స్పీకర్ కోడెల పట్టించుకోకుండా చేశారు చంద్రబాబు. అంతేకాదు స్పీకర్ హోదాలో చేసిన కోడెల చర్యలకు వత్తాసు కూడా పలికారు. తీరా అధికారం కోల్పోయాక తన పాత అక్రమాలే కోడెల మెడ చుట్టూ బిగుసుకునే సందర్భం వచ్చింది. తన అక్రమ సలహాలు అమలు చేసి బోనులో నిలబడే పరిస్థితి తెచ్చుకున్న కోడెలను చంద్రబాబు పట్టించుకోలేదు. చంద్రబాబును కోడెల కలవడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మొదట మంచి సర్జన్‌గా, తర్వాత మంత్రిగా, బలమైన రాజకీయ నేతగా, చివరికి స్పీకర్‌గా బతికిన కోడెల ఒంటరి వాడయ్యాడు. పార్టీ అధినేత పెట్టిన బాధ, క్షోభ అంతిమంగా డాక్టర్ శివప్రసాదరావు గుండె ఆగిపోయేలా చేశాయి.
ఉమామహేశ్వరి మృతిపై సీబీఐ దర్యాప్తు కోరవచ్చు కదా!
ఎన్టీఆర్ నాలుగో, ఆఖరి కూతురు కంఠంనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకోవడానికి ఆమెపై ఉన్న మానసిక ఒత్తిడే కారణమని ఆమె కుటుంబ సభ్యులే మీడియాకు వెల్లడించారు. అంతేకాదు, ఉమామహేశ్వరి చివరి రోజుల్లో ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి, భరించలేకపోయిన క్షోభకు చాలా వరకు కారణం ఆమె బావ నారా చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు నారా లోకేష్ అనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉమామహేశ్వరి బలవన్మారణానికి దారితీసిన మానసిక క్షోభకు తాము కారణం కాదని చంద్రబాబు, లోకేష్ భావిస్తే, ఆమె మృతిపై సీబీఐ దర్యాప్తునకు తండ్రీకొడుకులిద్దరూ సిద్ధమేనని ప్రకటించడం ఉత్తమం. తమపై ఉన్న అనుమానాలు కేంద్ర నేర దర్యాప్తు సంస్థ విచారణ ద్వారా తొలగించుకోవడానికి ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు, మాజీ మంత్రి లోకేష్ కు ఇదో మంచి అవకాశం.
వై. విజయసాయి రెడ్డి, పార్లమెంట్ సభ్యులు