రెండు విధాల చెడినవాడిని రేవడి అన్నారు. మరి మూడు విధాల చెడినవారి నేమంటారో అనుకుంది రామేశ్వరి. ఇదివరకటి ఇంట్లో ఉన్నపుడు తనకు యిద్దరితోనే ఇబ్బందులు. ఇప్పుడు ఈ యింటికి మారాక స్వయంగా చెల్లెలితోనే చిక్కు వచ్చిపడింది. అన్ని తగాదాలకు మూలకారణం తనకు పిల్లలు పుట్టకపోవడం. గొడ్రాలు కావడం తన నేరమా? భర్తతో అన్యోన్యంగానే మసలుతోంది. పోనీ తన శరీర నిర్మాణంలోనో, హార్మోన్లలోనో లోపం ఉందనుకొన్నా, తనెలా బాధ్యురాలవుతుంది? 'నన్ను ఫలానా విధంగా పుట్టించు' అని తనేమైనా వెళ్ళి దేవుణ్ని అడిగిందా? అసలు డాక్టరు దగ్గర కెళ్ళి పరీక్షలు చేయించుకొంటే తదా లోపం తనలో ఉందో, భర్తలో ఉందో తేలేది!
కానీ తన భర్త పరీక్షలు చేయించుకోనని మొండికేశాడు. అతనికి పరువు తక్కువట. వాళ్ళ వంశంలో అందరూ మగసిరి కలవారేనట. లోపం అంటూ ఉంటే తనలోనే ఉండాలిట. ‘‘మీరూ, నేనూ ఇద్దరం పరీక్షలు చేయించుకొందాం. ఎవరిలో లోపం వుందో తేలిపోతుంది. అప్పుడు గొడ్రాలన్నా మాట పడతాను’’ అంది తను. ‘‘నా సంగతి నాకు తెలుసు. నీ సంగతి తెలుసుకోవాలంటే నువ్వు చూపించుకో’’ అన్నాడు భర్త. ‘‘ఇద్దరమూ కలిసే వెళదాం. నేనొక్కత్తినీ వెళ్లే కొశ్చినే లేడు' అని కరాఖండిగా చెప్పింది తను.
పిల్లలు లేకపోతే పీడా పోయింది. తలరాత ఇంతే అని సరిపెట్టుకుంది తను. కానీ భర్త ఆలా సరి పెట్టుకోలేడు. పెళ్ళయిన ఏడేళ్ళకి కొత్త పల్లవి ఎత్తుకొన్నాడు. మళ్ళీ పెళ్ళి చేసుకొంటాట్ట. ‘నా జాతకంలో పిల్లలు పుడతారని ఉందిట. నీ వల్ల కలగలేదు కాబట్టి ఇంకోదాన్ని కట్టుకొంటాను' అన్నాడతను. ‘నా దాంట్లోనూ ముగ్గురు పిల్లలని ఉంది. కాస్త ఓపిక పడితే మనకే కలుగుతారు.’ అంది తను. ‘సరే ఈ ఏడాది చూద్దాం’ అన్నాడతను ఏదో పెద్ద దయతలచినట్లు.
తను ఊరెళ్ళి తల్లిదండ్రుల దగ్గర మొర పెట్టుకుంది. తండ్రి రంకెలు వేశాడు. ‘‘నువ్వు కంప్లెయింట్ ఇస్తే గవర్నమెంట్ వాళ్లు గుమాస్తా ఉద్యోగం ఊడపీకి జైల్లో కూచోపెడతారు. వెధవ్వేషాలు వెయ్యడ్డని గట్టిగా చెప్పు’’ అంటూ. తల్లి మాత్రం ‘కంగారు పడకండి, ఆలోచిద్దాం’ అంటూ ఊరుకోబెట్టింది. రాత్రి తండ్రికి హితబోధ చేస్తూంటే తన చెవిన పడింది, “చిన్నదానికి పెళ్ళి చేయాలని చూస్తున్నాం. ఇప్పుడు ఇది కాపురం చెడగొట్టుకుని వచ్చి కూచుందంటే దాని పెళ్ళి కాదు. పైగా మనిషిపైన మనిషి భారం. అల్లుడికి జైలువాళ్ళు అన్నం పెడతారు. మరి దీనికి? మనమే పోషించాలి. మీరు పై ఏడాది రిటైరవుతారు. ఎల్లకాలం దీనికి తిండి పెట్టగలరా? మొగుణ్ణి వదిలేసి వచ్చాక ఇది ఎంతకాలం తిన్నగా ఉండగలడు? ఉప్పూకారం తినే మనిషి, ఏడేళ్ళగా సంసారానికి అలవాటు పడినది. గట్టిగా ఎంతకాలం నిలవగలదు? ఎవడో ఒకడు చెడగొడితే? పైగా ఓ విషయం గుర్తుంచుకోండి. అతను దీన్ని పొమ్మనటం లేదు..”
మర్నాడు తండ్రి “ఏదీ తొందరపడి చేయకూడదు. నువ్వు నాలుగు రోజులుండు యిక్కడ. నింపాదిగా ఆలోచిద్దాం” అన్నాడు. తర్వాత మళ్ళీ ఆ విషయం ఎత్తలేదు. తల్లి లోకరీతి తెలిసిన మనిషి, తను బయల్దేరి వచ్చేసే రోజున యధాలాపంగా అన్నట్లు చెప్పింది. “ఎలాగోలా నీ కడువు పండితే చాలు. సమస్య తీరిపోతుంది. ఏదో ఒక దారి చూడు. మొగుడితో కాపురం ఎలాగూ చేస్తున్నావు కాబట్టి అల్లరి పడవు. ఇంగితం తెలిసిన వాళ్ళెవరూ ఇరుగునా, పొరుగునా లేరూ!?”
తిరిగొచ్చిన నాలుగోజున తల్లి మాటలు అర్థమయ్యేయి. ఎవరితోనైనా సంబంధం పెట్టుకొని, పిల్లల్ని కనమని తల్లి చెప్పిందా? నిజమేనా? కన్నతల్లి అలా మాట్లాడవచ్చా? చివ్వున కోపం వచ్చి, తగ్గిన తర్వాత తల్లి తర్కంలో పొరపాటు లేదనిపించింది. మొగుడు ఇంకోదాన్ని పెళ్ళి చేసుకొని ఇద్దర్నీ సమానంగా చూసుకొంటానని మాటిస్తున్నాడు. కానీ తనకు అది మింగుడు పడటంలేదు. భర్తను ఇంకోదానితో ఎందుకు పంచుకోవాలి? ఇద్దర్నీ సమానంగా ఎంతకాలం చూస్తాడు? పిల్లలు పుట్టాలని అంతగా తపించే వాడు, పిల్లల్నిచ్చిన భార్యనే నెత్తిమీద పెట్టుకుంటాడు. తను క్రమంగా పనిమనిషి స్థాయికి దిగజారుతుంది. పిల్లలు పుట్టకపోడానికి కారణం భర్త లోపమే కారణమైతే కొత్తగా వచ్చిన భార్యకూ పిల్లలు పుట్టరు. తన గతి చూసింది కాబట్టి అది ఎలాగోలా పిల్లల్ని కనాలని చూస్తుంది, ఇప్పుడు అమ్మ చెప్పిన మార్గం లోనైనా సరే! ఆ పనేదో తను ముందే చేసేస్తే సవతీ రాదు, సవతి తప్పుదారి పట్టే అవసరమూ రాదు.
రామేశ్వరి ఒకసారి ఆలా నిర్ణయించుకొన్నాక చుట్టుపక్కల వాళ్ళవైపు చూపు సారించింది. ఒకవేళ వాళ్ళ వలన పిల్లలు కలిగితే ప్రాబ్లెమ్ ఏమైనా ఉంటుందాని జాగ్రత్తగా పరిశీలించింది. మగా, ఆడా కలిస్తే బిడ్డకు ఎవరి పోలికైనా రావచ్చు. తన పోలిక వస్తే గొడవ లేదు. ఒక వేళ తనతో కలిసిన వాడి పోలిక వస్తే, తన భర్త ఫీచర్స్‌కి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటే అనుమానం వచ్చేస్తుంది. ఇలా లెక్కలు వేస్తూ పోగా మేడమీద వాటాలో వుండే కుర్రాడు పురుషోత్తంకూ, తన భర్తకూ కొన్ని పోలిక లున్నాయనిపించింది. అతనితో సంబంధం పెట్టుకున్నా ప్రమాదం లేదు. కానీ అతను పదిమందితో గొప్పగా చెప్పుకుంటే? చెప్పే రకం కాదు, ఏడాదిగా తను చూస్తోందిగా. ఓ ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగి. చెడు అలవాట్లు, స్నేహాలు లేవు. బుద్ధిమంతుడు. కానీ, మరీ బుద్ధిమంతుడైనా కష్టమే. తన మనసులో భావాన్ని గ్రహించడు. సిగ్గు పడతాడు, బెదురుతాడు, ఫైనల్‌గా కావలసిన కార్యం జరగదు. అతనిలో తనపై ఇంట్రస్టు రగిలించాలి. తెగువ కలిగించాలి. అది అంత కష్టంకాదు. తన అందం ఎవరికైనా మతి పోగొడుతుంది. పెళ్ళయిపోయింది కదాని తనకేసి అంత శ్రద్ధగా చూడటం లేదు కాబోలు. అందాలు పరిచి చూపించి వలలో పడేట్లు చేయాలి.
సాయంత్రాలు చల్లగాలి కోసం అన్నట్టు రామేశ్వరి మడత మంచం పెరట్లో వేసుకొని పడుకోవటం మొదలెట్టింది. భర్త రాత్రి ఎనిమిది దాకా రాడు. కింద పక్కవాటాలో వాళ్లు ఊరెళ్ళారు. పైన పురుషోత్తం పక్కవాటా వాళ్లు ఖాళీ చేసేశారు. కొత్త వాళ్ళు ఇంకా రాలేదు. అతను సాయంత్రం ఆరున్నర, ఏడుగంటలకు ఇంటికొస్తాడు. అతను తన రూములో కూర్చున్నా కనబడే పొజిషన్లో మంచం వాల్చుకొని పల్చటి తెల్లటి చీరా, జాకెట్టు ద్వారా తన అందాల్ని విరజిమ్ముతూ వెల్లకితలా పడుకుంది. చేతిలో పుస్తకం అడ్డు పెట్టుకొని కిటికీలోంచి అతను చూస్తున్నాడో లేదో గమనించింది. రెండోరోజు నుంచి అతను కిటికీ వదలకపోవడం గ్రహించి నవ్వుకొంది. చాటుగా చూడడం తప్ప అంతకంటే ధైర్యం చేయనందుకు తిట్టుకొంది.
‘అతని తప్పేముంది? ఇన్నాళ్లూ తనకలాటి అభిప్రాయం లేదు కాబట్టి అతను అదోలా చూసినా కసిరేట్టు చూసేది. ఈరోజు తన అవసరం కొద్దీ రూటు మారిస్తే అతనూ మారాలనేముంది?’ అని ఊరడిల్లింది. ‘తను మారిందని అతనికి తెలియచేయడం ఎలా?’ మర్నాడు కాలు గోడకు తన్నిపెట్టో, కాలిమీద కాలు వేసుకునో పడుకుంది. చూసే ఏంగిల్ కుదరడానికో ఏమో పురుషోత్తం గదిలోంచి బయటకు వచ్చి నిలబడ్డాడు. అది గమనించనట్లుగా రామేశ్వరి కళ్ళు మూసుకుని పడుకుంది. నాలుగో రోజున ఆమె మీద వేపకాయ ఒకటి పడింది. ఆ తర్వాత మరొకటి. సినిమాతారల మీద ప్రేమకొద్దీ రాళ్ళు పిసిరే అభిమానుల్లాగ ఈ కుర్రాడు చేతికి అందుబాటులో వున్న వేపకాయలు కోసి విసురుతున్నా డన్నమాట. అంటే ప్రేమ, కాయ విసిరేపాటి ధైర్యమూ కలిగేయన్నమాట, చాలు’ అనుకుని కళ్లు తెరిచి, వేపకాయలు పట్టుకొని లేచి అతని గది కెళ్ళింది.
పురుషోత్తం బెదిరి లోపలికి వెళ్ళి కూచున్నాడు. తలుపు తట్టింది. కోపం ప్రదర్శిస్తూ “ఆడవాళ్ళని వేపకాయలేసి కొట్టడం మర్యాదా?” అని అడిగింది. ‘‘వాటంతట అవే పడ్డాయేమో’’ అని అతను సంజాయిషీ ఏదో చెప్పబోతుంటే, ఆపి గది లోపలకి వెళ్లిపోయి ‘‘గాడిద గుడ్డేమీ కాదు, గురి చూసి పడతాయా? ఎక్కడెక్కడ తగిలాయో’’ అంటూ ఆ భాగాలు చూపిస్తూ మీదమీదకి వెళ్లింది. కోపప్రదర్శనలోనే నవ్వు దాచుకోవడం గమనించిన పురుషోత్తమానికి తెగువ వచ్చింది. అయ్యోపాపం అంటూనే ఆమె ఒంటిమీద చేయి వేశాడు. ఆమె చప్పున కౌగలించుకుంది.
పురుషోత్తం అన్నీ త్వరగా నేర్చుకున్నాడు. మొగుడితో మర్యాదగా, స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూనే వారానికోసారైనా తనతో కాళ్ళు కలిపేవాడు. రకరకాల భంగిమల్లో తాము క్రీడించినా తన కడుపు పండలేదు. తనలో లోపం వుందేమో, లేక వురుషోత్తంలో కూడా ఉందేమో ఎవరికి ఎరుక? ఇలా ప్రతి మగాడితో ప్రయోగాలు చేస్తూ పోవాలా? ఈలోపుగా మొగుడు పెట్టిన ఏడాది గడువు పూర్తికావస్తోంది. అతను సంబంధాలు చూడటం మొదలెట్టాడు. ఇవతల వురుషోత్తం ఏకు మేకై కూచున్నాడు. జబర్దస్తీ చేస్తున్నాడు. వ్రతం చెడినా ఫలం దక్కలేదు. పైగా ఇతను చేసే సందడి నలుగురి కళ్ళల్లో పడుతుందన్న భయం ఒకటి పట్టుకొంది. ఇల్లు వదిలిపోతే ఇతని పీడ వదులు తుందనిపించింది.
ఇల్లు అచ్చి రాలేదనీ, ఇల్లు మారితే పిల్లలు కలగవచ్చనీ మొగుణ్ణి పోరింది. అతను సరేనని యిప్పుడున్న ఇంట్లో ఓ వాటాకు మార్చేడు. వురుషోత్తం గొడవ వదిలిందని సంతోషించింది. కానీ అతను ఇంటికి రావడం మానలేదు. ఫ్యామిలీ ఫ్రెండ్ కదాన్నట్లు మొగుడు అభ్యంతర పెట్టడం లేదు. తను పురుషోత్తానికి చెప్పింది. “పాత యింటిలా కాదు. ఈ ఇంట్లో ఎనిమిది వాటాలున్నాయి. ఎవరి కంటైనా పడతాం. మా ఆయన ఆఫీసుకి దగ్గరవడంతో త్వరగా వచ్చేస్తున్నారు. ఇక నన్ను మర్చిపో’’ అని. కానీ అతను వినలేదు. ‘‘అలా అయితే ఈ కాంప్లెక్సులోనే ఓ వాటా నాక్కూడా చూడు. ఏదైనా ఖాళీ అవగానే నాకు చెప్పు. వచ్చి చేరతాను. దగ్గరే ఉంటే అవకాశం చిక్కుతుంది. నిన్ను మర్చిపోవడం, వదిలి పెట్టడం అసంభవం’’ అన్నాడు. తమ సరేలే అని ఊరుకుంది కానీ పురుషోత్తం తన భర్తకు చెప్పాడు. మొగుడికి ఈ మతలబులు తెలియవు కాబట్టి ‘మంచి కుర్రాడు, ఏదైనా వాటా ఖాళీ అవగానే చెప్దాం’ అన్నాడు.
ఇది ఇలా వుండగానే పుట్టింటి కెళ్ళినప్పుడు చెల్లెలు మల్లీశ్వరి, భర్త కంటపడింది. ‘బాగా ఎదిగి వచ్చిందే’ అన్నాడు కళ్ళు ఎగరేస్తూ. దాన్ని చేసుకొందామన్న బుద్ధి అప్పుడే పుట్టి ఉంటుంది. ఈ ఊళ్లో సంబంధాలు చూస్తానని తన తల్లితో చెప్పాడో ఏమో మల్లీశ్వరిని యీ వూరికి తీసుకొచ్చాడు. దానికి బట్టలు కొనిపెడుతున్నాడు. చిన్నచిన్న వస్తువులు కొనిచ్చి అలంకరించుకొని స్టైలుగా ఉండమంటున్నాడు. సినిమాలకీ వాటికీ తిప్పతున్నాడు. ఇదంతా ఉత్తరం ద్వారా తల్లికి తెలియపరిచినా ఆవిడ జవాబివ్వలేదు. ఖర్చు లేకుండా రెండో దానికి పెళ్ళవుతుందని ఆవిడ అంచనా యేమో. తన కడుపు పండలేదు కాబట్టి ఎవరో ఒకర్ని అల్లుడు కట్టుకోవడం ఖాయం. అదేదో తన రెండో కూతుర్ని కట్టుకుంటే ఖర్చు కలిసి వస్తుందని లెక్క వేసి ఉంటుంది. ఆవిధంగా తల్లి సపోర్టు తనకు పోయింది.
మొగుడి తీరు తనకి అర్ధమయింది. వయస్సులో చిన్నది కాబట్టి మల్లీశ్వరి రెండో పెళ్ళివాడిని చేసుకోడానికి స్వతహాగా ఇష్టపడదు. కాబట్టి దాన్ని మెప్పించడానికే ఇంత ఖర్చు చేస్తున్నాడని తెలిసినా, ఏమీ తెలీనట్లు ‘ఎందుకండీ, దాని కివన్నీ’ అంటూ వారించబోయింది. ‘పాపం చిన్నపిల్ల, సరదా పడుతోంది’ అన్నాడు. ఏం? ఇన్నాళ్ళూ తన మీద అంత ఖర్చు పెట్టలేదేం? తను మాత్రం సరదా పడలేదా?
ఓసారి యధాలాపంగా అన్నట్లు అన్నాడు, ‘అక్కచెల్లెళ్ళు సవతులయితే గొడవుండదు. సర్దుకుపోతారు’ అని. ఎలా సర్దుకుపోతారు, కొత్త పెళ్ళానికి అన్నీ దోచి పెడుతూంటే? దానికి పిల్లలు పుడితే దాన్ని నెత్తిన పెట్టుకుంటాడు. సొంత చెల్లెలైనా సరే గొడ్రాలంటూ తనని తక్కువగా చూడక మానదు. ఖర్మ! ఇంట్లో తను వండి పెడుతున్న అన్నం తింటూనే చెల్లెలు శత్రువులా దాపురించింది. మొగుడి సంగతి సరేసరి. ఇవి చాలవన్నట్లు పక్కవాటా ఖాళీ అయిందని మొగుడు పురుషోత్తాన్ని తెచ్చి పెట్టాడు. ఈ మూడు సమస్యల్లోంచి బయటపడడం ఎలాగరా భగవంతుడా?
పురుషోత్తానికి సంతోషపడాలో, బాధపడాలో తెలియడం లేదు. ఈ ఇంటికొస్తే చాలు రామేశ్వరి వచ్చి పక్కలోకి వాలుతుందనుకొన్నాడు. కానీ వాలడం లేదు. సాకులు చెపుతోంది. అదీ బాధ. తనకోసం వెళ్ళినప్పుడల్లా వాళ్ళ చెల్లెలు మల్లీశ్వరి కనబడి పలకరిస్తోంది. తనంటే ఇంట్రస్టు చూపిస్తోంది. అందుకు సంతోషపడాలా? అందగత్తె ఐన మల్లీశ్వరికి తనంటే ఇష్టమనడంలో ఏమాత్రం సందేహం లేదు. అదోలా నవ్వుతుంది. మంచినీళ్ళ గ్లాసు అందిస్తూ వేళ్ళు తగిలిస్తుంది. తనెదురుగా పైట మాటిమాటికీ సవరిస్తూంటుంది. నిజానికి రామేశ్వరి కంటే మల్లీశ్వరి చురుగ్గా, కనబడుతుంది. వాళ్ళ బావ ప్రోత్సాహంతో స్టైలుగా, చలాకీగా తిరుగుతుంది. చమత్కారంగా, నిర్భయంగా మాట్లాడుతుంది. పాత పరిచయం కొద్దీ రామేశ్వరిని పట్టుకు వేళ్ళాడడం కానీ, మల్లీశ్వరి జిగిబిగిల ముందు తన కంటె పెద్దదైన రామేశ్వరిని పట్టించుకోనక్కరలేదు. చిన్నదైన మల్లీశ్వరినే లైన్లో పెట్టవచ్చు. కానీ వాళ్ళ బావ ఊరుకోడేమోనని తన జాగ్రత్తలో తనున్నాడు.
కానీ మల్లీశ్వరి ఎవరూ లేకుండా చూసి నూతి దగ్గర కాలు తొక్కినప్పుడు ఆశ పుట్టింది. మర్నాడు ఆమె పళ్ళు తోముకుంటూంటే వెనక నుంచి నీళ్ళు చల్లాడు. వెనక్కి తిరిగి వెక్కిరించింది. ఆ రాత్రి జడ గుంజితే గిల్లి వదిలి పెట్టింది. మల్లె పొద దగ్గర పత్రిక చదువుకుంటూంటే తనెళ్ళి అడిగాడు. ‘బజారు కెడుతున్నాను. ఏమైనా తేవాలా?’ అని. చిరునవ్వు నవ్వి, పత్రిక పేజీలు తిప్పి ఓ యాడ్ చూపించి ‘ఇది తెచ్చిపెడతావా?’ అంది. తను సంబరపడుతూ ‘మరి సైజో?’ అని అడిగాడు. ‘చూస్తున్నావుగా, ఊహించు.’ అంది కన్నుకొడుతూ. ‘తెస్తా కానీ సరిపోయిందో లేదో నేనే చెక్ చేస్తా.’ అని షరతు పెట్టాడు. ‘ఓకె, కానీ నీ రూములో కాదు. వస్తూనో, పోతూనో ఎవరి కంటైనా పడితే ప్రమాదం. రేపు సాయంత్రం నాలుగు గంటలకు కామన్ బాత్రూమ్లో కలుద్దాం.’ అందామె.
‘..పైన కప్పు లేదుగా..’
‘..చుట్టూ యిళ్లు లేవుగా..’
ఇళ్లు లేవు కానీ జామి చెట్టు ఉంది. ఆ చెట్టెక్కిన పదేళ్ల బుజ్జిగాడు వీళ్ల సరసం చూసి కెవ్వున కేక పెట్టాడు. ‘‘ఏంటక్కా – ఏం చేస్తున్నావ్?’’ అంటూ. పురుషోత్తం, మల్లీశ్వరి చివ్వున పైకి చూశారు. “రామేశ్వరక్క కాయలు కోయమంటే చెట్టెక్కాను. మీ ఇద్దరూ ఏం చేస్తున్నారు? కలిసి స్నానం చేస్తున్నారా?’’ అంటూ అరిచాడు. బుజ్జిగాడు అరుపులకు పోగుపడ్డ పదిమంది జనం ఎదురుగా బాత్రూమ్లోంచి యిద్దరూ బయటపడ్డారు. మల్లీశ్వరి వెనక నక్కిన వురుషోత్తంపై ఎవరో చెయ్యెత్తారు కూడా! రామేశ్వరి అడ్డుపడింది. ఇద్దర్నీ చచ్చేట్లా చివాట్లేసింది. పురుషోత్తం తన పెద్దలతో మాట్లాడి మల్లీశ్వరిని పెళ్ళాడతానని ఒట్టేసేదాకా ప్రతీవాడూ తిడుతూనే ఉన్నాడు.
రామేశ్వరి ఆ రాత్రి పురుషోత్తం వాటా కెళ్ళింది. అతను ఎగిరాడు- ‘‘అందర్లోనూ అంతలా తిట్టేవు. నీ సంగతి బయట పెడితే ఏం చేసేదానివి?’’ అని.
“రెడ్‌హేండెడ్‌గా పట్టుబడ్డావు. నువ్వేం చెప్పినా దానికి విలువ ఉండదులే. మరి నా చెల్లెలి పరువు నేను కాపాడుకోవద్దా? పెళ్లి చేసుకుంటావుగా!’’
‘‘మా వాళ్లు కట్నం ఆశిస్తున్నారు… మీవాళ్లు యిచ్చే పరిస్థితిలో లేరని విన్నాను.’’
‘‘డబ్బు ఎక్కువ సంతోషానిస్తుందా? ఒకళ్లకిద్దరుండడం యిస్తుందా?’’
పురుషోత్తం మొహం వెలిగింది. ‘‘నిజమే, ఒకే ఫ్యామిలీ అయితే అవకాశాలు ఎక్కువుంటాయి. పైగా పక్కపక్క వాటాల్లో ఉంటాం.’’ అన్నాడు.
ఒక్క దెబ్బతో భర్తతో చెల్లెలి సమస్య, పురుషోత్తం సమస్య తీరిందన్న ఆనందం రామేశ్వరిని ముంచెత్తింది. పురుషోత్తంతో తన వ్యవహారం బయటపడితే తనను వదిలేయడానికి మొగుడికి కారణం దొరికేది. చెల్లెలికి పెళ్లయిపోతోంది కాబట్టి భర్త వేరెవరినైనా సవతిగా తెస్తే అతనితో పోట్లాడ్డానికి తల్లి సహకరిస్తుంది. మనసు తేలికపడడంతో ఆ రాత్రి ఉత్సాహంతో ఏ అరమరికలూ లేకుండా భర్తతో రమించింది. ఆమె భర్త మల్లీశ్వరి ప్రేమకలాపం తెలిసినపుడు నిరాశపడ్డాడు, తన చేత ఎన్నో కొనిపించుకుని దగా చేసినందుకు పళ్లు నూరుకున్నాడు. ఇంకో అమ్మాయితోనైనా యిదే రిస్కు కదా! వీళ్ల దగ్గర భంగపడే బదులు అహంకారాన్ని అణచుకుని డాక్టరు దగ్గర కెళ్లి పరీక్షలు చేయించుకుంటే మేలు అనుకున్నాడు. తనలో లోపం లేదంటే భార్యనీ చూపించి చికిత్స చేయించవచ్చు. ఈ ఆలోచన రాగానే అతనికి భార్య మీద మీద ప్రేమ పెల్లుబికి సహకరించాడు.
ఆనందదాయకమైన యీ కలయిక ఫలితమో ఏమో వాళ్లు డాక్టరు దగ్గరకి వెళ్లవలసిన అవసరం పడకుండానే రామేశ్వరి గర్భవతి అయింది. ‘ఈ సంతోషసమయంలో నీకేం కావాలో కోరుకో’ అన్నాడు భర్త. పురుషోత్తం నుంచి దూరంగా పారిపోవడానికి యిదే అదను అనుకుంటూ ‘మన పిల్లలు చక్కగా పెరిగే వాతావరణం యీ ఊళ్లో లేదండి. ఏదైనా మంచి టౌనుకి బదిలీ చేయించుకోండి.’ అంది రామేశ్వరి. సరేనన్నాడు భర్త. పురుషోత్తం, మల్లీశ్వరి పెళ్లి నాటికే వాళ్లు వేరే ఊరికి వెళ్లిపోయారు. తన మాట విని తను చెప్పిన ప్రకారమే పురుషోత్తాన్ని ముగ్గులోకి దింపినందుకు చెల్లెలికి ఖరీదైన పెళ్లి పట్టుచీర కొనిపెట్టింది రామేశ్వరి.
‘‘వ్యథా వనితాయణం’’లో మరో కథ వచ్చే నెల తొలి బుధవారం.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2022)