ఎన్టీఆర్ తనయ ఉమామహేశ్వరి ఆత్మహత్యపై వివాదం చెలరేగింది. ఎన్టీఆర్ కూతురి ఆత్మహత్యకు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ బాధ్యత వహించాలని నందమూరి లక్ష్మిపార్వతి డిమాండ్ చేశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, లోకేశ్‌లపై సంచలన ఆరోపణలు చేశారు. ఉమామహేశ్వరి ఆత్మహత్యకు ముందు సూసైడ్ లెటర్ రాశారని, అందులో తనను బాబు, లోకేశ్ వేధించినట్టు ఉందనే ప్రచారం జరుగుతోందన్నారు. మీడియా సమావేశంలో లక్ష్మిపార్వతి ఏమన్నారంటే…
కంఠమనేని ఉమామహేశ్వరి ఆకస్మిక మరణం చాలా ఆవేదన కలిగిస్తోందన్నారు. ఆమె మరణం మిస్టరీగా వుందని లక్ష్మిపార్వతి సంచలన కామెంట్ చేశారు. ఉమామహేశ్వరి మరణంపై సోషల్ మీడియాలో అనేక వదంతులు వస్తున్నట్టు ఆమె చెప్పారు. వాటిలో కొన్ని నిజాలు, కొన్ని అబద్ధాలు ఉండొచ్చన్నారు. అయితే చంద్రబాబు హత్యా రాజకీయాలు, నీచ మనస్తత్వం తెలిసిన నేపథ్యంలో ఉమామహేశ్వరి మరణంపై కొన్ని అనుమానించక తప్పదన్నారు. మొదటి నుంచి ఎన్టీఆర్ కుటుంబానికి ఓ శనిలా చంద్రబాబు పట్టి పీడిస్తున్నారని ఆమె వాపోయారు. చంద్రబాబు వల్లే ఎన్టీఆర్ ఫ్యామిలీ కుటుంబ పెద్దను కోల్పోవాల్సి వచ్చిందన్నారు.
తన భర్త ఎన్టీఆర్ మరణానికి ముందు రోజు ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. సింహగర్జన పేరుతో చంద్రబాబు దుర్మార్గాల్ని, వెన్నుపోటుని ప్రజలకి చెప్పాలని ప్రణాళిక రూపొందించుకుంటున్న సమయంలో, ఎన్టీఆర్ బయటికొస్తే ఎక్కడ తన రాజకీయ జీవితం ముగిసిపోతుంతో, అలాగే సీఎం పదవి పోతుందనే భయంతో ఆయనకు రూపాయి కూడా అందకుండా చేసి గుండెపోటుతో మరణించేలా చేశారని ఆరోపించారు.
ఎన్టీఆర్ మరణానికి ఒక్కరోజు ముందు ఆయన బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేస్తూ స్టే ఆర్డర్ తీసుకొచ్చారని నాటి సంగతుల్ని గుర్తు చేశారు. చంద్రబాబు వ్యక్తిత్వం తెలిసిన ఎన్టీఆర్ కుటుంబ సభ్యురాలిగా ఉమామహేశ్వరి మరణం వెనుక ఏదో కారణం ఉందని నమ్ముతున్నానన్నారు. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాసి ఉండొచ్చని పోలీసులు చెప్పారన్నారు. ఉమామహేశ్వరి బాగా చదువుకున్న అమ్మాయన్నారు. అలాంటి అమ్మాయి తప్పకుండా ఆత్మహత్యకు ముందు లెటర్ రాసి వుంటారన్నారు.
ఉమమహేశ్వరి రాసిన సూసైడ్ లెటర్ ఏమైందని ఆమె ప్రశ్నించారు. అది కూడా చంద్రబాబు ప్రవేశించిన తర్వాతే లేఖ మాయమైందని చెబుతున్నారని ఆమె చెప్పుకొచ్చారు. ఈ ప్రచారాన్ని తాను నమ్ముతున్నట్టు లక్ష్మిపార్వతి తెలిపారు. ఇట్లాంటివి జరిగినపుడు కోడెల శివప్రసాద్ మరణం కళ్ల ముందు నిలబడుతుందన్నారు. చంద్రబాబు చేసిన అవమానం, కుమారుడు చేసిన దుర్మార్గాలకి కోడెల బలి అయ్యారన్నారు. దాన్ని తమ ప్రభుత్వంపై చంద్రబాబు రుద్ధాడని మండిపడ్డారు. కానీ చంద్రబాబు వల్ల అవమానానికి గురైన విషయం సెల్‌ఫోన్‌లో కోడెల రికార్డు చేశాడన్నారు. ఆ సెల్‌ఫోన్‌ను చంద్రబాబు దొంగలించాడని లక్ష్మిపార్వతి ఆరోపించారు. ఆ సెల్‌ఫోన్ ఇప్పటికీ అడ్రస్ లేదన్నారు.
ఎన్టీఆర్ కుటుంబంలో చంద్రబాబు అనే వ్యక్తే లేకపోయి వుంటే ఎంతో ప్రశాంతంగా ఉండేదన్నారు. ఉమామహేశ్వరి మరణం తనను ఎంతగానో బాధించిందన్నారు. మరణించిన రోజు తాను భోజనం కూడా చేయలేదన్నారు. 30 ఏళ్ల క్రితం ఉమా తన ఇంటికి వచ్చిందన్నారు. పట్టుచీర, ఓ నగ పెట్టి ప్రేమగా పంపించానన్నారు. ఎన్టీఆర్ కుటుంబంలో పిరికితనం లేదని, అలాంటిది ఉమామహేశ్వరి ఆత్మహత్య ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందని ఆమె ప్రశ్నించారు.
చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ఓ ఆస్తి విషయంలో ఉమామహేశ్వరిని వేధిస్తున్నారనే ప్రచారం జరుగుతోందన్నారు. ఆ విషయమై వారి మధ్య పెద్ద గొడవ జరిగిందని, ఆ సంగతులు సూసైడ్ నోట్‌లో రాశారనే ప్రచారం విస్తృతంగా సాగుతోందని లక్ష్మిపార్వతి చెప్పుకొచ్చారు. సూసైడ్ నోట్ ఎక్కడ దాచావంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారని ఆమె గుర్తు చేశారు.