రాజ‌కీయ గురివింద‌లు

రాజ‌కీయాల్లో గురివింద గింజ‌లే ఎక్కువుంటాయి. త‌మ త‌ప్పుల్ని మ‌రిచిపోయి ఎదుటి వాళ్ల గురించి మాట్లాడుతుంటారు. తాము చేస్తే రాజ‌కీయం, ఇంకొక‌రు చేస్తే అవ‌కాశవాదం. దీనికి ఉదాహ‌ర‌ణ ఫిరాయింపుల గురించి కేసీఆర్‌, కేటీఆర్ మాట్లాడ్డం. తండ్రీకొడుకులిద్ద‌రూ…

రాజ‌కీయాల్లో గురివింద గింజ‌లే ఎక్కువుంటాయి. త‌మ త‌ప్పుల్ని మ‌రిచిపోయి ఎదుటి వాళ్ల గురించి మాట్లాడుతుంటారు. తాము చేస్తే రాజ‌కీయం, ఇంకొక‌రు చేస్తే అవ‌కాశవాదం. దీనికి ఉదాహ‌ర‌ణ ఫిరాయింపుల గురించి కేసీఆర్‌, కేటీఆర్ మాట్లాడ్డం. తండ్రీకొడుకులిద్ద‌రూ గ‌జ‌నీలా గ‌తం మ‌రిచిపోయారు.

బీఆర్ఎస్‌ని ఖాళీ చేసే ప‌ని మీద రేవంత్‌రెడ్డి ఉన్నాడు. ఇప్ప‌టికి ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. ఇంకా చేరుతారు. అధికారంలో ఇన్నాళ్లు వుంది కాబ‌ట్టి బీఆర్ఎస్‌లో ఉన్నారు త‌ప్ప‌, వాళ్ల‌కేమీ కేసీఆర్‌పై విధేయ‌త లేదు. ఉండాల్సిన అవ‌స‌రం లేదు. తానే పార్టీగా , మాటే శాస‌నంగా వ్య‌వ‌హ‌రించిన కేసీఆర్ ఇక‌పై ఫామ్‌హౌస్ నుంచే పార్టీ న‌డ‌పాల్సి వుంది.

ఫిరాయింపుల‌పై సుప్రీంకోర్టుకి వెళ్తామ‌ని కేసీఆర్ అన‌డం జోక్‌. 2014లో అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఒక ఉద్య‌మంగా ఫిరాయింపుల్ని ప్రోత్స‌హించ‌డం ఆయ‌న మ‌రిచిపోయారు. ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలు, 11 మంది టీడీపీ ఎమ్మెల్యేల‌ను పార్టీలో చేర్చుకున్న‌ది గుర్తు లేదు. అప్పుడు ప్ర‌జ‌లు, ప్ర‌జాస్వామ్యం అనే ప‌దాలు వ‌ల్లించ‌లేదు.

2014 నుంచి 18 వ‌ర‌కు మొత్తం 47 మందిని ఫిరాయించిన చ‌రిత్ర కేసీఆర్‌కు ఉంది. న‌లుగురు ఎంపీలు, 25 మంది ఎమ్మెల్యేలు, 18 మంది ఎమ్మెల్సీలు దూకేశారు. ఇప్పుడు ఆయ‌న పార్టీ వంతు వ‌చ్చింది.

కేసీఆర్ గురువు చంద్ర‌బాబునాయుడు ఈ విష‌యంలో ఏమీ తీసిపోడు. గ‌తంలో వైసీపీని చీల్చి కొంద‌ర్ని మంత్రుల్ని కూడా చేసాడు. త‌ర్వాత అంద‌రూ ఓడిపోయారు. జ‌గ‌న్ అతి ఆత్మ విశ్వాసంతో మొన్న ఓడిపోయాడు. వైసీపీ కూడా శుద్ధ‌పూస కాదు. టీడీపీని ప‌నిగ‌ట్టుకుని చీల్చ‌క‌పోయినా , అనేక మంది రెండో శ్రేణి నాయ‌కుల్ని చేర్చుకుంది.

ఈ సారి చంద్ర‌బాబునాయుడు వైసీపీని య‌ధాత‌ధంగా ఉండ‌నిస్తాడా, ఆ 11 మంది ఎమ్మెల్యేలు, న‌లుగురు ఎంపీల్లో చీలిక తెస్తాడా? అనేది చూడాలి. ఇక ఎమ్మెల్సీల్లో ఎలాగూ ఫిరాయింపులుంటాయి. టీడీపీకి అక్క‌డ బ‌లం లేదు కాబ‌ట్టి, రాజ్య‌స‌భ‌లో కూడా జంపింగ్‌లు వుంటాయి.

పార్టీని కాపాడుకోవ‌డం జ‌గ‌న్‌కి అంత సుల‌భం కాదు. అయితే జ‌గ‌న్ ఆశ ఏమంటే బాబు త‌ప్పులు చేస్తాడ‌ని. అల‌విమాలిన ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌లేక ప్ర‌జ‌ల్లో చెడ్డ‌పేరు తెచ్చుకుంటాడ‌ని. అయితే కేవ‌లం ప‌థ‌కాల వ‌ల్లే ఓట్లు రావ‌ని తేలిపోయింది. చంద్ర‌బాబు మీద వ్య‌తిరేక‌త రావ‌డం, ఆశించ‌డం అంత ఈజీ కాదు. జ‌గ‌న్‌లాగా బాబుకు నియంత ల‌క్ష‌ణాలు లేవు. ప‌నిగ‌ట్టుకుని ఏ వ‌ర్గాన్ని దూరం చేసుకోడు. ప‌ట్టువిడుపులు తెలుసు.