నెల రోజులుగా టెన్షన్ పెడుతున్న ఎన్నికల ఫలితాల అంచనాలు వెలువడ్డాయి. తొంభై శాతం ఎగ్జిట్ పోల్ సర్వేలు వైకాపా ఓటమినే అంచనా వేసాయి. తేదేపా కూటమి అధికారం చేపట్టబోతోందని గట్టిగా చెప్పాయి. ఒకటి రెండు సర్వేలు మాత్రం వైకాపా అధికారంలోకి వస్తుందని చెప్పాయి. కొన్ని సర్వేలు వైకాపా వెనుక నిల్చున్నాయి. కానీ ఎంత కాదన్నా 90 శాతం సర్వేలు వైకాపా ఓటమిని అంచనా వేయడం అంటే కాస్త ఆలోచించాల్సిందే.
ఈ సర్వేలు ఎంత వరకు నిజమవుతాయి అన్నది ఇంకో చిన్న సందేహం మిగిలి వుంది. ఈ సందేహం మరో రెండు రోజుల్లో తీరిపోతుంది. ప్రజలు సైతం యాంటీ జగన్ అనే నినదిస్తే ఇక జగన్ అండ్ కో చేసేదేమీ లేదు. అయిదేళ్ల కాలంలో జనాలకు డబ్బులు పంచడం అనే దాని మీద కీలకంగా దృష్టి పెట్టుకుని, మిగిలిన వాటిని పక్కన పెట్టడం, చేసినా చెప్పకుండా, డబ్బులిచ్చా.. అనే చెప్పుతూ రావడం వంటి చేసిన నష్టం అంతా ఇంతా కాదు.
భూ రిజిస్ట్రేషన్ చట్టం అన్నది ఎంత డ్యామేజ్ చేయాలో అంతా చేస్తోందని ముందుగా తేరుకోలేకపోయారు. పాస్ పుస్తకాల మీద, హద్దు రాళ్ల మీద వేసుకున్న పేర్లు, బొమ్మలు, ఈ వివరణ ను జనం నమ్మకుండా చేసాయి. ఈనాడు తో పెట్టుకున్న పేచీ చేసిన డ్యామేజీ ఇంతా అంతా కాదు. పత్రికను పణంగా పెట్టి, ఈనాడు చేసిన యాంటీ జగన్ చేసిన ప్రచారం ఇంతా అంతా కాదు. దాని ప్రభావం లేదని అస్సలు అనడానికే లేదు.
యాంటీ జగన్ అనే దానికి జనం ఆమోద ముద్ర పడిపోతే అప్పుడు ఇక పోస్ట్ మార్టమ్ అంటూ కారణాలు వెదుక్కోవడం మొదలుపెడితే కనీసం వందకు పైగానే దొరికేస్తాయి. అదే కనుక తేదేపా కూటమి ఓడిపోతే సింగిల్ రిజన్… జగన్ జనాలకు అందించిన డబ్బులు అనుకోవాల్సి వుంటుంది.