ఉత్తరాంధ్రలో ఎవరు గెలుస్తారు అన్న ఎన్నికల ఫలితాల అంచనాలను బేరీజు వేయడంతో ప్రముఖ సర్వే సంస్థలు ఎంతవరకూ సక్సెస్ అయ్యాయి అన్నది జూన్ 4న తెలుస్తుంది. అయితే మెజారిటీ సర్వేలు చూస్తే పెద్దగా ఆయాసపడకుండా 2014 రిజల్ట్ ని కాపీ పేస్ట్ కింద కొట్టేసి ఇవే ఎగ్జిట్ పోల్స్ అని చూపించే ప్రయత్నం చేశాయని అంటున్నారు.
ఆ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో అయిందింట నాలుగు ఎంపీ సీట్లు టీడీపీ కూటమి గెలుచుకుంది. ఈసారి కూడా అవే సీట్లు యధాతధంగా కట్టబెట్టేశారు. వైసీపీకి ఒక్క అరకు సీటుని మాత్రమే ఇచ్చారు. అలాగే ఆనాడు మూడు జిల్లాలలో తొమ్మిది అసెంబ్లీ సీట్లకే వైసీపీ పరిమితం అయితే ఈసారి వాటినే అటూ ఇటూ జిల్లాలలో మార్చి నంబర్లు వేసేసారు అని అంటున్నారు.
బీసీలు అత్యధికం ఉన్న ఉత్తరాంధ్రలో వారి ఓట్లు కూటమి వైపే టర్న్ అయ్యాయని చూపిస్తున్నారు. అలాగే కాపులు గుత్తమొత్తంగా ఒకే పార్టీకి వేశారు అని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక శాతం ఉన్న కాళింగులను సైతం కూటమి ఖాతాలోనే కలిపేశారు.
ఇలా ఎగ్జిట్ పోల్స్ సర్వే చిత్రాలు చాలానే కనిపిస్తున్నాయి. పోలింగ్ అనంతరం అంచనాలు తీసుకుంటే చాలా చోట్ల వర్గ పోరు వల్ల టీడీపీ కూటమి నష్టపోతుందని భావించారు. అలాంటి సీట్లలో వైసీపీకే భారీ రాజకీయ లాభం అని కూడా పేర్కొన్నారు.
కానీ ఎగ్జిట్ పోల్స్ చూస్తే అవన్నీ కూడా కూటమికే అని చెప్పడం బిగ్ డిబేట్ గా మారింది. ఓట్ల చీలిక అన్నది ఏ పార్టీకి అయినా ఒకేలా ఉంటుంది కదా అన్నది అంటున్నారు. ఇవన్నీ చూస్తూంటే ఎగ్జిట్ పోల్స్ సర్వేల విషయంలో జనాలలో రకరకాలైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దాంతో ఉసూరుమనిపించాయని ఎగ్జిట్ పోల్స్ ని అనుకునే పరిస్థితి ఉంది. అసలు ఫలితాల మీద మరింత ఉత్కంఠను పెంచేలా ఈ అంచనాలు ఉన్నాయని అంటున్నారు.