జంపింగ్ జఫాంగులు రెడీ?

ఎన్నికలలో ప్రజల వంతు పూర్తి అయింది. ఓట్లేశారు. అంటే తాంబూలాలు ఇచ్చేశారు. ఇక తన్నుకోవడమో సర్దుకోవడమో పార్టీల వంతు. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ తీరు చూస్తే ఏపీలో బొటా బొటీతోనే అధికారం ఏదో ఒక…

ఎన్నికలలో ప్రజల వంతు పూర్తి అయింది. ఓట్లేశారు. అంటే తాంబూలాలు ఇచ్చేశారు. ఇక తన్నుకోవడమో సర్దుకోవడమో పార్టీల వంతు. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ తీరు చూస్తే ఏపీలో బొటా బొటీతోనే అధికారం ఏదో ఒక పార్టీకి దక్కుతుందని అంచనాలు ఇచ్చారు.

అంటే కొందరు అటు నుంచి ఇటు జంప్ అయితే అధికారమే చేయి మారిపోతుంది అన్న మాట. దాంతో ఎన్నికల ఫలితాల తరువాత క్యాంప్ పాలిటిక్స్ స్టార్ట్ అయినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. కర్నాటకలో అలాగే అనుకున్నారు  కానీ కాంగ్రెస్ కి భారీ ఆధిక్యత దక్కింది, బతికిపోయింది. తెలంగాణాలో సైతం హంగ్ వస్తుందని అంచనాలు కొన్ని వినిపించాయి.

అక్కడ కూడా ముందస్తుగా క్యాంప్ పాలిటిక్స్ కి కొన్ని పార్టీలు తెర తీశాయి. ఏపీలో అయితే క్యాంప్ రాజకీయాలు 1984 నుంచే ఉన్నవే. వాటి వల్లనే ఎన్టీయార్ రెండు సార్లు అధికారం కోల్పోయారు. ఇపుడు అలాంటి రాజకీయం ఏపీలో తెర తీసేందుకు అవకాశం ఉందా అన్న చర్చ సాగుతోంది.

ఓటమిని ఎవరూ జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. దాంతో ఒక మాదిరి ఆధిక్యతతో ఒక విధంగా 110 సీట్లు దాకా సాధిస్తే ఫరవాలేదు కానీ బొత్తిగా  90 నుంచి 95 లోపల సీట్లు వస్తే మాత్రం జంపింగ్ జఫాంగులతో లకు గిరాకీ వచ్చినా వస్తుంది అన్న ప్రచారం సాగుతోంది.

ఈ విషయంలో సిద్ధహస్తులైన రాజకీయ నేతలు కూడా ఉన్నారు. ఉత్తరాంధ్రలో అలా గోడ దూకే వారు ఎవరా అన్న సెర్చింగ్ కూడా సాగుతోంది అని అంటున్నారు. గతంలో ఒక పార్టీలో పనిచేసి ఇపుడు వేరే పార్టీలో టికెట్ సాధించి గెలుపు గుర్రాలు అయ్యే వారి మీద నిఘా ఉందని అంటున్నారు. మరి ఆ పార్టీలు ఏమిటో ఆ జంపింగ్ జఫాంగులు ఎవరో బొటా బోటీ మెజారిటీలు వచ్చిన సందర్భంలోనే తేలుతుంది. లేకపోతే అందరూ మంచివారే అన్నట్లుగా సాఫీగానే ఏపీలో కొత్త ప్రభుత్వం వస్తుంది అని అంటున్నారు. జూన్ 4 రిజల్ట్స్ తరువాత రాజకీయం ఏ మలుపు తీసుకుంటుంది అన్నది చూడాల్సి ఉంది.