చంద్రబాబునాయుడి రాజగురువు రామోజీరావు మీడియా శ్రీరంగనీతులు చెబుతోంది. ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పని చేసిన అధికారులను వెనకేసుకు రావడమే ఏకైక లక్ష్యంగా ఆ పత్రిక పెట్టుకుంది. “పచ్చ”పాతంగా వ్యవహరించిన ఎన్నికల అధికారులపై చర్యలు తీసుకున్న వారిని టార్గెట్ చేయడం తన బాధ్యతగా రామోజీ మీడియా భావిస్తోంది.
పల్నాడులో అల్లర్లకు కారణంగా భావించి ఎస్పీ బిందుమాధవ్‌పై సస్పెన్షన్ వేటు వేయగా, వెంటనే ఆయన్ను వెనకేసుకొస్తూ బ్యానర్ కథనం రాయడం చూశాం. అలాగే ఎస్పీకి కిందిస్థాయి నుంచి డీజీపీ వరకూ ఏ ఒక్కరూ సహకరించలేదని రాయడం తెలిసిందే. తాజాగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఆర్వో శ్రీలేఖ చౌదరిపై ఎన్నికల సంఘం వేటు వేయగా, ఆమెకు వత్తాసు పలుకుతూ పచ్చ పత్రిక కథనం రాసింది.
ఈ కథనం ప్రారంభంలోనే బాబు రాజగురువు మార్క్ శ్రీరంగ నీతులు రాయడం గమనార్హం. ఆ నీతులేంటో తెలుసుకుందాం.
“ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు అత్యంత పవర్ఫుల్. వారిని బెదిరించడం, అంతు చూస్తామనడం తీవ్రమైన నేరం. ఆర్వోను ఒక అభ్యర్థి బెదిరిస్తే వెంటనే కేసు పెట్టి, అరెస్ట్ చేయాలి. కానీ ప్రకాశం జిల్లాలో అలా జరగలేదు”
ఈ నీతులన్నీ దేనికోసమంటే… శ్రీలేఖను ఎన్నికల కౌంటింగ్ విధుల నుంచి తప్పించి, బదిలీ చేసినందుకు. నిజాయితీపరురాలైన యువ అధికారిణికి ఇచ్చే బహుమతి ఇదేనా? అంటూ ఎల్లో పత్రిక నిలదీసింది. శ్రీలేఖకు ప్రకాశం కలెక్టర్ మొదలుకుని క్షేత్రస్థాయి సిబ్బంది వరకూ అంతా నరకం చూపారట!
ఏప్రిల్ 24న నామినేషన్ సందర్భంగా శ్రీలేఖను చెవిరెడ్డి బెదిరించారని, 28న ఆమె ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఎల్లో పత్రిక తీవ్ర ఆవేదన, ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. బెదిరింపులకు ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్పడినా, మరొకరైనా వెంటనే ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలి. కానీ రామోజీరావు పచ్చ(క్ష)పాత దృష్టితోనే అసలు సమస్య.
ఎన్నికల అధికారి ఎంతో పవర్ ఫుల్ అని ఇప్పుడే రామోజీరావు పత్రికకు తెలిసిందా? 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏకంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది విషయంలో చంద్రబాబునాయుడు వ్యవహరించిన తీరు చంద్రబాబు రాజగురువు పత్రిక మరిచిపోయినట్టుంది. నాడు ఎన్నికల కార్యాలయానికి వెళ్లి, మరీ ఏపీలో ఎన్నికల యంత్రాంగానికి సారథ్యం వహిస్తున్న గోపాలకృష్ణ ద్వివేదిని మీ అంతు చూస్తానని బెదిరించడాన్ని ఏమనాలి? ఈ ఘటనను రాష్ట్ర ప్రజానీకం మరిచిపోయిందని ఎల్లో పత్రిక అనుకుంటోందా?
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయానికి చంద్రబాబు వెళ్లి ద్వివేదిని బెదిరించిన వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ఉన్నాయి. నాడు నిస్సహాయ స్థితిలో ద్వివేది ఉండడాన్ని చూసిన రాష్ట్ర ప్రజానీకం షాక్‌కు గురైంది. ఆ తర్వాత చంద్రబాబుకు ప్రజలు షాక్ ఇచ్చారు. అది వేరే విషయం. శ్రీరంగనీతులు ఇతరులకు చెప్పడానికేనా? తాము పాటించడానికి ఏవైనా మిగిలి ఉన్నాయా? అనేది ఒకసారి రాజగురువు మీడియా చూసుకుంటే మంచిది.