ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఎగ్జాట్ ఫలితాల వెల్లడికి ముందు వచ్చిన ఎగ్జిట్ ఫలితాలపై ఉత్కంఠకు తెరపడింది. అయితే ఎల్లో బ్యాచ్ ఓ సర్వే సంస్థను టార్గెట్ చేయడం గమనార్హం. ఆరా మస్తాన్ సర్వే సంస్థపై ఎల్లో టీమ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. తద్వారా ఆ సంస్థ సర్వే ఫలితాలపై పచ్చదళం ఎంతగా భయపడుతున్నదో అర్థం చేసుకోవచ్చు.
వైసీపీ 94 నుంచి 104 స్థానాలను దక్కించుకుని అధికారం చేజెక్కించకుంటుందనేది ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్ ఫలితాల సారాంశం. వైసీపీకి ఇంతకు మించి సీట్లు వస్తాయనే సర్వే సంస్థల్ని వదిలేసి, కేవలం ఆ సంస్థను మాత్రమే టీడీపీ టార్గెట్ చేస్తోందంటేనే… విశ్వసనీయత గురించి అర్థం చేసుకోవచ్చు. గత ఎన్నికల సందర్భంలోనూ ఆరా మస్తాన్ ఇదే రీతిలో ఫలితాలను వెల్లడించారు. ఆ తర్వాత కూడా పలు ఎన్నికల్లో అతను చెప్పిందానికి, వాస్తవ ఫలితాలకు సరిపోలడంతో నమ్మకం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని గణాంకాలతో సహా వివరించిన మస్తాన్‌పై టీడీపీ అధికార ప్రతినిధులు తీవ్ర ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల గురించి కాకుండా, మస్తాన్ గతంలో టీడీపీ టికెట్ అడిగారని, ఇవ్వలేదనే అక్కసుతో తాము అధికారంలోకి రాలేమని చెబుతున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపించడం గమనార్హం.
ఇదే టీడీపీ కూటమికి 161 సీట్లు వస్తాయని, అలాగే నాలుగు చోట్ల మాత్రమే వైసీపీ గెలుస్తుందని, పది నియోజకవర్గాల్లో టప్ ఫైట్ అని చెప్పిన సంస్థలు మాత్రం పచ్చదళానికి ముద్దొస్తున్నాయి. టీడీపీ కూటమికి 161 సీట్లు వస్తాయంటే, కనీసం తామైనా నమ్ముతున్నామా? లేదా? అని ఆలోచించడం లేదు.
అనుకూలంగా చెబితే చాలు జై కొట్టడం, లేదంటే ఛీ కొట్టడమే ఒక్కటే ప్రామాణికంగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. కానీ ఒకే ఒక్క సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూసి భయపడుతున్నారంటే, మనసులో కీడు శంకిస్తున్నట్టుగా అర్థం చేసుకోవాలేమో!