ఎగ్జిట్ పోల్స్ కావు ఇవి.. కిచెన్ రెసిపీ పోల్స్!

ఎన్నికల పర్వం మొదలైన నాటి నుంచి వివిధ సంస్థలు సర్వేల పేరుతో రకరకాలుగా హడావుడి చేస్తూనే ఉంటాయి. ప్రతిదశలో తమ సర్వే ఫలితాలను వెల్లడిస్తూనే ఉంటాయి. పార్టీలు కూడా తమ వ్యూహాలను మార్చుకుంటూ ఉండడానికి…

ఎన్నికల పర్వం మొదలైన నాటి నుంచి వివిధ సంస్థలు సర్వేల పేరుతో రకరకాలుగా హడావుడి చేస్తూనే ఉంటాయి. ప్రతిదశలో తమ సర్వే ఫలితాలను వెల్లడిస్తూనే ఉంటాయి. పార్టీలు కూడా తమ వ్యూహాలను మార్చుకుంటూ ఉండడానికి సొంతంగా సర్వేలు చేయించుకుంటూ ఉంటాయి. ప్రజల మనోగతం ఎలా ఉన్నదో తెలుసుకుంటూ తదనుగుణంగా వ్యవహరిస్తుంటాయి.

సర్వేలు ఒక ఎత్తు అయితే.. ఎగ్జిట్ పోల్స్ మరొక ఎత్తు. సర్వేల్లో వెల్లడయ్యే ఫలితాలు మళ్లీ మళ్లీ మారడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జిట్ పోల్స్ అలా కాదు. ఓటు వేసిన తర్వాత ఎవరికి వేశారో అడిగితెలుసుకునే ప్రయత్నం గనుక.. ఇవి కచ్చితమైన ఫలితాన్ని తెలియజేస్తాయనే అంతా అనుకుంటారు.

కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి చిత్రమైన పరిస్థితి ఉంది. కొన్ని సంస్థలు వైఎస్సార్ కాంగ్రెస్ తిరుగులేని మెజారిటీతో గెలుస్తుందని అంటూ ఉంటే.. మరికొన్ని సంస్థలు తెలుగుదేశం కూటమి గెలుస్తుందని అంటున్నాయి. వైసీపీకి అనుకూలంగా ఓ అయిదు సంస్థలు వెల్లడిస్తే.. తెలుగుదేశానికి అనుకూలంగా అయిదారు సంస్థలు చెబుతున్నాయి.

ఎగ్జిట్ పోల్స్ అంటేనే.. అవి అన్ని సంస్థల ఫలితాల్లోనూ సమీపంగా ఉండాలి. భారీ వ్యత్యాసాలు ఉంటే.. ఆ సంస్థలనే అనుమానించే పరిస్థితి వస్తుంది.

ఇప్పుడు వెల్లడైన ఎగ్జిట్ పోల్సే అందుకు మంచి ఉదాహరణ. ఎందుకంటే.. జాతీయ స్థాయిలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే విషయంలో దాదాపుగా అన్ని సంస్థల మధ్య ఏకాభిప్రాయం ఉంది. దాదాపుగా ప్రతి సంస్థ కూడా ఎన్డీయే కూటమి 300 పైచిలుకు సీట్లతో అధికారంలోకి రాబోతున్నదని చెబుతోంది. అంటే.. ఎగ్జిట్ పోల్స్ ఎన్ని సంస్థలు చేసినా సరే రిజల్ట్ ఒకే తీరుగా ఉండాలనే సత్యాన్ని ఇవి నిరూపిస్తున్నాయి.

అదే ఏపీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి రకరకాలుగా చెబుతున్నాయి. సగం వైసీపీ వైపు, సగం టీడీపీ వైపు జోస్యాలు నడుస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అనే ముసుగులో సంస్థలు తమ కోరికలను బయటపెడుతున్నాయా అనే అనుమానం కలుగుతోంది.

నిత్యం సర్వేల్లో ఉండే ఆరా వంటి సంస్థలు- తమ అంచనాల్లో తేడా వస్తే.. పరువు పోతుందని భయపడతాయి. అదే సమయంలో ఊరూపేరూ లేని సంస్థలు మాయచేసిన ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడానికి వెనుకాడవు. అందుకే వీటిని ఎగ్జిట్ పోల్స్ అనడం కంటె కిచెన్ రెసిపీ పోల్స్ అంటే బాగుంటుందని ప్రజలు ఎగతాళి చేస్తున్నారు.