తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి 12 సంస్థలు వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ పరిశీలిస్తే ఫలితాలు ఆశ్చర్యం కలిగించేలా కనిపిస్తూ ఉన్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లపాటు అప్రతిహతంగా రాజ్యం చేసిన గులాబీ దళం పూర్తిగా పతనం అయిపోతున్నట్లు కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికలలో కొన్ని సీట్లలో గెలిచి ఉనికి చాటుకున్న భారత రాష్ట్ర సమితి, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి పూర్తిగా ఆదృశ్యం అవుతుందనే అభిప్రాయాలు ప్రజలలో వినిపిస్తున్నాయి. ఆ పార్టీ నాయకులు ఎన్ని రకాల గాంభీర్యపు ప్రకటనలైనా చేయవచ్చు గాని, ఎగ్జిట్ పోల్స్ మాత్రం కేసిఆర్ దళం పతనాన్ని నిర్దేశిస్తున్నాయి.
12 సంస్థలు వెలువరించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలలో.. ముగ్గురు భారత రాష్ట్ర సమితికి కేవలం సున్న స్థానాలు మాత్రమే దక్కుతాయని అంచనా వేశారు! అదే సమయంలో మరో నాలుగు సంస్థలు సున్న నుంచి ఒక్క స్థానం దక్కే అవకాశం ఉన్నదని చెప్పుకొచ్చాయి. ఒక సంస్థ నుంచి మూడు స్థానాలు దక్కుతాయని అంచనా వేస్తుండగా, మరో ఇద్దరు రెండు స్థానాలు గెలుస్తారని, ఒకే ఒక్క సంస్థ న్యూస్ 18 మాత్రం రెండు నుంచి ఐదు స్థానాలలో భారత రాష్ట్ర సమితి విజయం సాధిస్తుందని అంచనావేయడం జరిగింది.
నిజానికి ఇవి చాలా ప్రమాదకరమైన ఫలితాలు! అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత భారత రాష్ట్ర సమితిని విచ్ఛిన్నం కాకుండా, శిథిలం కాకుండా ఆపడానికి ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆయన కొడుకు తారక రామారావు అనేక పాట్లు పడ్డారు.
కాపురం చేసే కళ కాలు తొక్కిన నాడే తెలుస్తుంది అనే సామెత చందంగా భారత రాష్ట్ర సమితి అగాధాల్లోకి పడిపోతూ ఉన్నదని, పార్లమెంటు ఎన్నికలలో కూడా ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉండబోతున్నదని ముందే అర్థమైంది ఆ పార్టీ ఎంపీలు పలువురు భారతీయ జనతా పార్టీ కాంగ్రెసులలో చేరిపోయారు. అలాగే టికెట్లు కేటాయించే సీజన్ వచ్చిన తర్వాత ఎంపీ టికెట్లు ఇస్తామంటే పలువురు సీనియర్ నాయకులు మాకు వద్దంటే వద్దంటూ తిరస్కరించారు.
ఎంపీగా పోటీ చేసే ఉద్దేశం లేదని అన్నారు. కొందరైతే టికెట్ ప్రకటించిన తర్వాత కూడా మాకు వద్దని తిరస్కరించారు. ఒకవైపు కేసీఆర్ పిలిచి మరీ టికెట్ ఇస్తానని అన్నప్పటికీ పుచ్చుకోకుండా వద్దని అన్నవారు.. మరొక పార్టీలోకి గెంతి అక్కడ టికెట్ తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే భారత రాష్ట్ర సమితి పార్లమెంటు ఎన్నికలలో ప్రభావశీలంగా ఉండగలదనే నమ్మకం ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులలో పూర్తిగా సన్నగిల్లి పోయింది.
వారందరి అంచనాలకు తగినట్లుగానే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వచ్చాయి. ఇవన్నీ ఉత్తుతివే అని, మేము గెలిచి తీరుతాము అని, తండ్రి కొడుకులు చెప్పుకోవచ్చు గాక.. ఇంకో రెండు రోజుల్లో ఆ మాట చెప్పగల అవకాశాన్ని కూడా వారు కోల్పోతారు! ఇప్పటికైనా మేలుకుంటే కనీసం రాబోయే ఐదేళ్లలో పార్టీని కాపాడుకోవడానికి వారు శ్రద్ధ పెట్టడం కుదురుతుంది.
ఇంకా అహంకారం వీడకుండా, వాస్తవాలను గుర్తించకుండా ఆత్మవంచనతో నడుచుకుంటే నష్టపోయేది కల్వకుంట్ల కుటుంబమే!