రేవంత్ రెడ్డి ప్రభుత్వం ధూమ్ ధామ్ గా, అట్టహాసంగా, వైభవంగా నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అండ్ దశాబ్ది ఉత్సవాలకు వాళ్లిద్దరూ రారని మొదటి నుంచి అనుకుంటున్నదే. వాళ్లిద్దరే గులాబీ పార్టీ అధినేత అండ్ మాజీ సీఎం కేసీఆర్, కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ. చివరకు తెలంగాణ తెచ్చానని చెప్పుకుంటున్న కేసీఆర్, ఇచ్చిందని చెబుతున్న సోనియా ఇద్దరూ డుమ్మా కొట్టారు. ఆమెకేమో అనారోగ్యంతో బాధపడుతోంది. ఆయన నిరసన ప్రకటించాడు. అయితే కేసీఆర్ రాడని మొదటినుంచి అనుకుంటున్నదే.
ఎందుకంటే ఆయనకు రేవంత్ రెడ్డి అంటే పడదు. ఆయన్ని ఆగర్భ శత్రువులా చూస్తాడు. అందులోనూ తన ఆధ్వర్యంలో (తానే ఎన్నికల్లో గెలిచి సీఎం అవుతానని కలలు కన్నాడు కదా) జరగాల్సిన ఈ దశాబ్ది ఉత్సవాలు తన శత్రువు ఆధ్వర్యంలో జరగడం జీర్ణించుకోలేకపోతున్నాడు. అందుకని రేవంత్ రెడ్డి తనను అవమానించాడని ఆరోపిస్తూ పెద్ద లెటర్ రాశాడు. తాను తయారుచేసిన అధికారిక చిహ్నాన్ని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నాడు. కొత్తవి తయారు చేస్తున్నాడు. ఈ కోపం కూడా బాగా ఉంది.
ఇదంతా పక్కన పెడితే అసలు ఎన్నికల్లో ఓడిపోయినప్పటినుంచే కేసీఆర్ కుతకుతలాడిపోతున్నాడు. దానికి తగ్గట్లు కూతురు కవిత లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కొని జైలుకు వెళ్ళింది. కేసీఆర్ కు తెలిసే కవిత రంగంలోకి దిగిందని ఈడీ కోర్టులో చెప్పింది. ఒకప్పుడు తాను అందలం ఎక్కించిన ఉన్నతాధికారులంతా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన పేరే చెప్పారు. ఇవన్నీ కేసీఆర్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ కోపాన్నంతా దశాబ్ది ఉత్సవాలకు హాజరుకాకపోవడం ద్వారా వెళ్లగక్కాడు.
నిజానికి ఆయనకు అసెంబ్లీకి వెళ్ళడానికి కూడా మొహం చెల్లడంలేదు. ఇక సోనియా గాంధీ వస్తుందని మొదట్లో మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో ఆమె పర్యటన రద్దయిందని చెబుతున్నారు. క్యాన్సర్ పేషంట్ అయినా సోనియా గాంధీకి ఆరోగ్యం సహకరించకపోవడం సహజం. అందుకే ఆమె లోక్ సభ ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా రాజ్యసభకు వెళ్ళింది. కేసీఆర్ వచ్చినా రాకపోయినా రేవంత్ కు పట్టింపులేదు. బాధలేదు.
కానీ సోనియాగాంధీ రాకపోవడం ఆయనకు, కాంగ్రెస్ నాయకులకు బాధాకరమే. తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ఇచ్చిన బీజేపీని కూడా ఉత్సవాలకు ఆహ్వానించామని రేవంత్ చెబుతున్నా తమను ఆహ్వానించలేదని అంటున్నారు. ఏది నిజమో తెలియదు.