ప్రతి ఒక్కరికీ ఒక కులం వుంటుంది

తెలుగు నాట కులం అన్నది కీలకం. కులం తరువాతే కూడు అయినా అన్నట్లు తయారైంది పరిస్థితి. రాను రాను ఇది ఎలా తయరవుతోంది అంటే ఎవరైనా విజ‌యం సాధించినా కులం ఏమిటో అన్న వెదుకులాట. …

తెలుగు నాట కులం అన్నది కీలకం. కులం తరువాతే కూడు అయినా అన్నట్లు తయారైంది పరిస్థితి. రాను రాను ఇది ఎలా తయరవుతోంది అంటే ఎవరైనా విజ‌యం సాధించినా కులం ఏమిటో అన్న వెదుకులాట. 

ఎవరైనా ఓ పదవి తెచ్చుకున్నా, అవార్డు లభించినా కులం ఏమిటని అన్వేషణ. అంత వరకు బాగానే వుంది. పోనీ ఏ కులపోడో అన్న ఆత్రుత వుందని సరిపెట్టుకోవచ్చు. కానీ నేరం చేసినా, ఏదైనా వివాదం చుట్టు ముట్టినా ఏ కులం అన్నది పైకి తీసుకురావడం ఇటీవల మామూలు అయిపోయింది.

తప్పు ఎవరు చేసినా తప్పే అది ఏ కులమైనా తప్పే. కానీ రాజ‌కీయ పార్టీలు ఈ తప్పును పక్కన పెట్టి కులాన్ని ముందు పెడతున్నాయి. ఫలానా కులం అని టార్గెట్ చేసారు అంటూ విషయాన్ని ఆ దారిలోకి మళ్లించాలని చూస్తున్నాయి. శంకర్ ఒకేఒక్కడు సినిమాలో ఆ రోజుల్లోనే ఈ తరహా వ్యవహారాన్ని ఓ సన్నివేశంలో ఎత్తి చూపించారు.

ఇప్పుడు తెలుగునాట ఎలా తయారయింది అంటే ఎవరైనా తప్పు చేస్తే, కేసు పెడితే చాలు…ఫలానా కులం అణచివేత, ఫలానా కులం అనే కేసు పెట్టారు. ఫలానా కులం వాళ్లని కక్ష సాధిస్తున్నారు అనడం అన్నిటి కన్నా ప్రాధమిక ఆయుధం అయిపోయంది. సమస్య ఏమిటంటే కులం లేని రాజ‌కీయ నాయకుడు, వ్యాపారవేత్త ఎవరు వుంటారు?

నారాయణ సంస్థ మీద ఎన్ని అసంతృప్తులు, ఫిర్యాదులు వున్నాయో జ‌నాలకు తెలిసిందే. ఎంత మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారో తెలిసిందే. వాటికి కులానికి సంబంధం ఏముంది? కాపు కులం కాబట్టి తప్పు చేసే కేసు పెట్టుకూడదా? రెడ్డి కులానికి చెందిన వారిని అయినా సరే జ‌గన్ వదిలి పెట్టడం లేదే? స్వంత బంధువులు తప్పు చేసినా, నిర్మొహమాటంగా కేసు పెడుతున్నారు. అరెస్ట్ లు చేస్తున్నారు. చంద్రబాబు అనుభవంలో ఆయన ఇలా చేయగలిగిన, చేసిన సందర్భం వుందా?

ఇప్పుడు జ‌నాలు అంతా నారాయణ ను కాపు విద్యావేత్తగా పేర్కొంటున్నారు. విద్యావేత్తకు కులం అదనపు అర్హత అన్నమాట. రెడ్డి, కమ్మ, కాపు, వైశ్య ఇలా మినహాయింపులు ఇచ్చుకుంటూ పోతే ఇక నేరస్థుల అరెస్ట్ లు అనేవే వుండవు. 

అయినా పదవులు దక్కినపుడు ఆనందం, వ్యాపారాలు సాగినపుడు ఆనందం. తమ కులం వాడంటూ గర్వపడడం. అంత వరకు బాగానే వుంటుంది. తప్పు చేస్తే కేసు పడితే మాత్రం కులాన్ని బయటకు తీసి కవచంగా వాడేందుకు ప్రయత్నించడం సరైనదేనా?