మాన‌వ‌తా దృక్ప‌థంతో వ్య‌వ‌హ‌రించండి

బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అస‌ని తుపాను ఆంధ్రాను భ‌య‌పెడుతోంది. ఈ తుపాను ప్ర‌భావంతో విశాఖ‌, తూర్పుగోదావ‌రి, ప‌శ్చిమ‌గోదావ‌రి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వ‌ర్షాలు ప‌డ‌తాయ‌ని వాతావ‌ర‌ణ‌శాఖ హెచ్చ‌రించింది. ఈ నేప‌థ్యంలో ఎలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల‌నైనా…

బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అస‌ని తుపాను ఆంధ్రాను భ‌య‌పెడుతోంది. ఈ తుపాను ప్ర‌భావంతో విశాఖ‌, తూర్పుగోదావ‌రి, ప‌శ్చిమ‌గోదావ‌రి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వ‌ర్షాలు ప‌డ‌తాయ‌ని వాతావ‌ర‌ణ‌శాఖ హెచ్చ‌రించింది. ఈ నేప‌థ్యంలో ఎలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల‌నైనా ఎదుర్కోడానికి ప్ర‌భుత్వం స‌మాయ‌త్త‌మైంది. 

ఇప్పటికే తొమ్మిది ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను జిల్లాలకు పంపింది.ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. స‌హాయ‌క చ‌ర్య‌ల‌పై జ‌గ‌న్ దిశానిర్దేశం చేశారు.

తుపాను నేపథ్యంలో హై అలర్ట్‌గా ఉండాలన్నారు. తుపాను బాధితుల‌ను ఆదుకోవ‌డంలో వెనుకంజ వేయొద్ద‌ని, ఇప్ప‌టికే నిధులు ఇచ్చామని సీఎం చెప్పారు. తుపాను తీరం వెంబడి ప్రయాణిస్తోంద‌న్నారు. తీర ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాల‌ని క‌లెక్ట‌ర్లు, ఇత‌ర ఉన్న‌తాధికారుల‌ను ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఆదేశించారు.  

కొన్ని ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌న్నారు. తుపాను బ‌ల‌హీన‌ప‌డుతోంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారుల స‌మాచారం ఊర‌ట‌నిస్తోంద‌న్నారు.

అయిన‌ప్ప‌టికీ అధికారులు ఎట్టి ప‌రిస్థితుల్లోనే నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించొద్ద‌ని సీఎం ఆదేశించారు. వ‌ర‌ద మంపు ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని ఆదేశించారు. అవ‌స‌ర‌మైతే స‌హాయ పున‌రావాస శిబిరాల‌ను తెర‌వాల‌ని ఆదేశించారు. సహాయ శిబిరాలకు తరలించిన వారికి ఒక్కో వ్యక్తికి రూ.వెయ్యి, కుటుంబానికి రూ.2వేల చొప్పున ఇవ్వాల‌ని ఆదేశించారు.

సహాయ శిబిరాల్లో సౌక‌ర్యాల‌కు లోటు రానివ్వ‌న్నారు. ఆహార స‌రుకులు, మంచీ నీటి సౌక‌ర్యం, అలాగే విద్యుత్ లేక‌పోయినా ఇబ్బంది త‌లెత్త‌కుండా జనరేటర్లు సిద్ధం చేసుకోవాల‌న్నారు. జేసీబీల‌ను రెడీ చేసుకోవాల‌ని సూచించారు. గాలీవాన‌కు కమ్యూని కేషన్‌ వ్యవస్థకు అంతరాయం ఏర్పడితే వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. 

అన్నిటికీ మించి బాధితుల‌ను ఆదుకోవ‌డంలో మాన‌వ‌తా దృక్ప‌థంతో వ్య‌వ‌హ‌రించాల‌ని క‌లెక్ట‌ర్లు, ఇత‌ర అధికారుల‌కు ఆయ‌న సూచించారు. పరిహారం అందించ‌డంలో సంకోచాలు పెట్టుకోవద్దన్నారు. సెంట్రల్‌ హెల్ప్‌ లైన్‌తో పాటు, జిల్లాల వారీగా హెల్ప్‌లైన్‌ నంబర్లు సమర్థవంతగా పనిచేసేలా చూడాల‌ని ఆదేశించారు. ఫోన్‌కాల్స్‌ను రిసీవ్ చేసుకోవ‌డంలో నిర్ల‌క్ష్యం వ‌హించొద్ద‌న్నారు.