రాజమండ్రి రూరల్ సీటు మీద జనసేనకు తేదేపాకు పోటీ వచ్చింది. అక్కడ జనసేన నాయకుడు కందుల దుర్గేష్ వున్నారు. బాబు జైలులో వున్నపుడు ఇదే కందుల దుర్గేష్ తెలుగుదేశం పెద్ద తలకాయలతో బాగా కలిసి మెలిసి, విధేయంగా వున్నారు. ఆల్ మోస్ట్ టికెట్ కన్ ఫర్మ్ అయింది.
కానీ తెలుగుదేశం సీనియర్ బుచ్చయ్య చౌదరి మామూలుగా రివర్స్ కాలేదు. పైగా రాజమండ్రి ప్రాంతంలో కమ్మ సామాజిక వర్గం బాగానే వుంది. అలాంటిది తమ వర్గానికి కాకుండా చేస్తే చంద్రబాబు అయినా సరే వాళ్లు ఊరుకుంటారా?
అందుకే ఈ ఉదయమే ఎల్లో మీడియా ట్విట్టర్ హ్యాండిల్స్ తెలుగుదేశం తెనాలి త్యాగం చేసింది, జనసేన రాజమండ్రి త్యాగం చేసింది అని రాగాలు తీయడం ప్రారంభించాయి. నిజానికి తెనాలి నుంచి జనసేన నాదెండ్ల మనోహర్ పోటీ అని ఏనాడో ఫిక్స్ అయింది. దానికి ఇప్పుడు త్యాగం అనే రంగు వేయడం ఏమిటో?
మొత్తానికి ఇప్పుడు రాజమండ్రి బుచ్చయ్యదే అని దాదాపు ఫిక్స్ అయిందని తెలుస్తోంది. కందుల దుర్గేష్ ను నిడదవోలు వెళ్లి పోటీ చేయమని పవన్ అడుగుతున్నారని విశ్వసనీయ వర్గాల బోగట్టా. తెలంగాణలో కూడా పవన్ అలాగే చేసారు. తనకు వచ్చిన నాలుగైదు సీట్లలో పార్టీకి కీలకమైన నేతను, ఆయన కోరుకున్న చోట కాకుండా కిలో మీటర్ల దూరంలోని మరో చోట పోటీకి బలవంతంగా పంపిచారు. డిపాజిట్ కూడా రాలేదు.
అదే నిడదవోలు లో నిర్మాత భోగవిల్లి ప్రసాద్ పోటీ చేస్తారని వార్తలు వినిపించాయి. ఇప్పుడు కందుల దుర్గేష్ వెళ్తారో? తెరవెనుక వుండిపోతారో చూడాలి.