చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు కలిసి ఉమ్మడిగా తమ తమ పార్టీల అభ్యర్థులను ప్రకటించారు. ఉమ్మడిగా పోటీచేస్తున్న ఈ పార్టీల తరఫున ఒకే వేదిక మీద నుంచి ఇద్దరూ కలిసి తమ తమ జాబితాలను వెల్లడించడం మంచి పరిణామమే.
అయితే.. ఈ కూటమిలో భారతీయ జనతా పార్టీ కూడా ఉండబోతున్నదా? లేదా? భారతీయ జనతా పార్టీ కోసం విపరీతంగా ఈ ఇద్దరు నాయకులు ప్రయత్నించారు. వారితో మైత్రి కలుపుకోవడంలో సక్సెస్ అయ్యారా? లేదా? ఈ ప్రెస్ మీట్ లో మాత్రం.. తమ కూటమికి బిజెపి ఆశీస్సులు ఉన్నాయని నాయకులు ప్రకటించారు. ఆశీస్సులు అంటే అర్థం ఏమిటి? అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నం అవుతోంది.
ఆశీస్సులు ఇవ్వడం అంటే.. ఈ రెండు పార్టీలు గెలవాలని బిజెపి కోరుకోవడం. అలాంటి పని బిజెపి చేస్తుందా? అనేది అనుమానం. ‘ఆశీస్సులు’ అనే పదం వాడడం ద్వారా మోడీతో తాము సత్సంబంధాలనే కలిగి ఉన్నాం అని ప్రచారం చేసుకుంటూ.. మోడీ అనుకూల ఓటు బ్యాంకు ఏదైనా ఉంటే దానిని తమ పార్టీల అభ్యర్థులకు వేయించుకోవడం అనేది వీరి ఆలోచన కావొచ్చు.
కానీ ఆ మాటకొస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా మోడీతో అత్యంత సత్సంబంధాలనే కలిగిఉన్నారు. ఏమాత్రం పొరపొచ్చాలు లేవు. మోడీ వైపు నుంచి జగన్ పట్ల స్పందన కూడా అలాగే ఉంటుంది. జగన్ కు మోడీ తో సత్సంబంధాలు ఉంటే.. ఆయన స్వార్థం కోసం ఆ పనిచేస్తున్నారని చెప్పే.. ఈ విపక్ష నాయకులు.. తమకు మాత్రం ఆశీస్సులు ఉన్నాయంటూ ఎగబడుతున్నారు. ఆశీస్సులు ఉన్నాయి గనుక.. ఎన్నికల్లో తమ పార్టీల అభ్యర్థులకు అనుకూలంగా మోడీతో ప్రచారం చేయించుకోగలరా? అనేది కూడా ఒక చర్చ.
వీరు పొత్తు పెట్టుకోదలచుకున్నారు. వారు ఒప్పుకున్నట్టు లేదు. ఇంకా సంగతి తేలలేదు అని.. వారు కూడా పొత్తులకు కలిసి వస్తే .. తదనుగుణంగా సీట్ల పంపకం కొంత మారుతుందని అంటూ.. ప్రస్తుతానికి ఆశీస్సుల గురించి చెబుతున్నారు. అయినా బిజెపి ఆశీస్సులు ఉన్నాయనే సంగతి వీరు చెప్పుకుంటే నమ్మడం ఎలాగ.. ఇదే మాట బిజెపి వైపు నుంచి పెద్దనాయకులు ఏ ఒక్కరు చెప్పినా నమ్మవచ్చు. ఆ పరిస్థితి ఎప్పటికీ ఉండకపోవచ్చు.
ఒకవేళ పొత్తు కుదరకపోయినా.. ఆశీస్సులు అంటే అర్థం.. తెదేపా- జనసేనకు పోటీగా బిజెపి పోటీచేయకుండానే ఉండాలి. ఏపీలో అలాంటి పరిస్థితిని ఊహించగలమా? కొందరు కోవర్టు నాయకులు.. బిజెపిని తెదేపాతో పొత్తుబంధంలోకి ఈడ్చుకొచ్చి పోటీచేయించాలని ప్రయత్నిస్తుండవచ్చు గాక.. కానీ.. చాలా మంది కమలనాయకులకు సొంతంగానే రాష్ట్రమంతా పోటీచేయాలని, ఓడిపోయినా పర్లేదు గానీ.. రాష్ట్రంలో పార్టీ బలోపేతం అవుతుందనే ఆశ ఉంది.
మరి తమ సొంత పార్టీ ఆశలను చిదిమేస్తూ.. వీరికి ఆశీస్సులు అందించడానికి కమలం అధిష్ఠానం మరీ అంత అమాయకంగా ఉన్నదా? అనేది పలువురి సందేహం.