పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఎక్కువ సీట్లు ఇవ్వలేదు అంటూ నానా హడావుడి జరుగుతోంది. వైకాపా జనాలు జనసేనను తెగ ఎద్దేవా చేస్తున్నారు. కాపు జనాలు కూడా ఇది బాగా లేదని లోలోపల మధన పడుతున్నారు.
పవన్ అమ్ముడు పోయారని బాహాటంగా విమర్శించేవారు వుండనే వున్నారు. కానీ వాళ్లందరికి తెలియాల్సిన సంగతి వేరే ఒకటి వుంది.
ఈరోజు తెలుగుదేశం ఎన్ని పేర్లు ప్రకటించింది. 94 మంది పేర్లు కదా.. మరి పవన్ ఎంత మంది పేర్లు ప్రకటించారు. జస్ట్ అయిదు పేర్లు. అందులోనూ రెండు మూడు ఎప్పటి నుంచో వినిపిస్తున్నవి. 24 సీట్లలో పోటీ చేస్తాం అని చెప్పారు.
కానీ తెలుగుదేశం పార్టీతో సమానంగా 24 మంది పేర్లు ప్రకటించలేకపోయారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నా జనసేన అయిదుగురు ను మించి అభ్యర్ధులుగా సెట్ చేసుకోలేకపోయింది. అలాంటి పార్టీకి మరిన్ని సీట్ల ఎందుకోసం?
ఇచ్చిన 24 సీట్లకే పేర్లు ప్రకటించలేని పరిస్థితిలో వున్న జనసేన, మొదటి నుంచీ పార్టీని నమ్ముకున్నవారిని కాదని, నిన్న కాక మొన్న పార్టీలోకి వచ్చిన వారికి టికెట్ లు ఇస్తున్న జనసేన, యాభై సీట్లు ఇస్తే ఏం చేసుకుంటుంది? మూడే మూడు పార్లమెంట్ సీట్లు కేటాయిస్తే వాటికి కూడా పేర్లు ప్రకటించలేకపోయారు. ఇంకేం రాజకీయాలు చేస్తారు?
ఎవరికి తెలియకపోయినా పవన్ కు ఈ పరిస్థితి తెలుసు. అందుకే ఆయన ఎన్ని ఇస్తే అదే మహాభాగ్యం అన్నట్లు తీసుకుంటున్నారు. కానీ పవన్ ను, పవన్ పార్టీని ఎక్కువగా ఊహించుకుంటున్నవారే కిందా మీదా అయిపోతున్నారు.