రామోజీని మంచం ఎక్కించింది ఎవరు?

ఈ దేశంలోనే శక్తివంతమైన మీడియా అధినేత ఎవరు అంటే రామోజీరావు పేరు చెప్పకతప్పదు ఎవరికైనా. ఒకప్పుడు రామ్ నాధ్ గోయెంకా వుండి వుండొచ్చు. భోఫోర్స్ కుంభకోణాన్ని వెలికి తీసి, ప్రభుత్వాలనే కదిపేసి, కుదిపేసి వుండొచ్చు.…

ఈ దేశంలోనే శక్తివంతమైన మీడియా అధినేత ఎవరు అంటే రామోజీరావు పేరు చెప్పకతప్పదు ఎవరికైనా. ఒకప్పుడు రామ్ నాధ్ గోయెంకా వుండి వుండొచ్చు. భోఫోర్స్ కుంభకోణాన్ని వెలికి తీసి, ప్రభుత్వాలనే కదిపేసి, కుదిపేసి వుండొచ్చు. కానీ పని గట్టుకుని తనకు నచ్చని ప్రభుత్వాన్ని ఉండనిచ్చే ముచ్చట ఏనాడూ లేదు. కానీ రామోజీ అలాకాదు. తెలుగుదేశం పార్టీ కాని ప్రభుత్వాన్ని ఉండనిచ్చే ప్రయత్నం ఏనాడూ చేయలేదు. వుంటే తెలుగుదేశం ప్రభుత్వం వుండాలి లేదంటే తన కనుసన్నలలో కొనసాగే ప్రభుత్వం వుండాలి. ఇదే రామోజీ లక్ష్యం అని జనాల సంగతేమో కానీ మీడియా జనాలకు బాగా తెలుసు.

అలాంటి రామోజీ రావు వయసు ఇప్పుడు 87 ఏళ్లు. కానీ ఏనాడూ రామోజీ నీరసంగా కనిపించిన దాఖలా వుందా? ఒంట్లో బాగాలేదు రామోజీకి అన్న వార్త ఎప్పుడైనా విన్నారా? చూసారా? చదివారా? లేదు. ఈ వయసులో కూడా ఇంత ఆరోగ్యం అన్నది రామోజీకి దేవుడు ఇచ్చిన వరం అనుకున్నారే తప్ప వేరు మాట లేదు. 

మొన్నటికి మొన్న అమిత్ షా వచ్చినపుడు కూడా రామోజీ ఫుల్ ఆరోగ్యంగానే వున్నారు. ఇప్పటికీ కీలకమైన పనులు, నిర్ణయాలు అన్నీ రామోజీ స్వయంగా చూసుకుంటారని, చక్కబెట్టుకుంటారని మీడియా జనం చెప్పుకుంటూ వుంటారు.

ఇదే రామోజీ గురించి మరో ముచ్చట వుంది. రామోజీ ఫిలిం సిటీ కట్టుకుని, అందులో ఓ గుట్ట మీద మాంచి భవనం కట్టుకున్న దగ్గర నుంచి ఇక బయటకు రావడం మానేసారు. సమస్త కార్యక్రమాలు, కార్యకలాపాలు అక్కడి నుంచే. చంద్రబాబు, కేసిఆర్, జగన్, రేవంత్ రెడ్డి, ఆఖరికి అమిత్ షా అయినా అక్కడకు వెళ్లి కలవాల్సిందే తప్ప, హైదరాబాద్ సిటీలో అడుగుపెట్టిన దాఖలా లేదు. పెళ్లిళ్లు, పేరంటాలు ఇలాంటి వాటికి అన్నీ రామోజీ తరపున కొడుకు కిరణ్,కోడలు శైలజనే హాజరు. ఫిలింసిటీ దాటి రామోజీ బయటకు వచ్చిన సందర్భాలు ఒక చేతి వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు.

మరి అలాంటిది సిబి సిఐడి అధికారులు విచారణకు వస్తామని అనగానే రామోజీ ఎందుకు జూబ్లీ హిల్స్ ఇంటికి రమ్మని కబురు చేసారు. అక్కడ వుండే కోడలు శైలజ ఇంటికి రమ్మని ఎందుకు చెప్పారు? ఎప్పుడు వచ్చారు? రామోజీ ఫిలిం సిటీలో వుండే ఆయన కోసం జూబ్లీ హిల్స్ ఇంట్లో ఆసుపత్రి సెటప్ అప్పటికప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇదంతా సింపతీ కోసమా? నిజంగానా? సింపతీ కోసం కాదు అనుకుంటే, ఫిలిం సిటీలోని ఇంట్లో కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే రామోజీ వుండి వుంటే, అలాంటి పరిస్థితుల్లో ఆయన గంటన్నర దూరంలోని సిటీకి ఎందుకు తరలిస్తారు? సిబిసిఐడి అధికారులనే ఫిలిం సిటీకి రమ్మంటారు తప్ప? అమిత్ షా నే అక్కడకు రప్పించిన దాఖలా వుండగా ఇదేమంత లెక్కా?

అంటే అధికారులు విచారణ సందర్భంగా విడియో తీస్తే అది ఎలాగూ భవిష్యత్ లో ఏ సందర్భంలో అయినా బయటకు అన్నా రావచ్చు. కోర్టు దృష్టికి అన్నా వెళ్లొచ్చు. అలాంటి టైమ్ లో మరీ అత్యవసరం అయితే బెయిల్ అన్నది అత్యంత సులవు కావచ్చు. ఇదే ఆలోచన అనుకోవాలా? ఇప్పుడు ఫొటో బయటకు వచ్చిందని యాగీ చేస్తున్నారు. 

సాక్షి టీవీలో ప్రసారం చేసారంటున్నారు. నిజానికి సాక్షి టీవీలో కన్నా సోషల్ మీడియా హ్యాండిల్స్ లోకి ఆ ఫొటోను తీసుకు వచ్చింది తెలుగుదేశం అనుకూల డిజిటల్ మీడియానే. ఈ వయసులో ఇంతటి అనారోగ్గయంతో వుంటే విచారిస్తారా అంటూ సింపతీ జనరేట్ చేసే పని మొదలుపెట్టింది. తెలుగుదేశం హార్డ్ కోర్ డిజిటల్ మీడియానే.

చూస్తుంటే వెల్ ప్లాన్డ్..వెల్ నిట్టెడ్..వెల్ ఎగ్జిక్యూటెడ్ వ్యవహారంలా వుంది ఇదంతా.