వైఎస్ జగన్‌ను సీఎం చేసుకోవాలన్న వైసీపీ శ్రేణుల కల 2019లో నెరవేరింది. వైఎస్ జగన్ సీఎం అయితే తమ బతుకులు మారిపోతాయని ఆశించిన వాళ్లకు మాత్రం తీవ్ర నిరాశ మిగిలింది. ఎప్పుడైనా, ఎక్కడైనా ఆశ వుంటేనే నిరాశ ఎదురవుతుంది. వైఎస్ జగన్‌పై ఎలాంటి అంచనాలు పెట్టుకోని వారు మాత్రం… “రాజకీయ నాయకులంతా ఇంతే. అధికారంలోకి ఎవరొచ్చినా మన బతుకులు మారవు. మన శ్రమ తప్పదు” అని ఆలోచించిన వాళ్లు మాత్రం ఇప్పుడు కూల్‌గా వున్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పైస్థాయిలో ఏ కొద్ది మంది నేతలు, వారి చుట్టూ వున్న కొందరు మాత్రమే ఆర్థికంగా, పదవుల పరంగా బాగుపడ్డారనే అభిప్రాయం బలంగా వుంది. ఇదిలా వుండగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా కార్యకర్తలు, గ్రామం మొదలుకుని రాష్ట్రస్థాయి వరకూ నేతల్లో అసంతృప్తి వుంది. వారి అసంతృప్తికి అనేక కారణాలున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.
జగన్ సీఎం అయిన తర్వాత సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి తమకు విలువ లేకుండా చేశారనే ఆక్రోశం, ఆగ్రహం నాయకుల్లో కనిపిస్తోంది. ఒకప్పుడు ప్రజలు గ్రామ లేదా నియోజకవర్గ నాయకుల దగ్గరికి వెళ్లి ఒకటికి పదిసార్లు వారి చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. ప్రజానీకం ఇబ్బందులను రాజకీయంగా క్యాష్ చేసుకోవాలనే ఆలోచన నాయకుల్లో ఉండేది. ఇప్పుడు అది పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.
ఇప్పుడు ప్రజలు నేరుగా సచివాలయాల వద్దకెళుతున్నారు. వాలంటీర్లు లేదా సచివాలయ ఉద్యోగులకు అర్జీలు అందిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి వారిపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో నాయకులు, ప్రజల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయడం వల్ల నాయకత్వంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అందుకే వైసీపీ నాయకులు పదేపదే ఇకపై వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులతోనే జగన్ ఓట్లు వేయించుకుంటారనే నిష్టూరమాడుతున్నారు.
అలాగే కాంట్రాక్టర్ల బాధ మాటల్లో చెప్పేది కాదు. ప్రభుత్వ ఆదాయంతో పాటు అప్పులు తెచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పూర్తిగా సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తున్నారని, తమకు సంవత్సరాల తరబడి బిల్లులు చెల్లించకుండా నట్టేట ముంచుతున్నారని చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు. ఇక జగన్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారంపై కూడా బా దెబ్బపడిందనే అభిప్రాయాలున్నాయి.
గతంతో పోల్చితే ఇసుక ధర రెట్టింపు కావడంతో పాటు సమయానికి సరఫరా చేయడం లేదనే విమర్శ ఉంది. అలాగే అన్ని రకాల వస్తువుల ధరలు పెరగడంతో నిర్మాణ వ్యయం అమాంతం పెరిగిందనే ఆవేదన కనిపిస్తోంది. మరోవైపు రాజకీయం చేయడానికి ఖర్చులు భారీగా పెరగడం, మరోవైపు నయా పైసా ఆదాయం లేకపోవడంతో స్థిరాస్తులు అమ్ముకోవాల్సి వస్తోందనే ఆవేదన వైసీపీ నాయకుల్లో కనిపిస్తోంది. పార్టీ అధికారంలో వుండి నష్టపోవడాన్ని వైసీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ మరోసారి ఎన్నికలకు వెళ్లాలంటే అసంతృప్తిని ముందుగా పోగొట్టాలి.
అది ఏ విధంగా అనేది పార్టీ పెద్దలు ఆలోచించాలి. ప్రస్తుతం గడపగడపకూ మన ప్రభుత్వం, అలాగే ప్లీనరీ సమావేశాల వల్ల క్షేత్రస్థాయిలో అసంతృప్తి ఏంటో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులకు తెలిసొస్తోంది. ఇక వాటిపై పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వ, పార్టీ పెద్దలపై ఉంది.