అయిన దానికి, కానిదానికి కోర్టును ఆశ్రయించడం ఆ ప్రజాప్రతినిధికి ప్యాషనైంది. 4,47,594 మంది ఓట్లు వేసి ఆయన్ను ఎంపీగా గెలిపించుకున్నారు. పోలైన ఓట్లలో 38.11శాతం ఆయనకే దక్కాయి. తనను ఎన్నుకున్న ఓటర్ల దగ్గరికి వెళ్లడానికి కూడా హైకోర్టును ఆశ్రయించడం కూడా ఒక ప్రజాప్రతినిధికి అవమానం ఉంటుందా? కనీసం సిగ్గనిపించలేదా? 'వై' కేటగిరి రక్షణ వలయంలో వుంటూ… ఇంకా స్థానిక పోలీసుల భద్రత కావాలని న్యాయస్థానాన్ని కోరడం ఎబ్బెట్టుగా వుంది.
ఈ ఫీలింగే న్యాయస్థానానికి కూడా కలిగినట్టుంది. అందుకే 'వై' కేటగిరి భద్రత ఉన్నప్పుడు, ఇంకా స్థానిక పోలీసుల భద్రత అవసరం ఏంటని నిలదీసింది. తన నియోజకవర్గానికి వెళుతున్న తరుణంలో నోరు మూసుకుంటానని, ఒక్క మాట కూడా మాట్లాడనని తన ఆస్థాన చానల్ వేదికగా సదరు ఎంపీ చెప్పడం గమనార్హం. ఏపీ వెలుపల కూడా అదే రీతిలో వుంటే ఇవాళ ఈ దుస్థితి వచ్చేది కాదు కదా!
గుండెల నిండా భయం పెట్టుకుని, పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం అంటే ఏంటో ఆయన గారి పిటిషన్ చూస్తే అర్థమవుతుంది. ఈ నెల 4న భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. సొంత పార్లమెంట్ నియోజకవర్గంలో మోదీ హాజరుకానున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన గారు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు.
చివరికి సొంత నియోజకవర్గానికి వెళ్లడానికి కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించే దుస్థితి తెచ్చుకున్న ప్రజాప్రతినిధిని చూసి ఓట్లేసిన వాళ్లు ఛీఛీ అంటున్నారు. అవాకులు చెవాకులు పేలుతూ, తాము భిక్ష పెట్టిన అత్యున్నత పదవిని స్వప్రయోజనాలకు దుర్వినియోగం చేస్తున్న ఇలాంటి నాయకుల పంథా ప్రతి ఒక్కరికీ గుణపాఠం అని ఓటర్లు అంటున్నారు.
సొంత ఓటర్ల దగ్గరికి వెళ్లడానికి కూడా కోర్టును ఆశ్రయించే దుస్థితి తెచ్చుకోవడం అంటే, తానెంత దీనస్థితికి దిగజారారో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుంటే ఆయనకే మంచిది.