మహారాష్ట్ర రాజకీయం రసకందాయకంగా మారింది. దేశం మొత్తం చూపు దేశ ఆర్థిక రాజధాని వైపు ఉన్నాయి. నాటకీయ పరిణామాల మధ్యన రెండున్నరేళ్ల కిందట ఏర్పడిన ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ వ్యూహాలు ఫలించిన దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. కమలం పార్టీ తన దైన రాజకీయంతో ఉద్ధవ్ ఠాక్రేకు తీవ్రమైన షాక్ ను ఇచ్చింది. మరోవైపు ఉద్ధవ్ నాయకత్వ వైఫల్యం కూడా చర్చనీయాంశంశంగా మారింది.
దశాబ్దాలుగా పార్టీని నడిపిస్తున్నప్పటికీ.. 55 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది తిరుగుబాటు చేసే పరిస్థితులను ఎదుర్కొన్నాడంటూ అది నిస్సందేహంగా ఉద్ధవ్ నాయకత్వ వైఫల్యమే అనే అభిప్రాయాలూ వినిపిస్తూ ఉన్నాయి. ఈ విషయంలో మిత్రపక్షాలుగా ఉన్న ఎన్సీపీ, కాంగ్రెస్ లు కూడా ఉద్ధవ్ పై గుర్రుగా ఉండవచ్చు. ఎన్సీపీలోనో, కాంగ్రెస్ లోనో చీలిక వచ్చి ఈ కూటమి ప్రభుత్వం కూలిపోయి ఉంటే అదో లెక్క. అయితే కూటమికి పెద్దన్నగా, ముఖ్యమంత్రి పదవినే కలిగి ఉండిన శివసేనలోనే చీలిక..ఈ కూటమి ప్రభుత్వాన్ని కూలదోసింది. దీంతో ఇది ఉద్ధవ్ ఠాక్రే వైఫల్యంగా హైలెట్ అవుతూ ఉంది.
ఇక భారతీయ జనతా పార్టీ కూడా వ్యూహాత్మకంగా ఏక్ నాథ్ షిండేను ముఖ్యమంత్రిగా ప్రకటించేసింది. ఒకవేళ బీజేపీ గనుక ముఖ్యమంత్రి పదవిని తీసుకుని ఉంటే.. అది శివసేనకు గట్టిగా చెప్పుకునే అంశం అయ్యేది. ఎన్నో యేళ్లకు శివసైనికుడికి ముఖ్యమంత్రి పదవి దక్కితే బీజేపీ సహించలేకపోయిందంటూ మద్దతుదార్ల నుంచి సానుభూతి వెల్లువెత్తేలా చేసుకునే అవకాశం ఉండేది సేనకు. అయితే ఠాక్రేకు బీజేపీ ఆ అవకాశం కూడా ఇవ్వడం లేదు. షిండేను సీఎంగా చేసి.. శివసైనికుడినే ముఖ్యమంత్రిని చేశాం చూశారా.. అంటూ బీజేపీ చెప్పుకునే అవకాశం ఉందిప్పుడు.
దీంతో ఉద్ధవ్ పై ఏ మేరకు సానుభూతి వెల్లువెత్తుంది? అనేది శేష ప్రశ్నగా మారింది. మరోవైపు శివసేనను పూర్తిగా పడగొట్టడానికి తాను తగ్గినా ఫర్వాలేదనేది బీజేపీ ఎత్తుగడ అని స్పష్టం అవుతోంది. ముఖ్యమంత్రి పీఠంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను కూడా ఉప ముఖ్యమంత్రి పీఠానికి పరిమితం చేసింది. తను బ్యాక్ సీట్లో ఉండి బీజేపీ డ్రైవ్ చేసే వ్యూహాన్ని అనుసరిస్తూ ఉంది. ఏం చేసినా.. మరో రెండేళ్లకు పై అవకాశం బీజేపీకి ఉంది. అంతలోపు చాలా రాజకీయం జరిగే అవకాశం కూడా ఉంది.
శివసేన తిరుగుబాటు అంశం కోర్టు వరకూ వెళ్లే అవకాశం ఉంది. ఫిరాయింపు దార్లదే అసలు పార్టీ అవుతుందా? లేక శివసేన ఉద్ధవ్ ఠాక్రే వారసత్వంగా దక్కుతుందా? అనేది అంత తేలికగా తేలే అంశం కాకపోవచ్చు. ఒకవేళ తిరుగుబాటు దార్లది తిరుగుబాటు మాత్రమే అని న్యాయవ్యవస్థ గుర్తిస్తే.. వారిపై అనర్హత వేటు పడే అవకాశాలు లేకపోలేదు. అయితే కేంద్రంలో అధికారం బీజేపీ చేతిలో ఉంది, ఈ ప్రభుత్వ మనుగడ బీజేపీకి ప్రతిష్టగా మారుతుంది. దీంతో ఆట అంతా కమలం పార్టీకి అనుకూలంగా మారుతుందనే అభిప్రాయాలు సహజంగానే వినిపిస్తాయి.
గతంలో కర్ణాటకలో ఇలాంటి రాజకీయమే జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను చీల్చుకుని బీజేపీ తన వైపు తిప్పకుంది. యడియూరప్ప నాయకత్వంలో బీజేపీ సర్కారు ఏర్పడింది అలాంటి తిరుగుబాటు తోనే. అయితే.. అలాంటి తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పలేదు! అనర్హత వేటు అనంతరం వారి విషయంలో ఉప ఎన్నికలు కూడా జరిగాయి. ఆ ఉప ఎన్నికల్లో వారు బీజేపీ తరఫున నెగ్గారు. దీంతో యడియూరప్ప ప్రభుత్వం ఆ తర్వాత మనుగడను సాగించింది. ఆ తర్వాత యడియూరప్ప స్థానంలో బీజేపీ తరఫునే బొమ్మై సీఎం అయ్యారు. అది వేరే కథ.
మరి శివసేన తిరుగుబాటు దారులకు చట్టపరంగా ఎలాంటి తీర్పు వస్తుందనేది ఆసక్తిదాయకమైన అంశం. మూడింట రెండొంతుల మంది తిరుగుబాటు చేస్తే.. వారిదే అసలైన పార్టీ అవుతుంది.. అంటూ కొంతమంది చెబుతుంటారు. అయితే ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం.. ఎంతమంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసినా వారికి రాజకీయపరమైన గుర్తింపు దక్కదు! మూడింట రెండు వంతుల మంది అనేది.. ఫిరాయింపును సమర్థించుకునే వాదనగా నిలబడదు. గుర్తింపును పొందిన రాజకీయ పార్టీల్లో.. పార్టీ విప్ కు చాలా పవర్ ఉంటుంది. ఎంతమంది ఎమ్మెల్యేలు తిరుగుబాటును చేసినా.. వారందరిపై వేటు పడాల్సిందే. అయితే గవర్నర్లు, అసెంబ్లీ స్పీకర్లు అధికారం లో ఉన్న పార్టీ కి అనుకూలంగా వ్యవహరించే తరుణంలో ఇలాంటి ఫిరాయింపులు తప్పించుకోవచ్చు. అయితే ఈ అంశాలు కోర్టుకు చేరతాయి. అక్కడే అసలు సంగతి తేలాల్సి ఉంది.
మరి ఠాక్రేల నాయకత్వం ఎమ్మెల్యేలను నిలబెట్టుకోవడం విఫలం అయి ఉండవచ్చు. అయితే ప్రజలు ఈ విషయంలో ఎలా స్పందిస్తారనేది ఆసక్తిదాయకమైన అంశం. ఉద్ధవ్ ఠాక్రేపై ఏక్ నాథ్ షిండే ఆధ్వర్యంలో బీజేపీ సహకారంతో జరిగిన తిరుగుబాటు వ్యవహారం ప్రజల్లో చర్చకు నోచుకుంటుంది. రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లో ప్రజలు ఈ అంశంపైన తమ తీర్పును ఇస్తారు. కాంగ్రెస్, ఎన్సీపీలతో జట్టు కట్టి శివసేన ప్రభుత్వం ఏర్పాటు కావడం పాపమంటూ షిండే అంటున్నప్పటికీ.. వారిది అధికార కాంక్ష మాత్రమే అని స్పష్టం అవుతోంది.
తమది సైధ్దాంతికమైన తిరుగుబాటు అంటూ షిండే సమర్థించుకో ప్రయత్నం చేస్తున్నాడు. అయితే.. దాన్నంతా ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదు. కేవలం అధికారం, అహం దెబ్బతినడం వంటివి మాత్రమే షిండే తిరుగుబాటుకు తక్షణ కారణాలు, అసలు కారణాలు అని స్పష్టం అవుతోంది. మరి రాజకీయ అనిశ్చితికి, ముఖ్యమంత్రులు మారిపోవడానికి మహారాష్ట్ర కొత్త కాదు! ఈ పరిస్థితుల్లో శివసేన దెబ్బతిన్న బెబ్బులిలా ఎలా ఠాక్రే నాయకత్వంలో లేస్తుందనేది అత్యంత ఆసక్తిదాయకమైన అంశం.
హిమ