లౌక్యం తెలిసిన తెలంగాణ సీఎం

‘మడిసన్నాక కాస్తంత కలాపోసన ఉండాల’ న్న ‘ముత్యాలముగ్గు’  సినిమాలో రావుగోపాలరావు డైలాగు మాదిరిగా మనిషన్నాక కాస్తోకూస్తో లౌక్యం ఉండాలి. లౌక్యం లేనివారు పాత కాలంలో అయితే  బతికేశారుగాని, ఈ కాలంలో బతకడం కష్టమే. రాజకీయాల్లోనైతే …

‘మడిసన్నాక కాస్తంత కలాపోసన ఉండాల’ న్న ‘ముత్యాలముగ్గు’  సినిమాలో రావుగోపాలరావు డైలాగు మాదిరిగా మనిషన్నాక కాస్తోకూస్తో లౌక్యం ఉండాలి. లౌక్యం లేనివారు పాత కాలంలో అయితే  బతికేశారుగాని, ఈ కాలంలో బతకడం కష్టమే. రాజకీయాల్లోనైతే  ఈ లక్షణం ఇంకా ఎక్కువగా ఉండాలి. త్రివిక్రమ్​ శ్రీనివాస్​ ‘అత్తారింటికి దారేది’ సినిమాలో అన్నట్లుగా  ఎక్కడ తగ్గాలో… ఎక్కడ నెగ్గాలో  తెలియాలి. ఈ విద్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డికి బాగా తెలిసినట్లుగా ఉంది. లేకపోతే టీడీపీ నుంచి వచ్చి కాంగ్రెసులో చేరి చాలా కొద్ది కాలంలోనే ముఖ్యమంత్రి కావడం ఏమిటి? ఈ విషయంలో ఆయనకు అదృష్టంతోపాటు లౌక్యం కూడా తోడైందని చెప్పుకోవాలి.

రేవంత్​ రెడ్డి సీఎం అయినప్పటినుంచి కేసీఆర్ కు భిన్నంగా నడుచుకుంటున్నాడు. కాంగ్రెసులో కొమ్ములు తిరిగిన సీనియర్లు ఉండగా వారిని కాదని రేవంత్​ను సీఎం చేసింది అధిష్టానం. అయినప్పటికీ తన మీద ఎవరూ తిరుగుబాటు చేయకుండా లౌక్యంగా వ్యవహరిస్తున్నాడు. తలబిరుసుగా వ్యవహరించడంలేదు. అహంకారం చూపించడంలేదు.

కాంగ్రెసుకు బీజేపీ బద్ధ శత్రువు. అయినప్పటికీ కేసీఆర్​ మాదిరి కాకుండా ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తే గౌరవించాడు. ప్రోటోకాల్​ పాటించాడు. రాష్ట్ర గవర్నర్​ తమిళిసైతోనూ సఖ్యతగానే ఉన్నాడు. బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్నాడు. కాని ప్రధానిగా మోదీని, గవర్నర్​గా తమిళిసైని గౌరవిస్తున్నాడు. వారిపట్ల అమర్యాదగా వ్యవహరించడంలేదు. కేసీఆర్​లా వ్యవహరిస్తే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని తెలుసు. కేంద్రంతో తగాదా పెట్టుకొని సాధించేది ఏమీ లేదని తెలుసు. అందుకే లౌక్యంగా వ్యవహరిస్తున్నాడు. 

పలు అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రధానమంత్రి కి స్వాగతం పలికాడు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ వంటి వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని ఆకాశానికి ఎత్తేశాడు. గత ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవహార శైలి కంటే భిన్నంగా వ్యవహరించాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముందుండి స్వాగతం పలికి.. వేదిక వద్దకు తోడ్కోని వెళ్లాడు. 

ప్రధాని నరేంద్ర మోడీ వేదిక మీద ఆసీనులైన తర్వాత రేవంత్ రెడ్డి స్వాగత ఉపన్యాసం చేశాడు. “ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాకు బడే భాయ్. ఆయన ఆశీస్సులు తెలంగాణ రాష్ట్రంపై ఉండాలి. దేశంలో ప్రధాన మెట్రోపాలిటన్ సిటీలల్లో హైదరాబాద్ ఒకటి. ఆ ప్రాంతాల్లో లాగా మెట్రో అభివృద్ధికి కేంద్రం చేయూత కావాలి. కేంద్రం చేయూత ఉంటేనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజలో ఉంటుంది. గత ప్రభుత్వం మాదిరి మేము కేంద్రంతో తగాదా పెట్టుకోవాలని అనుకోవడం లేదు. నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశం అని రంగాల్లో ముందంజలో నడుస్తోంది. 5 ట్రిలియన్ డాలర్ల ఎకనామిగా ఎదిగింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ రాష్ట్రం అన్ని రంగాలలో ముందంజలో ఉంది” అని రేవంత్ రెడ్డి అన్నాడు. దీంతో ఒక్కసారిగా వేదిక మీద ఉన్న కిషన్ రెడ్డి షాక్ కు గురయ్యాడు. రేవంత్ మాట్లాడుతుంటే గవర్నర్ కూడా సంతోషంగా కనిపించారు.

“నరేంద్ర మోడీ దేశాన్ని ప్రపంచ వేదిక ముందు శక్తివంతమైన స్థానంలో నిలబెట్టారు. దానివల్ల మన దేశ కీర్తి ప్రతిష్టలు మరింత పెరిగాయి. అలాంటి నరేంద్ర మోడీ ఆశీస్సులు తెలంగాణపై ఉండాలి. అలా ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా గుజరాత్ లాగా అభివృద్ధి చేస్తామని” రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

రేవంత్ మాట్లాడుతున్నంత సేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఉల్లాసంగా కనిపించారు. ఆయన మాట్లాడుతున్న తీరును తదేకంగా పరిశీలించారు. త్వరలో పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో.. రేవంత్ మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు మోడీ తీరును విమర్శిస్తుంటే.. రేవంత్ పొగుడుతూ మాట్లాడటం విశేషం.

సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కుడి పక్కన గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ఎడవ వైపున సీఎం రేవంత్ రెడ్డి కూర్చున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోడీ రేవంత్ రెడ్డితో ఏం మాట్లాడి ఉంటారనే చర్చ కొనసాగుతోంది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రధాన నరేంద్ర మోడీని కలిసేందుకు సీఎం ఇష్టపడలేదు. కానీ రేవంత్ రెడ్డి ప్రొటోకాల్​ పాటిస్తూ.. రాష్ట్ర ప్రజయోజనాల కోసం పని చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు  చెబుతున్నారు. కేంద్రంతో మంచిగా ఉంటూనే రాష్ట్రానికి రావాల్సిన నిధులు సాధిస్తామని చెబుతున్నారు.