ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం బీజేపీ నాయకుడు వరదాపురం సూరి, టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ మధ్య ఆధిపత్య పోరు… ఇవాళ బజారున పడింది. గత ఎన్నికల్లో టీడీపీ ఓటమితో మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి ఆత్మరక్షణ కోసం బీజేపీలో చేరారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో సూరి మళ్లీ ధర్మవరం నుంచి పోటీ చేయాలని ఉత్సాహం చూపుతున్నారు.
టీడీపీ-జనసేన కూటమితో పొత్తులో భాగంగా బీజేపీ తరపున ఆయన ధర్మవరం నుంచి పోటీ చేయాలని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు ధర్మవరం టీడీపీ ఇన్చార్జ్గా ఉన్న తనకే టికెట్ ఇవ్వాలని పరిటాల శ్రీరామ్ పట్టుపడుతున్నారు. చంద్రబాబు ప్రకటించిన మొదటి జాబితాలో ధర్మవరం సీటును పెండింగ్లో పెట్టారు. ఒకవేళ కూటమితో పొత్తు కుదరకపోతే టీడీపీలో చేరి, ధర్మవరం నుంచి పోటీ చేయాలనేది సూరి వ్యూహం.
ఎట్టి పరిస్థితుల్లోనూ సూరి రాకను అడ్డుకుంటానని శ్రీరామ్ పదేపదే వార్నింగ్ ఇవ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ పెనుకొండలో నిర్వహిస్తున్న రా.. కదిలిరా నిర్వహిస్తున్న చంద్రబాబు సభకు వరదాపురం సూరి కూడా జనాన్ని తరలించారు. బీజేపీకి చెందిన సూరి తమ పార్టీ కార్యక్రమానికి జనాన్ని తరలించడంపై పరిటాల శ్రీరామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సూరి తరలిస్తున్న వాహనాలను బత్తెలపల్లి వద్ద పరిటాల శ్రీరామ్ అనుచరులు అడ్డుకున్నారు. ఇరువర్గాల వారు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో 10 వాహనాలు ధ్వంసమయ్యాయి. టీడీపీ శ్రేణులు రోడ్డుపై నిరసనకు దిగాయి. ధర్మవరం టికెట్ విషయమై పరిటాల శ్రీరామ్, వరదాపురం సూరి మధ్య రానున్న రోజుల్లో తీవ్రస్థాయిలో గొడవలు జరిగే ప్రమాదం వుందని టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.