Advertisement

Advertisement


Home > Politics - Analysis

రెవెన్యూ లోటు - ‘ముందు’-’వెనుక’

రెవెన్యూ లోటు - ‘ముందు’-’వెనుక’

రాజకీయాలు చిత్రంగా వుంటాయి. గాల్లో మేఘాలు చూసి, ఎవడి స్టయిల్లో వాడు ఆకృతులు ఊహించుకున్నట్లు, మోడరన్ ఆర్ట్ ను ఎవరికి వారు వివరించినట్లు వుంటాయి. కర్ణాటక ఎన్నికల తరువాత ఇక అంతా అయిపోయింది. భాజపాకు వైకాపా కు వున్న అనఫీషియల్ బంధం కటీఫ్ అయిపోయింది అని వార్తలు వచ్చేసాయి. 

కాస్త ముందుకు వెళ్తే తెలంగాణలో తమ బలం భాజపాకు అందివ్వడానికి దానికి బదులుగా ఆంధ్రలో తమకు భాజపా సహకరించడానికి ఓ పెద్ద స్కెచ్ నే వేసారు, ఆ తరువాత భాజపా పెద్దలు మీడియా పెద్దలను కలిసినపుడు అంతా మారుతోంది అనుకున్నారు. భాజపా కేంద్ర నేతలు అదే పనిగా ఆంధ్రలో జగన్ అండ్ కో ను తిట్టి పోస్తుంటే ఇక అంతా అయిపోయినట్లే అనుకున్నారు.

కానీ రెవెన్యూ లోటు అంటూ పెద్ద అమౌంట్ వచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో పడేసరికి తెలుగుదేశం వర్గాల హతాసయ్యాయి. జగన్ కు డబ్బులు దొరికాయన్నది సమస్య కాదు. డబ్బులు దొరక్క జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారు అని ఆశ పెట్టుకుని కూర్చున్నారు తెలుగుదేశం పెద్దలు. అదే పనిగా, దానినే నమ్ముతూ వచ్చారు. ప్రచారం చేస్తూ వచ్చారు. జగన్ కు ముందస్తుకు వెళ్లడం అన్నది ఫిఫ్టీ..ఫిఫ్టీ చాన్స్ అని అందరూ అంటున్నా తెలుగుదేశం శ్రేణులు మాత్రం డిసెంబర్ కు ఎన్నికలు పక్కా అనే నమ్మకంతోనే వున్నాయి.

ఇప్పుడు ఈ డబ్బులు రావడం చాలా విధాల క్లారిటీ ఇచ్చినట్లు అయింది. ఎవరైతే భాజపా నేతలు వైకాపా పాలనను తిడుతున్నారో వాటిని పట్టించుకోవాల్సిన పని లేదని తేలిపోయింది. భాజపా కేంద్ర నాయకత్వం ఇంకా జగన్ తోనే వుందని మరో క్లారిటీ వచ్చింది. వీటన్నింటి వల్ల ఫిఫ్టీ..ఫిఫ్టీ చాన్సెస్ అనుకున్న ముందస్తు ఎన్నికలు కష్టమనే అభిప్రాయాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

దీంతో తెలుగుదేశం అడిగితే ఇవ్వని రెవెన్యూ లోటు వైకాపా అడిగితే ఇచ్చారనే ప్రచారం మొదలైంది. దాంతో పాటే రాష్ట్ర భవిష్యత్ ప్రయోజనాలు తాకట్టుపెట్టి ఈ డబ్బులు తెచ్చుకున్నారనే ప్రచారం మరోటి మొదలైంది. మరి గతంలో తెలుగుదేశం రెవెన్యూ లోటు అడిగినపుడు కూడా ఇవే నియమాలు వుండి వుంటాయి కదా. మరి అప్పుడు ఎందుకు ఒప్పుకోవడానికి సిద్ద పడ్డారు. అది వేరే ప్రశ్న.

అసలు భాజపా ధైర్యంగా జగన్ ను వదిలి తేదేపా వైపు ఎందుకు రావాలి. నిన్నటికి నిన్నటికి నిన్న దేశంలోని రాజకీయ పక్షాలు అన్నీ రెండుగా చీలాయి. భాజపావైపు కొన్ని, వ్యతిరేకంగా మరికొన్ని నిలిచాయి. భారాసా పార్టీ ఈ రోజు చెబుతామని ప్రకటించింది. వైకాపా తాను భాజపా వైపే అని చెప్పేసింది. ఎటూ చెప్పని, ఎటూ మొగ్గని ఒకే ఒక్క పార్టీ తెలుగుదేశం. మరి ఇప్పుడు భాజపా ఏమనుకుంటుంది? ఎవర్ని విశ్వాసంలోకి తీసుకోవాలనుకుంటుంది?

స్థిరమైన నిర్ణయం కన్నా, సరైన నిర్ణయం కన్నా, తమ అవసరాలు, అభిమానాలు వీటికి అనుగుణంగా తీసుకునే నిర్ణయం ముఖ్యం. గుడ్డిగా మంచికో చెడుకో భాజపాకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని వుంటే తెలుగుదేశం గురించి మోడీ ఆలోచించే అవకాశం దక్కేది. కానీ దాన్ని వదులుకున్నట్లు అయింది.

జగన్ తో వుందాం…ఒక వేళ తెలుగుదేశం సీట్లు గెలుచుకున్నా తమ వైపే వస్తుంది…అనే ధీమా భాజపాకు వుందనుకోవాలా? లేదా అసలు తెలుగుదేశం మీద దృష్టి పూర్తిగా వదిలేసిందనుకోవాలా? కొన్నాళ్లు ఆగితే మరికొంత క్లారిటీ వస్తుందేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?