
వేరే సంగీత దర్శకుల పాటలను రీమిక్స్ చేయడంలో తనదైన ప్రతిభను ప్రదర్శించిన సంగీత దర్శకుడు ఇళయరాజా. దర్శకుడు వంశీ తీసిన 'శ్రీ కనక మహాలక్ష్మీ రికార్డింగ్ డాన్సింగ్ ట్రూప్-రాజమండ్రి' లో రెండు రీమిక్స్ సాంగ్స్ ఉంటాయి. ఘంటసాల పాటలు రెండు రీమిక్స్ చేశారు ఆ సినిమాలో. 'తెలిసిందిలే.. తెలిసిందిలే..' మరోటి 'నువ్వలా చూస్తుంటే..' తెలుగులో వచ్చిన ఆల్ టైమ్ బెస్ట్ రీమిక్స్ సాంగ్స్ ఇవి.
అప్పటికే తెలుగు సినీ సంగీత ప్రియుల మదిని దోచిన ఆ పాటలను రీమిక్స్ చేయడమే పెద్ద సాహసం. అలాంటి పాటలను ఆపాత మధురాలను మరిపించేలా.. రీమిక్స్ చేసిన ఘనత ఇళయరాజాది. ఆ పాటలను రీమిక్స్ చేయాలనే ఆలోచన దర్శకుడు వంశీది అయ్యుండొచ్చు. ఏ మాత్రం తేడా కొట్టినా.. తీవ్ర విమర్శల పాలయ్యే అవకాశం ఉన్న ఆలోచన అది. రెండు క్లాసిక్స్ ను రీమిక్స్ చేసి మరో రెండు క్లాసిక్స్ ను ఇచ్చి వంశీ-ఇళయరాజా ద్వయం అదరగొట్టింది. ఇలాంటి ప్రయోగాలు ఇళయరాజాకు కొత్త కాదు. అభినందన సినిమాలో 'ఎదుటా నీవే.. ' సాంగ్ వంశీ తీసిన అన్వేషణలో టైటిల్ సాంగ్ ఒకే ట్యూన్ లో ఉంటాయి. అయితే వేటికదే క్లాసిక్!
ఆ సంగతలా ఉంటే.. ఆ తర్వాతి కాలంలో ఇళయరాజా పాటలను చాలా మంది రీమిక్స్ చేశారు. కొందరు కాపీ కొట్టారు. అలా ఇళయరాజా పాటలను కాపీ కొట్టేసి.. సినిమాలను చుట్టేస్తున్న తరుణంలో.. తన పాటలను తనే రీమిక్స్ చేసే ఒక పనిని బాధ్యతగా తీసుకున్నారు ఇళయారాజా. ఈ సంగీత దర్శకుడికి అమితాభిమాని అయిన బాలీవుడ్ దర్శకుడు బాల్కీ ఇళయరాజా బెస్ట్ సాంగ్స్ ను ఏరికోరి తన సినిమా కోసం రీమిక్స్ చేయించుకున్నాడు! యాడ్ ఏజెన్సీల నేపథ్యం నుంచి వచ్చిన బాల్కీ అసలు పేరు ఆర్ బాలకృష్ణన్. ఇతడి కేరాఫ్ కుంభకోణం. దర్శకుడిగా ఇతడి తొలి సినిమా చీనీ కమ్.
అప్పటికే దశాబ్దాల నుంచి ఇళయరాజా పాటలు బాలీవుడ్ నూ అలరించాయి చాలా సార్లు. తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ అయిన బోలెడన్ని పాటలను హిందీ సినిమాల కోసం వాడారు. అయితే ఇళయారాజా పేరు వాటి విషయంలో పెద్దగా వినిపించలేదు.
అయితే సినిమా మొత్తానికీ ఇళయారాజా స్వరాలను రీమిక్స్ చేసి వాడాలనే ఆలోచన బాల్కీది. అందుకోసం వివిధ సౌత్ సూపర్ హిట్ సాంగ్స్ ను ఎంచుకున్నారు. అయితే ఇక్కడ మరో విషయాన్ని ప్రస్తావించుకోవచ్చు. ఇలా ఇళయరాజా రీమిక్స్ పాటలను సినిమా ఆసాంతం వాడుకున్న మరో దర్శకుడున్నాడు. అతడే రామ్ గోపాల్ వర్మ. హిందీలో వర్మ తీసిన జేమ్స్, శివ 2006 అనే సినిమాలు ఎవరికీ గుర్తుకు లేకపోవచ్చు. అయితే ఆ సినిమాల్లో దాదాపుగా ఇళయరాజా స్వరాలనే రీమిక్స్ చేశారు. అయితే కథా,కథనాల పరంగా ఆ సినిమాలు పేలవరీతిలో ఉండటంతో.. వాటి ప్రస్తావన పెద్దగా ఉండదు.
ఇక చినీకమ్ విడుదలై 16 యేళ్లను పూర్తి చేసుకుంది. 64 వయసున్న ఒక వ్యక్తికి 34 యేళ్ల ఒక మహిళతో ప్రేమాయణం తరహా కథాంశం. సినిమా యావరేజ్ అనిపించుకుంది. అప్పటికీ బాల్కీ కథా రచన మీద అప్పుడే విమర్శలు వచ్చాయి. ప్రత్యేకించి టబు పాత్ర ఇంటికి పిలవగానే అమితాబ్ పాత్ర కండోమ్ తన వెంట తీసుకెళ్లే సీన్ మరీ చీప్ గా ఉందనే విమర్శలు వచ్చాయి. చినీ కమ్ అంటే చక్కెర తక్కువ. ఈ సినిమా కూడా అంతే అని రివ్యూయర్లు రాశారప్పట్లో. ఈ సినిమా రీమేక్ అంటూ అదుర్స్ లో ఒక కామెడీ సన్నివేశాన్ని నడిపించారు!
చీనీ కమ్ అంటే గుర్తుకొచ్చేది ఇళయరాజా పాటలు. నవ్యతను సంతరించుకున్న రీమిక్స్ టోన్స్. అది కూడా ఒరిజినల్స్ కు తీసిపోని రీతిలో ఉన్నవి!
- జానేదోనా.. అనే సాంగ్ ఇళయరాజా కన్నడ క్లాసిక్ కు రీమిక్స్. కన్నడలో జొతెయలి... జొతె జొతెయలే అనే పాట ఆల్ టైమ్ సూపర్ హిట్ మెలోడీ. దానికి రీమిక్స్ ను ఇళయరాజా స్వరపరచగా.. శ్రేయా ఘోషల్ మెప్పించింది.
- మణిరత్నం తీసిన మౌనరాగం సినిమాలోని మల్లెపూల చల్లగాలి సాంగ్ సూపర్ హిట్ దాన్ని రీమిక్స్ చేసి..చినీ కమ్ టైటిల్ సాంగ్ ను రూపొందించారు. దీన్ని కూడా శ్రేయ అదరగొట్టింది. మేల్ వెర్షన్ లో విజయ్ ప్రకాష్ ఈ పాటను పాడాడు. సోనీ సోనీ.. అంటూ ఆ సాంగ్ సాగుతుంది.
- మోహన్- రాధా హీరోహీరోయిన్లుగా నటించిన ఒక తమిళ సినిమాలో సూపర్ హిట్ సాంగ్ ను రీమిక్స్ చేసి బాతేన్ హవా అనే సాంగ్ ను కంపోజ్ చేశారు. ఇది మేల్, ఫిమేల్ రెండు వెర్షన్లలో వాడారు.
ఇళయారాజా ట్యూన్స్ ను కొత్త తరానికి కొత్తగా పరిచయం చేసిన సినిమా చీనీ కమ్. ఈ పాటలు యూట్యూబ్ లో మిలియన్ల సార్లు ప్లే అయ్యాయి. అవుతూనే ఉన్నాయి. మరెవరో కాపీ కొట్టడం కన్నా.. ఇళయారాజా నే తన ట్యూన్స్ ను రీమిక్స్ చేయడం ద్వారా పాతవాటిని చెడగొట్టకుండా స్వరకల్పన సాధ్యమైంది. ఈ సినిమా తర్వాత కూడా బాల్కీ ఇళయారాజా బంధం కొనసాగినట్టుగా ఉంది. అయితే చీనీ కమ్ స్థాయిలో కాదు!
-జీవన్
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా