
షర్మిల వచ్చి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌ని బతికిస్తుందని ఆంధ్రజ్యోతి కొత్త థియరీ. ఆర్కే పలుకుల్లో ఎక్కువ సార్లు గ్యాస్, కొన్నిసార్లు నిజం వుంటుంది. ఒకవేళ ఇది నిజమే అనుకుంటే ఏం జరుగుతుంది?
కాంగ్రెస్ బ్రెయిన్ డెడ్ జరిగి చాలా కాలంగా కోమాలో వుంది. ప్రాణం వుంది కానీ, కదలదు. ఆంజనేయుడు సంజీవని పర్వతం తెచ్చినట్టు ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఆ పార్టీ బతకదు. కాంగ్రెస్ కాలు, చెయ్యి కదిలించాలన్నా మామూలు వాళ్లతో అది సాధ్యం కాదు. మరి షర్మిలకి ఆ శక్తి వుందా? అసలు ఆ అవసరం వుందా?
కర్నాటకలో ప్రస్తుతానికి కాంగ్రెస్ బాక్సింగ్ చాంపియన్ కావచ్చు. మోదీ ఎంత గాలి కొట్టినా బీజేపీ బరిలో నిల్వలేదు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ కొట్టిన దెబ్బలకి ముక్కూమూతి ఏకమై పది కాదు, లక్ష లెక్క పెట్టినా పైకి లేవలేని స్థితిలో వుంది. దానికి చికిత్స అందించి, మళ్లీ పహిల్వాన్ చేయాలంటే, వంద మంది మైక్‌టైసన్లు శిక్షణ ఇచ్చినా జరగదు. అన్న కొట్టిన దెబ్బలకి ఫినిష్ అయిపోయిన పార్టీని చెల్లి బతికించగలదా?
వైఎస్ కూతురిగా షర్మిల అంటే జనంలో అభిమానం వుంది. ఆయన బతికి వున్నప్పుడు ఈమె తండ్రి చాటు బిడ్డే తప్ప, జగన్‌లా రాజకీయాల్లో లేరు. వైఎస్ మరణం తర్వాత పార్టీ పెట్టారు. అప్పుడు కూడా అన్న చాటు చెల్లి తప్ప షర్మిల ప్రత్యేకంగా పాలిటిక్స్‌లో లేరు. జగనన్న వదిలిన బాణంగా చెప్పుకున్నారు తప్ప, తానే ఒక బాణమని ఎప్పుడూ చెప్పలేదు. జగన్ జైల్లో వున్నప్పుడు ఆ ఖాళీని భర్తీ చేయడానికి, పార్టీ శ్రేణుల్లో ఆత్మ విశ్వాసం నింపడానికి తిరిగారు తప్ప, తనకంటూ ఎజెండా లేదు.
2014లో పోటీ చేసినప్పుడు ఆమె కడప ఎంపీగా, లేదా రాజ్యసభకి వెళ్లి వుంటే రాజకీయాల్లో ఆమె పాత్ర ప్రజలకి కూడా అర్థమయ్యేది. ఆ పని చేయకుండా తెరచాటున వుండిపోయారు. కనీసం 2019లో కూడా యాక్టీవ్ కాలేదు. ఒక రకంగా సొంత భవిష్యత్‌ని చేజేతులా వదులుకున్నారు.
తర్వాత తెలంగాణలో పార్టీ పెట్టారు. అన్నతో ఆస్తి గొడవలు లేదా అభిప్రాయ భేదాలు వుంటే అక్కడే చూసుకోవాలి కానీ, ఇక్కడేం పని అని సాధారణ తెలంగాణ పౌరుడికి కూడా అనిపించింది. అన్నకి ఇది బెదిరింపు లేదా హెచ్చరిక అని జనం ఇప్పటికీ నమ్ముతున్నారు తప్ప, ఆమెని తెలంగాణ నాయకురాలిగా గుర్తించడం లేదు. పైగా ఆమె పార్టీ ఇప్పటి వరకు ఏ చిన్న ఎన్నికలో కూడా పాల్గొనలేదు.
నిజంగా బరిలో దిగితే బలమెంతో ఆమెకి కూడా తెలియదు. మూడు పార్టీలు బలంగా ఢీ కొంటున్నప్పుడు నాలుగో పార్టీగా ఆమెని ఆదరిస్తారని అనుకోవడం భ్రమ. ఇది షర్మిలకి కూడా తెలుసు. అయినా కేసీఆర్ మీద పోరాటం చేస్తూనే వున్నారు. ప్రజాసమస్యల్ని ఫోకస్ చేయడం మంచిదే కానీ, జనం సీరియస్‌గా తీసుకోకుండా కామెడీ అనుకుంటున్నారు. పైగా ఆమెకి తెలియని విషయం ఏమంటే వైఎస్ మరణించి 14 ఏళ్లు కావస్తోంది. ఈ గ్యాప్‌లో జనరేషన్స్ మారాయి. కొత్త ఓటర్లు వచ్చారు. వాళ్లకి వైఎస్ గురించి, ఆయన పాలన గురించి తెలియదు. వైఎస్ కూతురిగా రాజకీయాలు చేయడం అంత సులభం కాదు. ప్రజలకి జ్ఞాపకశక్తి చాలా తక్కువ.
తెలంగాణ కాంగ్రెస్‌లో ఆమె చేరితే, ఆ పార్టీకి కొంచెం ప్లస్ అయ్యే మాట నిజమే కానీ, ఆ గ్రూప్ రాజకీయాల్లో షర్మిల ఇమడలేరు. చాలా తొందరగా గొడవలు వస్తాయి. తెలంగాణలో గెలిచి, ఆంధ్రాకి వస్తారని ఆర్కే అంటున్నారు. అంటే 2024 తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోకి వస్తారు. కాంగ్రెస్‌కి ప్రాణం పోస్తారు.
జోక్ ఏమంటే ఒకవేళ జగన్ మీద వ్యతిరేకత వుంటే టీడీపీలో చేర్తారు కానీ, షర్మిల నాయకత్వాన్ని నమ్మి కాంగ్రెస్‌లో ఎవరైనా చేరుతారా? కాంగ్రెస్ గుర్తుని మరిచిపోయి జనం చాలా కాలమైంది. వాళ్లతో హస్తం గుర్తుకి ఓటు వేయించడం మాటలా?
ఏమో గుర్రం ఎగరా వచ్చు అంటే చెప్పలేం. పరుగెత్తే గుర్రాలకే దిక్కులేదు. నడుములు విరిగిపోయిన గుర్రం ఎగురుతుందని నమ్మితే అది అమాయకత్వం లేదా పిచ్చి.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా