Advertisement

Advertisement


Home > Politics - Analysis

సోలో లైఫే సో బెట‌రా... మ‌రో దారి లేదా!

సోలో లైఫే సో బెట‌రా... మ‌రో దారి లేదా!

సోలో లైఫే సో బెట‌రు.. అంటూ సింగిల్ లైన్ లోనే గొప్ప వేదాంతాన్ని చెప్పారు సినీర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి. ఆయ‌నేమీ సింగిల్ కాదు కానీ, ఏ పాట రాసినా ఆ పాట సంద‌ర్భానికి, పాడే క్యారెక్ట‌ర్ దృష్టి నుంచి ఇలాంటి అద్భుత‌మైన సాహిత్యాన్ని జాలువారేలా చేయ‌గల స‌త్తా ఆ ధిగ్గ‌జ ర‌చ‌యిత‌ది. ఇక్క‌డ మాట్లాడుకునే టాపిక్ సిరివెన్నెల సాహితీ ప్ర‌తిభ, స్పాంటేనివిటీ గురించి, సింగిల్ లైన‌ర్ల గురించి కాదు. సోలో బ‌తుకు గురించి!

ఒకానొక ద‌శ‌లో మ‌నిషి లైంగికంగా పూర్తి స్వేచ్ఛా జీవి. ఆ స్వేచ్ఛ అనేక త‌రాల పాటు కొన‌సాగి ఉంటుంద‌ని అర్థం అవుతుంది. ఆ స్వేచ్ఛ విశృంఖ‌లంగా మారిన ద‌శ‌లో వివాహం ఒక సంప్ర‌దాయంగా మారి ఉండ‌వ‌చ్చు. వివాహంలో కూడా స్త్రీ స్వామ్య‌త కొన్ని త‌రాల పాటు ఉండ‌వ‌చ్చు. వివాహం పురుష‌స్వామ్యంగా మారింది కాల‌క్ర‌మంలో. ప్ర‌త్యేకించి భార‌త‌దేశంలో గ‌త కొన్ని శ‌తాబ్దాలు, ద‌శాబ్దాలుగా వివాహం పురుషస్వామ్య వ్య‌వ‌స్థ‌గానే రాజ్య‌మేలింది. క‌న్యాశుల్కం, వ‌ర‌క‌ట్నం ఇవ‌న్నీ కూడా వివాహంలోని పురుష స్వామ్యానికి ప్ర‌తీక‌లే.

రోజులు మారాయి. వివాహం మీద యువ‌త ధోర‌ణి వేరేగా క‌నిపిస్తోంది. అన్ని త‌రాల యువ‌త‌తో పోలిస్తే ప్ర‌స్తుత త‌రానికి అన్నీ తేలిక‌గా అందుబాటులోకి వ‌స్తున్నాయి. చ‌దువు, ఉద్యోగం, వినోదం. అలాగే ప్రేమ కూడా! అందుకే ఎవ‌రిని క‌దిలించినా రెండు మూడు ల‌వ్ స్టోరీలు త‌ప్ప‌క ఉంటాయి. ల‌వ్ స్టోరీలు పెరిగాయి కానీ, వివాహం మాత్రం ఒక బ్ర‌హ్మ‌ప‌దార్థంగా మారింది చాలా మంది పాలిట‌.

ప్రేమ‌లో ఉన్న వారు కూడా పెళ్లి ప‌ట్ల మ‌రీ ఉత్సుక‌త‌తో ఏమీ లేరు. అలాగే ప్రేమ‌ల‌న్నీ క‌ట్టి పెట్టి పెళ్లి బాధ్య‌త‌లు పెద్ద వాళ్ల చేతుల్లో పెట్టిన వారు కూడా వివాహానికి అంత తేలిక‌గా త‌లాడించ‌డం లేదు. ప్ర‌త్యేకించి అరేంజ్డ్ మ్యారేజ్ వైపు మొగ్గుచూపుతున్న అమ్మాయిల ప్రాధాన్య‌త‌లు చాలా ఉంటాయి. ఒక్కోరు క‌నీసం ఇర‌వై ముప్పై సంబంధాలు చూసి కానీ ఏదో ఒక దానికి ఓకే చెప్ప‌డం లేదు! ఇన్ని సంబంధాలు చూశాకా ఏదో ఒక దానికి ఓకే చెప్పక త‌ప్ప‌ని వైరాగ్య‌మే త‌ప్ప‌, వారు అన్ని ర‌కాలుగానూ కోరుకున్న వ‌రుడైతే ల‌భించ‌డం లేదు!

ఇక అబ్బాయిల ప‌రిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. ఉమ్మ‌డి తెలుగు రాష్ట్రాల్లోనే క‌దిలిస్తే వివాహ వ‌య‌సు వ‌చ్చి, చిన్న‌దో పెద్ద‌దో ఉద్యోగం చేస్తూ ఉన్నా.. పెళ్లి కోసం పాట్లు ప‌డుతున్న వారి సంఖ్య ల‌క్ష‌ల్లో ఉంటుంది! వీరిలో చాలా మంది ఇక త‌మ‌కు పెళ్లి క‌ష్ట‌మనే అభిప్రాయానికీ వ‌చ్చి ఆ ఆలోచ‌న‌ల నుంచి విర‌మించుకుంటున్న ప‌రిస్థితి కూడా ఉందంటే ఆశ్చ‌ర్యం లేదు.

ఏ ఊరు చూసినా బ్ర‌హ్మ‌చారుల‌తో కిక్కిరిపోయిన‌ట్టుగా క‌నిపిస్తుంటుంది. ఐదారు వంద‌ల జ‌నాభా ఉన్న ఊర్ల‌లో ఇర‌వై ముప్పై మంది కుర్రాళ్లు పెళ్లి కై ఆశ‌గా ఎదురుచూపుల్లో గ‌డుపుతుంటారు. ఐదారు వంద‌ల జ‌నాభా ఉన్న ఊర్ల‌లోనే ఇర‌వై నుంచి ముప్పై మంది అంటే.. కోట్ల జ‌నాభాకు ఈ నిష్ఫ‌త్తిని లెక్కేస్తే అదే సంఖ్య‌కు చేరుతుందో!

అమ్మాయిలకు మారిన ప్రాధ‌న్య‌త‌ల‌తోనే ఈ అబ్బాయిల‌కు పెళ్లిళ్లు కావ‌డం లేదా, అస‌లు పెళ్లి కూతురు దొరికే ప‌రిస్థితి లేకుండా జ‌నాభా గ‌ణాంకాలున్నాయా.. అనేది ప‌రిశోధిస్తే కానీ తేలే అంశం కాదు. అలాగే సామాజికంగా ఇదంతా ఎలాంటి ప‌రిస్థితుల‌కు దారి తీస్తుంద‌నే అంశం కూడా ప‌రిశోధ‌నాత్మ‌క‌మైన‌దే. ఇబ్బ‌డి ముబ్బ‌డిగా పెరుగుతున్న పెళ్లి కాని వారి సంఖ్య రాబోయే రోజుల్లో ఎలాంటి సామాజిక ప‌రిణామాల‌కు దారి తీస్తుంద‌నేది ప‌రిశోధించుకోవాల్సిన అంశ‌మే. 

ప్ర‌భుత్వాలు, వ్య‌వ‌స్థ‌ల న‌డ‌వ‌డిక‌ల ను కూడా వివాహ వ్య‌వ‌స్థ‌, కుటుంబ వ్య‌వ‌స్థ‌, సామాజిక ప‌రిణామాలు ప్ర‌భావితం చేస్తాయి కాబ‌ట్టి జ‌నాభా గ‌ణాంకాల‌ను వేస్తారు. జ‌నాభా హెచ్చుత‌గ్గుల‌ను ప్ర‌భావితం చేసే అంశం వివాహం. మ‌రి ఈ అంశం గురించి కూడా ప్ర‌భుత్వాలు స్వ‌యంగా అధ్య‌య‌నాలు చేసుకోవాలి. భావి ప‌రిణామాల‌పై ఒక అంచ‌నాకు రావాలి!

ఇద్దరూ ఏడ్చేసారు

నేను సింగిల్ గా ఉండిపోతా