టీడీపీ, జనసేన మధ్య పొత్తు… ఆ రెండు పార్టీలకు ఓట్లు రాలుస్తుందా? అనేది పెద్ద చర్చ. పవన్‌కల్యాణ్ జనసేన పార్టీ స్థాపించి పదేళ్లవుతోంది. క్షేత్రస్థాయిలో జనసేన బలమెంతో సామాన్యుల్ని అడిగినా చెబుతారు. ఇక చంద్రబాబుకు తెలియకుండా వుంటుందా? కేవలం పవన్‌కల్యాణ్ సామాజిక వర్గం ఓట్ల కోసమే జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకుందనేది వాస్తవం. అయితే ఈ పొత్తు ఇరుపార్టీలకు ఏ మేరకు రాజకీయ ప్రయోజనం కలిగిస్తుందనే చర్చ ఇప్పుడు విస్తృతంగా సాగుతోంది.
జనసేనకు ఇచ్చే సీట్ల ఆధారంగా కాపుల ఓట్లు టీడీపీకి బదిలీ వుంటుందని ఆ సామాజిక వర్గం నాయకులు అంటున్నారు. ఇది నిజం కూడా. ఎల్లో మీడియా వార్తల్ని పరిశీలిస్తే 20 నుంచి 25కు మించి జనసేనకు టీడీపీ సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఇదే నిజమైతే జనసేన, టీడీపీ మధ్య పొత్తు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓట్ల బదిలీ జరగదు. తమను టీడీపీ మోసగించిందనే అక్కసు కాపుల్లో పెరుగుతుంది. ఇదే టీడీపీ పాలిట శాపంగా మారుతుందనడంలో అతిశయోక్తి లేదు.
టీడీపీ ఇచ్చే తక్కువ సీట్లకు పవన్ అంగీకరిస్తే, ఆయన చెప్పినట్టు ఓట్లు వేయడానికి జనసేన శ్రేణులు సిద్ధంగా వుండవు. సీఎం జగన్‌ను సీఎం కుర్చీ నుంచి గద్దె దించాలన్నది పవన్ ఏకైక లక్ష్యం. అయితే తమ సామాజిక వర్గానికి చెందిన పవన్‌ను సీఎంగా చూడాలన్నది కాపుల ఆశయం. పవన్‌ను సీఎంగా చూసేందుకు ఓట్లు వేయమంటే కాపులు సంతోషంగా ఆ పని చేస్తారు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు.
చంద్రబాబును సీఎం చేయడం పవన్ రెండో ఆశయం. ఎప్పుడూ కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల మధ్యే అధికార మార్పిడి జరుగుతోందని, మిగిలిన కులాలకు ఎందుకు ఆ అవకాశం రావడం లేదనే భావన ఆ కులాల్లో వుంది. దీన్ని పవన్ పరిగణలోకి తీసుకోకుండా చంద్రబాబు పల్లకీనే మోస్తానంటే అంగీకరించడానికి ప్రజలేమైనా పిచ్చోళ్లా?
జగన్‌పై పవన్‌కున్నట్టే జనానికి ఎందుకు ద్వేషం వుంటుంది? అలాగే చంద్రబాబుపై పవన్‌కున్న ఆరాధన అందరికీ ఎందుకు ఉండాలనే ప్రశ్న సామాన్య ప్రజానీకం నుంచి వస్తోంది. ఈ విషయాన్ని పవన్ గ్రహించి, రాజకీయంగా అడుగులు వేయడం లేదు. ఎంతసేపూ జగన్‌ను దించాలి, చంద్రబాబును అధికార పీఠంపై కూచోపెట్టాలని మాత్రమే పవన్ తపిస్తున్నారు. పవన్ మాదిరిగానే ప్రజలు కూడా ఆలోచించే పరిస్థితి వుండదు. ఎందుకంటే సమాజంలో ప్రతి ఒక్కరికీ అవకాశాలు రావాలని వారంతా కోరుకుంటారు.
చంద్రబాబు, జగన్.. ఆ తర్వాత వాళ్ల వారసులు పాలిస్తామంటే… ఇదేమైనా రాచరికమా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సమాజం ఎప్పుడైనా మార్పు కోరుకుంటోంది. అందుకు తగ్గట్టు కొత్త నాయకులు పుట్టుకొస్తారు. కానీ ప్రత్యామ్నాయం అవుతాడని భావించిన పవన్‌కల్యాణ్… రాచరిక పోకడలకు వత్తాసు పలికేలా వ్యవహరిస్తున్నారు. అందుకే ఆయన్ను జనం పట్టించుకోవడం లేదు. కొద్దోగొప్పో కాపులు, సినీ అభిమానులు మాత్రమే ఆయన వెంట వున్నారు. అలాగని ఆయన చెప్పినట్టే వాళ్లంతా ఓట్లు వేస్తారనే నమ్మకం లేదు. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో పవనే చెప్పారు.
తాజా పరిస్థితుల్లో టీడీపీ-జనసేన మధ్య సీట్ల అవగాహన వచ్చినంత మాత్రాన అద్భుతాలు జరిగిపోతాయని అనుకుంటే అవివేకమే. కులం చెడినా సుఖం వుండాలని పెద్దలు ఊరికే చెప్పలేదు. ప్రస్తుతం జనసేనకు తగినన్ని సీట్లు దక్కకపోతే, ఇక ఎందుకోసం చంద్రబాబు పల్లకీ మోయాలనే ఆలోచన మొదలైంది. ఇదే జనసేన, టీడీపీ మధ్య ఓట్లు బదిలీకి అడ్డంకిగా మారే ప్రమాదం వుంది.