రాజకీయాల్లోకి వచ్చిన విజయ్, తన సినీ కెరీర్ గురించి విస్పష్ట ప్రకటన చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం చేస్తున్న సినిమా కాకుండా, మరో సినిమాకు కమిట్ అయ్యానని, అది చేసి సినిమాల నుంచి తప్పుకుంటానని ఆయన ప్రకటించాడు.
ప్రస్తుతం ఆయన వెంకట్ ప్రభు దర్శకత్వంలో గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ ఉంది. జూన్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీతో పాటు మరో సినిమాను స్టార్ట్ చేస్తానని విజయ్ తెలిపాడు.
అదే విజయ్ చివరి సినిమా. మరి ఆ సినిమాకు దర్శకుడు ఎవరు? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
మొన్నటివరకు ఈ లిస్ట్ లో కార్తీక్ సుబ్బరాజు పేరు వినిపించింది. కానీ నిన్నట్నుంచి హెచ్.వినోద్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దీనికి కారణం ఇది పొలిటికల్ సబ్జెక్ట్ కావడమే.
కమల్ హాసన్ కోసం ఈ కథ రాశాడు వినోద్. కమల్ కూడా ఓకే చెప్పాడు. అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ఇండియన్-2 లేట్ అయింది. అదే టైమ్ లో మణిరత్నం సినిమాకు కమల్ ఓకే చెప్పారు. మరోవైపు కల్కి ప్రాజెక్టు కూడా అంగీకరించారు. దీంతో వినోద్ ప్రాజెక్ట్ నుంచి కమల్ తప్పుకున్నారు.
ఇప్పుడీ కథను తన కెరీర్ కు చివరి చిత్రంగా ఎంచుకున్నాడట విజయ్. ప్రస్తుతానికైతే దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. గోట్ షూటింగ్ ముగిసేలోపు, విజయ్ చివరి చిత్రానికి దర్శకుడు ఎవరనేది తేలిపోతుంది.