టీడీపీ కూట‌మికి ఆ రెండింటితోనే చిక్కులు!

కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతోంది కానీ ఉక్కు లెక్క తేలలేదు, జోన్‌ కధ కూడా అలాగే ఉంది

ఉమ్మడి విశాఖ జిల్లా ఒక్క ఏజెన్సీ త‌ప్ప‌ టీడీపీ కూటమికి ఇటీవల జరిగిన ఎన్నికలలో జై కొట్టింది. మొత్తం పదిహేను అసెంబ్లీ సీట్లు మూడు ఎంపీ సీట్లు ఉంటే రెండు ఎంపీలతో పాటు పదమూడు అసెంబ్లీ సీట్లను కూటమి గెలుచుకుంది. కూటమి గెలుపు వెనక ఇచ్చిన హామీలతో పాటు మూడు పార్టీలూ కలసి తమ సమస్యలను పరిష్కరిస్తాయన్న నమ్మకం ఉంది.

బీజేపీని ఎలాగైనా ఒప్పించి విశాఖ ఉక్కు కర్మాగారం సమస్యకు ఒక న్యాయమైన పరిష్కారం చూస్తారని వేలాదిగా ఉన్న ఉక్కు కార్మికులు, ఉద్యోగులు పూర్తిగా విశ్వసించారు. అదే విధంగా విశాఖలో రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయడంతో పాటు 150 ఏళ్ల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్‌ను కూడా కలిపి రైల్వే ఉద్యోగులకు కార్మికులకు శాశ్వతమైన భరోసా ఇస్తారని కూడా నమ్మి ఓటేశారు.

విశాఖ జిల్లా నిండా ఉక్కు, రైల్వే కార్మికులు హెచ్చు సంఖ్యలో ఉన్నారు. వారి కుటుంబాలు కూడా అలాగే ఉన్నాయి. వీరితో పాటుగా సామాన్య ప్రజలు, విశాఖ అభివృద్ధిని కోరుకునే వారు కూడా కూటమిని గెలిపించడం వెనక అసలైన కారణాలు ఇవేనని చెప్పాలి. అయితే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతోంది కానీ ఉక్కు లెక్క తేలలేదు, జోన్‌ కధ కూడా అలాగే ఉంది అన్న విమర్శలు వస్తున్నాయి.

మరో వైపు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు భూతం పట్టి పీడిస్తోంది. ఒకొక్క కీలకమైన విభాగాన్ని తగ్గించుకుంటూ పోతూ కేంద్రం తన పనిని తాను చేసుకుని పోతోంది అని కూడా విమర్శలు ఉన్నాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న సెంటిమెంట్‌తో ఉద్యోగ కార్మిక వర్గాలతో పాటు ప్రజలు కూడా ఇపుడు ఉద్యమిస్తున్నారు.

రాజకీయ పార్టీలకు అతీతంగా అంతా కలిసి గాంధీ జయంతి రోజున విశాఖలో నిర్వహించిన భారీ ర్యాలీకి అన్ని వర్గాల నుంచి మంచి మద్దతు లభించింది. విశాఖ ఉక్కు సమస్యను మరో రెండు నెలల వ్యవధిలో పరిష్కరించకపోతే జనవరి 27న విశాఖ వేదికగా లక్ష మందికి పైగా ప్రజానీకంతో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కూడా ఉత్తరాంధ్ర ఉక్కు పోరాట సమితి ఇప్పటికే ప్రకటించింది.

విశాఖ ఉక్కు విషయంలో కేంద్రం నుంచి అయితే ఈ రోజుకూ స్పష్టమైన ప్రకటన రాలేదు. తాజాగా ఉక్కు మంత్రి కుమారస్వామితో ముఖ్యమంత్రి చంద్రబాబు, విశాఖ ఎంపీ శ్రీభరత్‌, అలాగే ఇతర ముఖ్య నాయకులు సమావేశం జరిపారు. ఉక్కు విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ మీదట ఉక్కు ఉద్యోగులతో విశాఖలో ఎంపీ మాట్లాడుతూ ఉక్కును కాపాడుతామని పాట పాటే పాడారు. అయితే దీని మీద తగిన స్పష్టత లేదని ఉక్కు కార్మిక సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.

కార్మిక సంఘాలు ఏకకంఠంతో కోరుతున్నది ఏమిటి అంటే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సెయిల్‌లో విలీనం చేయమని, దాని వల్లనే శాశ్వతమైన పరిష్కారం లభిస్తుందని. అంతే తప్ప ప్రైవేటుకు అప్పగించవద్దు అన్నదే వారి డిమాండుగా ఉంది. సెయిల్‌లో విలీనమే ఇపుడున్న పరిస్థితులలో కేంద్రం చేయగలిగేది అని కూడా నమ్ముతున్నారు. అలా కాకుండా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అలాగే కొనసాగించాలి అంటే పది వేల కోట్ల రూపాయలు వర్కింగ్‌ కేపిటల్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. అప్పులను కేంద్రం మాఫీ చేయాల్సి ఉంటుంది. అలాగే సొంత గనులను కేటాయించాలి. ఇవన్నీ కేంద్రం చేస్తే విశాఖ ఉక్కు తన సొంత అస్థిత్వంతోనే ఉంటుంది అన్నది కూడా ఉంది.

కానీ ఈ రెండూ కాకుండా పొడిపొడి మాటలతో ఉక్కును రక్షిస్తామంటే దానిని ఎలా అర్ధం చేసుకోవాలన్నది కార్మికుల వైపు నుంచి వినిపిస్తున్న ఆవేదన. ఈ విధంగా చెబుతూ పోతూంటే ఏదోనాటికి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటుపరం అవుతుందన్న అనుమానాలు భయాలు కూడా ఉన్నాయి.

ఇక విశాఖ రైల్వే జోన్‌ విషయం తీసుకుంటే దానిని అయిదేళ్ల క్రితమే కేంద్రం ప్రకటించింది. కానీ తగిన భూమి చూపించలేదని సాకుతో అయిదేళ్లూ గడిపేసారన్నది రైల్వే కార్మిక వర్గాల విమర్శగా ఉంది. రైల్వేకు చాలా భూములు ఉన్నాయని చిత్తశుద్ధి ఉంటే వాటిలోనే నిర్మిస్తే ఏనాడో విశాఖకు రైల్వే జోన్‌ వచ్చి ఉండేదని కూడా అంటున్నారు. ఇక రైల్వే జోన్‌ లేదు కానీ వాల్తేరు డివిజన్‌ను ముక్కలు చేసిపారేశారు అని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లాభాల బాటలో నడిచే వాల్తేరు డివిజన్‌తో కలిపి రైల్వే జోన్‌ ఇస్తేనే విశాఖకు మేలు జరుగుతుందని అంటున్నారు. ఆ దిశగానే సాధించి చూపాలని ఆంధ్రలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ నేపధ్యంలో చూస్తే కనుక టీడీపీ కూటమికి కుంపటిగా ఈ రెండు సమస్యలు ఉన్నాయి. వీటిని పరిష్కరించడం అన్నది అంత సులువు కాదు.

రైల్వే జోన్‌కు డిసెంబర్‌లో శంకుస్ధాపన అని అన్నారు. అది జరిగితే మంచిదే కానీ దానితో పాటుగా వాల్తేరు డివిజన్‌ను యధాతథంగా పునరుద్ధరించకపోతే కార్మిక లోకం సంతృప్తి వ్యక్తం చేయదు. అలాగే విశాఖ ఉక్కు విషయంలో శాశ్వతమైన పరిష్కారం చూపకపోతే ఉద్యమాలు కొనసాగుతూనే ఉంటాయి. కేంద్రమే చొరవ చూపించి ఈ రెండు విషయాలలో సానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి. దానికి టీడీపీ కూటమి పెద్దల నుంచి కూడా పూర్తి స్ధాయిలో ఒత్తిడి రావాల్సిన అవసరం ఉంది.

విశాఖను ఆర్ధిక రాజధాని అంటున్నారు. ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగంలో ఉంటేనే అది సాధ్యపడుతుంది. ఆ బిరుదుకూ సార్ధకత ఉంటుంది. అలాగే వాల్తేరు డివిజన్‌తో కూడిన రైల్వే జోన్‌ వస్తేనే విశాఖ సహా ఉత్తరాంధ్ర ప్రగతి బాటన పడతాయి. ఈ విషయాలలో కూటమి ప్రభుత్వం పూర్తి స్ధాయిలో న్యాయం చేయకపోతే మాత్రం ఆదరించిన ప్రజలు కార్మిక సంఘాల నుంచే వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు.

3 Replies to “టీడీపీ కూట‌మికి ఆ రెండింటితోనే చిక్కులు!”

  1. పింఛను 4000 చేసినప్పుడు ఫర్వాలేదు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుంటారని అనిపించింది.

    పిల్లలకు స్కూళ్ళల్లో సరైన టీచర్లు లేరు కాబట్టి cbse రద్దు అని చెప్పినప్పుడు ఇదేమి అన్యాయం, మీ పిల్లలకు ఇదే పరిస్థితి వస్తే ఊరుకుంటారా అనిపించింది. అయినా ఆయన విజనరీ కదా ఏదో పరిష్కారం ఆలోచించి ఉంటారులే అని ఒక చిన్న ఆశ…

    మెడికల్ కాలేజీలు ఆపేస్తున్నప్పుడు అదేమిటి ఒక కాలేజీ ఆపటం అంటే ఒక ఆసుపత్రి కూడా ఆపటం, అంటే ఆ ప్రాంత అభివృద్ధి, కొన్ని వేల ఉద్యోగాలు పోవడం కదా అని అనిపించింది. అయినా ఆయన విజనరీ కదా ఏదో కొత్త పథకం ఆలోచించి ఉంటారులే అని ఒక చిన్న నమ్మకం…

    వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తున్నప్పుడు, అయ్యో వీరే కదా ఎన్నికలకు ముందు పదివేలు ఇస్తాం అన్నారు. తమ చుట్టు పక్కల వారికి ప్రభుత్వ సేవలు వారి ఇంట్లోనే అందిస్తూ ఎంతోకొంత సంపాదించుకుంటున్నారు కదా, మరి ఈ లక్షల మందిని ఏమి చేస్తారో అని అనిపించింది. అయినా ఆయన విజనరీ కదా ఏదో పరిష్కారం ఆలోచించి ఉంటారులే అని ఒక చిన్న ఆశ…

    విశాఖ స్టీల్ ప్లాంట్ లో వేలాది ఉద్యోగాలు తీసివేస్తుంటే, ఎన్నికలకు ముందు ఈ కూటమే కదా ఆ ప్లాంటుకు ఏమీ కాదు, అక్కడ ఉద్యోగస్తుల భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చింది అని అనిపించింది. అయినా ఆయన విజనరీ కదా ఏదో పరిష్కారం ఆలోచించి ఉంటారులే అని ఒక చిన్న ఆశ…

    గత ప్రభుత్వం యార్డుల్లో నిలవ ఉంచిన లక్షల టన్నుల ఇసుక ప్రభుత్వానికి రూపాయి ఆదాయం రాకుండా మాయమై పోయి ఇప్పుడు ఇసుక దొరకటం లేదని, నిర్మాణ రంగం కుదేలైందని వార్తలు వస్తుంటే, అదేమిటి ఇసుక ఉచితం ఇక ఎక్కడ చూసిన నిర్మాణాలు అనుకుంటే ఇలా జరిగిందేమిటి అని అనిపించింది. అయినా ఆయన విజనరీ కదా ఏదో పరిష్కారం ఆలోచించి ఉంటారులే అని ఒక చిన్న ఆశ…

    చివరగా మద్యాన్ని ప్రైవేటు పరం చేసి, షాపులు పెంచి ఆఖరకు బెల్ట్ షాపులను కూడా వేలంలో పాడుకొంటున్నారని వార్తలు చదివాక ఆయన నా ఆశల్ని వమ్ము చేయలేదని అనిపించింది. ఏ వర్గం ప్రజల్ని ఎక్కడుంచాలో, ఏ వర్గానికి చదువుల వ్యాపారం ఇవ్వాలి, ఏ వర్గానికి వైద్య వ్యాపారం ఇవ్వాలి, ఎవరికి ఇసుక మీద ఆదాయం వెళ్ళాలి, ఎవరితో మద్యం తాగిస్తే ఎటువంటి కోరికలు లేకుండా హాయిగా మత్తులో ఉంటారు వంటి అంశాల మీద ఆయన అనుభవాన్ని రంగరించి మరీ నిర్ణయాలు తీసుకుంటున్నారు అని స్థిమితంగా అనిపించిం

    Ramesh Adusumilli గారి వాల్ నుండి

Comments are closed.