తెలుగుదేశం నాయకుడు గంటా శ్రీనివాసరావు పార్టీ మారుతారు అంటూ వార్తలు. ఓ రాజకీయ నాయకుడు పార్టీ మారడం ఇవ్వాళ, రేపు పెద్ద విశేషం కాదు. మారకుండా అక్కడే వుంటే వార్త అవుతుందేమో? విశాఖ తెలుగుదేశం నాయకుడు గంటా పార్టీ మారతారని దాదాపు మూడేళ్లుగా వార్తలు వినిపిస్తూనే వున్నాయి. కానీ మారడమే కనిపించడం లేదు.
ఇన్నాళ్లూ గంటా పార్టీ మారి వైకాపా లోకి వెళ్లడానికి విజయసాయిరెడ్డి అడ్డంగా వుంటూ వచ్చారు. గంటా వెనుక వున్న ‘కమ్మ’ని బంధాలు విజయసాయికి నచ్చి వుండవు. అయితే విశాఖ వైకాపా ఇన్ చార్జ్ గా ఇప్పుడు సుబ్బారెడ్డి వచ్చారు. ఆయనకు ఇలాంటి తరతమ బేధాలు లేవు. పనులు చేయడం, పనులు చేయించుకోవడం తప్ప మరేం పట్టవు. అందుకే గంటా పార్టీ మారడానికి మార్గం సుగమం అయి వుండొచ్చు.
అది సరే అసలు గంటాకు పార్టీ మారాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఆయనకు తెలుగుదేశంతో వచ్చిన సమస్య ఏమిటి? జగన్ సునామీ లో గెలిచిన వీరుడు కదా? ఇప్పుడు గెలవడానికి అస్సలు భయం లేదు. పైగా 2019 మాదిరిగా జగన్ గాలి వీచడం లేదని తెలుగుదేశం అను’కుల’ మీడియా తెల్లారి లేచింది మొదలు టముకేస్తోంది. ఇంకేం భయం. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే కచ్చితంగా గంటా మంత్రి అయిపోతారు. అందులో ఏమన్నా సందేహం వుందా? గంటా కు? లేదా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం మీద ఏమన్నా సందేహం వుందా?
తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని ఏమాత్రం నమ్మకం వున్నా గంటా పార్టీ మారరు. ఎందుకంటే తెలుగుదేశం అధిష్టానంతో కాస్త మంచి సంబంధాలే వున్నాయి. కానీ ఇక్కడ ఒకే సమస్య వుంది. జనసేన-తేదేపా బంధం పక్కా అని అర్థం అయిపోతోంది. వైకాపాను ఓడించడానికి, వైకాపా మీద పోరాడడానికి తనకు భాజపా పెద్దల అనుమతి అవసరం లేదని పవన్ కళ్యాణ్ కుండ బద్దలు కొట్టెసారు. అంటే మోడీ, అమిత్ షా అడ్డం పడినా జనసేన అడుగులు తేదేపా వైపే అని అర్థం అయిపోతోంది.
ఇదే గంటాకు సమస్య అవుతుందా? ఎందుకంటే గంటా అంటే అస్సలు పడదు పవన్ కళ్యాణ్ కు. ప్రజారాజ్యం మాజీలు ఎవరన్నా కూడా పవన్ కు పడదు. పైగా అల్లు అరవింద్ కు, చిరు కు గంటా సన్నిహితుడు. ఈ బ్యాచ్ అంటే పవన్ కు అస్సలు పడదు అని గతంలో అనేక సార్లు వార్తలు వినిపించాయి. ప్రజారాజ్యం ను ముంచేసారు అనో మరోటి అనో పవన్ కు ఓ అనుమానం వుందని టాక్. అందువల్ల జనసేనతో చేతులు కలిపే తేదేపాతో తనకు పొసగదు అని గంటా అనుకుంటున్నారా?
ఈ రెండూ కాక మూడో కారణం కూడా వినిపిస్తోంది. విశాఖ లోని తెలుగుదేశం అనుకూల సామాజిక వర్గంతో ఇప్పుడు గంటా సంబంధాలు అంతంత మాత్రంగా వున్నాయి. అందువల్ల ఇలాంటి వాటికి కీలకంగా ప్రయారిటీ ఇచ్చే లోకేష్ కు గంటా మీద అభిమానం అంతంత మాత్రం అని కూడా వినిపిస్తోంది. లోకేష్ కు అభిమానం లేక, తేదేపాతో పొత్తు పెట్టుకునే జనసేన తోటీ స్నేహం లేక గంటా సాధించేది ఏముంటుంది? ఎమ్మెల్యేగా గెలవడం తప్ప. అందుకేమైనా పార్టీ మారాలనుకుంటున్నారా?
వైకాపాలోకి వస్తే అనకాపల్లి ఎంపీగా వెళ్లొచ్చు. లేదా గంటాకు కలిసి వచ్చిన భీమిలి వుండనే వుంది. ఇంతకీ గంటా గంట వైకాపాలో మోగుతుందో లేదా తేదేపాలోనే వుంటుందా అన్నది కొద్దిరోజుల్లో తేలిపోతుంది.