ఎవరి సర్వేలు వారివి. సర్వే జనా సుఖినో భవంతు అనే మాదిరి సర్వేలు కూడా వుంటూనే వుంటాయి. అలాగే నికార్సయిన సర్వేలు కూడా వుంటాయి. అలాంటి నిఖార్సయిన సర్వేలు బీఆర్ఎస్ ఇప్పటికీ ఎడ్జ్ లో వుందని చెబుతున్నాయి. ఆంధ్ర లో పవర్ లో వున్న వైకాపా తరపున జరిగిన ఓ అంతర్గత సర్వే లో చిత్రమైన ఫలితాలు వెల్లడయినట్లు తెలుస్తోంది.
విశ్వసనీయ వర్గాలు అందించిన అందించిన ఆ సర్వే వివరాల ప్రకారం, బీఆర్ఎస్ కు 45 నుంచి 50 స్థానాలు పక్కాగా, ఫిక్స్ డ్ గా గెలిచే అవకాశం వుందని తెలుస్తోంది. అదే విధంగా 40 స్థానాల వరకు కాంగ్రెస్ కు అవకాశం వుందని బోగట్టా. ఈ స్ధానాల్లో సెకెండ్ థాట్ లేదట. అలాగే భాజపా అయిదు చోట్ల, ఎంఐఎం నాలుగు చోట్ల పక్కాగా విజయం సాధిస్తాయని ఆ సర్వేలో తేలినట్లు తెలుస్తోంది.
అంటే ఈ రెండు పార్టీల పరోక్ష మద్దతు బీఆర్ఎస్ కే వుండే అవకాశం వుంది. అదే జరిగితే బీఆర్ఎస్ వైపు బలం 55 నుంచి 60 సీట్లు వుంటుంది. ఇదిలా వుంటే మిగిలిన సీట్లలో కొన్ని చోట్ల కాంగ్రెస్-బీఆర్ఎస్, మరి కొన్ని చోట్లు భాజపా-బీఆర్ఎస్ పోటా పోటీగా వున్నాయట. ఎవరు గెలిచినా స్వల్ప మార్జిన్ తో గెలుస్తారని లెక్కలు కడుతున్నారు.
ఇప్పుడు ఈ పోటాపోటీగా వున్న సీట్లలో ఎవరు ఎక్కువ గెల్చుకుంటారు అన్న దాన్ని బట్టి ఫలితం వుంటుంది. సగం సీట్లు బీఆర్ఎస్ గెల్చుకున్నా, అధికారం చేపడుతుంది. లేదూ కాంగ్రెస్.. బిజెపి వాటిని పంచుకున్నా కూడా భారాస ఎడ్జ్ లోనే వుంటుంది. అందువల్ల ఎటుతిరిగి చూసుకున్నా హంగ్ అనే సమస్య రావడానికి అవకాశం కనిపించడం లేదు.