Advertisement

Advertisement


Home > Politics - Opinion

‘ముని’వాక్యం: మనుషులు వికసించాలి!

‘ముని’వాక్యం: మనుషులు వికసించాలి!

‘అప్పట్లో ఇలా ఉండేది’ అంటూ పాతబడిన ప్రతిదానినీ గొప్పదిగా అభివర్ణించడం అనేది ఒకరకమైన అచేతనత్వానికి, జడత్వానికి, మార్పును ఆమోదించలేని అసమర్థతకు, ఆహ్వానించలేని సంకుచితత్వానికి ప్రతీకగా చెబుతుంటారు. కొన్ని మినహాయింపులు ఉంటాయని గుర్తుంచుకుని- ఈ సిద్ధాంతాన్ని మనం ఆమోదించాల్సిందే. కొన్ని పాత విషయాలను గుర్తు చేసుకుని తదనుగుణంగా మాట్లాడుకోవడం తప్పు కాదు. మార్పును ఆహ్వానించడానికి అది విరుద్ధమూ కాదు. పాతరోజుల్లో ఎలా ఉండేది? కేవలం ఉదాహరణ కోసం ఒకటిరెండు విషయాలు చెప్పుకుందాం. 

ఒక వంట మనకు రుచిస్తుంది. చేయడం మనకు చేతకాదు. ఇరుగింట్లో పొరుగింట్లో అది తెలిసిన వాళ్లను అడుగుతాం. వీలైతే వారి ప్రత్యక్ష గైడెన్స్ లోనే తొలిసారి తయారుచేస్తాం! బడి పిల్లవాడికి టీచరు చెప్పిన పాఠం అర్థం కాలేదు. క్లాసులో తెలివైన మరొక మిత్రుడినో, లేదా సీనియర్ స్టూడెంటునో వెతుక్కుంటూ వారి ఇంటికి వెళతాడు. సందేహ నివృత్తి చేసుకుంటాడు. మరి ఇప్పుడు ఏమవుతోంది. 

ఒక వంట గురించి విన్న వెంటనే దాని మీద ముచ్చటపడిన వారు.. యూట్యూబ్ ఓపెన్ చేస్తారు. వంటను ఇష్టపడేవారే అయితే గనుక.. అప్పటికే అనేకానేక వంటల చానెల్స్ కు సబ్‌స్క్రయిబ్ చేసే ఉంటారు. వాటిలో తమకు కావాల్సిన వంటను వెతుక్కుంటారు. ఒకటికి రెండుసార్లు చూస్తారు. ఆ దామాషాలో వండేసుకుంటారు. విద్యార్థులైనా అంతే.. ఒక పాఠం అర్థం కాకపోతే.. తక్షణమే యూట్యూబ్ ను ఆశ్రయిస్తారు. రెండు ఉదాహరణల్లోనూ కొత్తతరానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. వారు తలచిన పని, తలచిన రీతిలోనే నెరవేరుతున్నది. ఇంకా సూటిగా చెప్పాలంటే గతంలో కంటె మెరుగ్గా కూడా నెరవేరుతుండవచ్చు.

కానీ ఇక్కడ జరుగుతున్నది ఏమిటి? ఆధునిక సాంకేతికత కొత్తతరానికి ఎంతో సౌకర్యంగా ఉపయోగపడుతున్నది. దానిని మనం ఖచ్చితంగా ఆమోదించాలి. అదే సమయంలో.. మనుషుల మధ్య కమ్యూనికేషన్ ను, మనుషుల మధ్య సంబంధాలను, అసలు మనుషుల పరస్పర సంపర్కాన్ని కూడా నెమ్మదిగా ఛిద్రం చేసేస్తున్నది. మరో రకంగా చెప్పాలంటే.. ప్రతి ఒక్కరూ  కూడా.. తాము సృష్టించుకున్న తమదైన చిన్ని ప్రపంచంలో ఇరుక్కుపోతున్నారు. కుంచించుకుపోతున్నారు. ఇలాంటి ప్రతిపరిణామాన్నీ సంకుచితత్వం అనలేం. ప్రతిదీ తప్పుగా వేలెత్తిచూపలేం. కానీ, ఇంతటి విశాలమైన ప్రపంచం ఉండగా తమ చుట్టూ చాలా చాలా చిన్న గిరి గీసుకుని అందులోకి ముడుచుకుపోతుండడం కించిత్ బాధ కలిగిస్తుంది! సాంకేతికత వెర్రితలలు వేయడం లేదు.. దాని వినియోగం పెడదారి పట్టడం వల్ల జరగుతున్న పరిణామాల్లో ఇదికూడా ఒకటి.

ఆధునిక సాంకేతికత వెర్రి తలలు వేస్తే ఎలా ఉంటుందో తెలియజెప్పేది.. ‘ఆండ్రాయిడ్ కుంజప్పన్’ సినిమా. ఆమెజాన్ ప్రైమ్ లో ‘ఆండ్రాయిడ్ కట్టప్ప’గా తెలుగు ప్రేక్షకులకు అందుబాటులో ఉన్న అద్భుతమైన మళయాళ చిత్రం ఇది. గ్రామంలో ఒంటరిగా ఉంటున్న వయసుమళ్లిన తండ్రికి ఆసరాగా ఉండడంకోసం ఆండ్రాయిడ్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే రోబోట్ ను తెచ్చి ఇంట్లో పెడతాడు- జపాన్ లో ఉద్యోగం చేస్తున్న కొడుకు. రూపంలో తేడా తప్ప.. ఆ రోబోట్ ఆ పెద్దాయన విషయాలన్నింటిలోనూ సాటి మనిషిలాగా సజావుగా ప్రతిస్పందిస్తుంటుంది. ఆయనకు చక్కటి సేవలందిస్తుంటుంది. 

తొలుత దానిని తీవ్రంగా వ్యతిరేకించినా, క్రమేపీ ఆయనకు దానితో అనుబంధం ముడిపడుతుంది. దృష్టికి  బొమ్మే అయినా, ఆయన బుద్ధి దానిని బిడ్డలాగా చూస్తుంటుంది. ఆ బొమ్మను బజారుకు తీసుకువెళుతూ.. ఎంచక్కా పంచె కూడా కట్టేస్తాడు. ఆ కట్టప్పను ప్రేమించడం ప్రారంభిస్తాడు. దాని ఎక్స్‌పెయిరీ డేట్ వచ్చే సమయానికి, తయారుచేసిన కంపెనీకి తిరిగివ్వడానికి ఒప్పుకోడు. ఈలోగా, ఆ రోబోట్ పనితీరు వికటిస్తుంది. ఆ పెద్దాయననే చంపడానికి ప్రయత్నిస్తుంది. .. తర్వాత ఏదో మలుపు తిరుగడంతో కథ పూర్తవుతుంది.

నిజమే. సాంకేతిక విప్లవం మన జీవన గమనాలను ఎంతో సులభతరం చేసేస్తోంది. కానీ అదే సాంకేతికత ముదిరి ముదిరి మన ప్రాణాలను కబళించేసే పరిస్థితి వస్తే పరిస్థితి ఏమిటి? ఆ సాంకేతికతను నిందించే పని అక్కర్లేదు. అవసరానికి మించి దానిని వాడుతున్నామేమో అనే ఆత్మ పరిశీలన మాత్రం అవసరం.

కేరళలో కొందరు డాక్టర్లు గూగుల్ మ్యాప్ లను అనుసరించి కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లారు. మ్యాప్ ను బట్టి, గుడ్డిగా వెళ్లడంలో వారి కారు ఏకంగా పెరియార్ నదిలోకి వెళ్లిపోయింది. ఆ నీటిని కూడా వారు రోడ్డుగానే అనుకున్నారు. గూగుల్ ఎటూ రూట్ అటే అని చెప్తోంది.. వెళ్లిపోయారు. నదిలో కారు మునిగి.. ఇద్దరు యువ డాక్టర్లు చనిపోయారు. మిగిలిన ముగ్గురిని స్థానికులు ప్రాణాలతో కాపాడారు.

నాలుగేళ్ల కిందటి సంగతి. ప్రయాగరాజ్ లో కుంభమేళా చూద్దామని కారులో వెళుతున్నాం. ఇంత టెక్నాలజీలు వచ్చిన తర్వాత.. ఏ కొత్త ప్రాంతంలో తిరుగుతున్నా సరే నోరు తెరిచి ఒకరిని అడగవలసిన అవసరం ఏముంది? ఉత్తరాదిలో ఏదో చిన్న పట్టణం చేరుకున్నాం. అందమైన స్వరంలో గూగుల్ చెబుతోంది.. చెప్పినట్టుగా మలుపులు తిప్పేసుకుంటూ.. సందులు గొందులు తోసిరాజనుకుంటూ నడుపుతున్నాను. తీరా ఓ ఇరవై నిమిషాలు అనేక ఇరుకు సందులు తిరిగిన తర్వాత.. అత్యంత ఇరుకైన సందులోకి చాలా దూరం వెళ్లి కారు ఆగిపోయింది. 

మా కారుకు అటు ఇటు అడుగు ఖాళీ కూడా లేదు. మనిషి నడిచి వెళ్లడం కూడా కుదరదు. కార్లు ఆటోలు కాదుగానీ.. మోటారు సైకిళ్లు అనేకం వచ్చి కారు ఎదురుగా ఆగిపోయాయి. కారు రివర్సులో వెళ్లడం కూడా అసాధ్యం. వెనక కూడా బోలెడు వాహనాలున్నాయి. ఎదురుగా ఉన్న వాహనాలవాళ్లు ఎంతో సహృదయంతో.. కొద్ది దూరం వెనక్కి తోసుకెళ్లి.. కారు ముందుకు సాగడానికి దారిచ్చారు. వారికి దణ్నం పెట్టుకుని, కృతజ్ఞతలు చెల్లించుకుని ముందుకు సాగాం.

గూగుల్ మనకు చక్కగానే మార్గనిర్దేశనం చేస్తుంది సరే.. కానీ, పట్టణం రాగానే.. మేం చేరవలసిన అవతలి గమ్యస్థానానికి దారెటు? అని ఏ ఒక్కరినో ఒక్క మాట అడిగిఉంటే ఈ తిప్పలు వచ్చి ఉండేవి కాదు. అలా ‘అడగడం’ అనే అలవాటును, సాటిమనుషులతో సంభాషించే పాతతనాన్ని మరచిపోతున్నాం.

ఇదే మాదిరి కష్టం అమెరికాలో కూడా కొందరికి వచ్చింది. లాస్ వేగాస్ నుంచి లాస్ ఏంజెల్స్ కు కొందరు వాహనాల్లో బయల్దేరారు. ‘ఇది షార్ట్ కట్’ అంటూ గూగుల్ ఓ మార్గం చూపించింది. 50 నిమిషాల సమయం కలిసొస్తుందని, సురక్షితమైన మార్గమని అన్నది. వారంతా ఎంచక్కా ఆ దారిలో వెళ్లిపోయారు. కాసేపటికి చిక్కటి నెవాడా ఎడారిలోకి వెళ్లారు. ఇసుక రోడ్డులో వాహనాలు కూరుకుపోయాయి. అంతకు ముందే.. ఎదురుపడిన ఒక ట్రక్కు డ్రైవర్ అటువైపు రోడ్డు లేదని చెప్పాడు. హెచ్చరించాడు! కానీ.. మనిషి మీద కంటె గూగుల్ మీదనే వారికి నమ్మకం ఎక్కువ. దూసుకెళ్లిపోయి ఇసుక దారిలో ముందుకు వెనక్కు కదల్లేకుండా కూరుకుపోయారు. హైవే పెట్రోల్ కు ఫోను చేసినా ఎవరూ రాలేదు. చివరికెలాగో ఒక టోయింగ్ ట్రక్ ను పిలుచుకుని బయటపడ్డారు. గూగుల్ మీద విశ్వాసంతో.. ఎదురుపడిన, మన మేలుకోరి తానై సలహా చెప్పిన మనిషి మాటను నమ్మకపోవడం అనేది టెక్నాలజీ మనలో తెచ్చిన మార్పు.

ఇదివరకటి రోజుల్లో మనం తెలియని ప్రాంతాలకు సొంత వాహనాల మీద దూర ప్రయాణాలు చేయనేలేదా? ఎక్కడికక్కడ కారు ఆపడం.. అక్కడి ప్రజలను మన గమ్యస్థానం గురించి వాకబు చేయడం, దారిని, అక్కడి పరిస్థితిని తెలుసుకోవడం, వెళ్లడం అప్పటి అలవాటు. గూగుల్ వచ్చిన తర్వాత.. మనం మనుషులతో మాట్లాడడం మానేస్తున్నాం. ఒక్క సాంకేతికతను మాత్రమే నిందించడం కూడా సరికాదు.

నేను గతంలో ‘హైవే’ అని ఒక కథ రాశాను. నవతరం నేషనల్ హైవేలు రూపుదిద్దుకున్న తర్వాత.. నగరాల మధ్య ప్రయాణం చాలా చాలా వేగవంతం అయింది. ఇది నిజానికి ప్రయాణాలు చేసేవారికి ఎంతో సౌలభ్యం కూడా.  కానీ.. స్వర్ణచతుర్భుజి మీద పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ.. కన్యాకుమారినుంచి కలకత్తా దాకా వెళ్లిపోయిన తరువాత వెనక్కు చూసుకుంటే.. మనకు దాటిన ప్రాంతాల మనుషులు, అక్కడి పరిస్థితులు, మంచి చెడులు, వారి భాషా సంస్కృతులు కనీస మాత్రంగానైనా స్ఫురణలోకి వస్తాయనుకుంటే భ్రమే. 

హైవే పొడవునా.. కొన్ని రకాల వ్యాపారాలు ఉంటాయి. అక్కడంతా… హిందీ మాట్లాడే ప్రపంచమే కనిపిస్తుంది. ఇక ఆయా ప్రాంత స్థానికతల ఊసు మన మదిలోకి ఇంకదు. అదే పరిస్థితి  ఆ ‘హైవే’ కథలో ఒక పాత్రకి ఎదురవుతుంది. ‘ఈ హైవే లొచ్చినాయి. పెద్ద ఊళ్లని ముడిపెడతన్నాయి. చిన్న పల్లెల్ని వెలి యేస్తన్నాయి. వ్యాపారాల్ని అతుకుతున్నాయి. బతుకుల్ని తెగ్గొడతన్నాయి.. ఏ వాసనా తగలకుండానే ప్రయాణం అయిపోతండాది’ అంటుంది కథలో ఆ పాత్ర.

గూగుల్ మ్యాప్స్ చేస్తున్న పని కూడా అదే. కొత్త ప్రాంతానికి వెళ్తున్నప్పుడు అక్కడి మనుషులతో కూడా సంభాషించి పొందగల అనుభూతి సౌందర్యాన్ని చంపేస్తున్నది. నింద గూగుల్ మీద కాదు. దానిని వాడుతున్న మన శైలి మీద. నిర్జన రహదారులు సాగినంత మేర ఆ సాంకేతికత మీద ఆధారపడినా.. ఊర్లూ, మనుషులూ కనిపించినప్పుడు.. కాస్త వారితో కూడా మాట్లాడుతూ మన గమ్యాలకు వెళితే.. ఆ ప్రయాణ అనుభూతిలో ఖచ్చితంగా తేడా ఉంటుంది. కేవలం ప్రమాదాల్లో ఇరుక్కోకపోవడం, ప్రాణాలు కోల్పోవకపోవడం గురించి మాత్రమే కాదు. అందుకు మిన్నగా ఉంటుంది ఆ అనుభూతి.

చర్విత చర్వణమే అయినా, అనేక మంది అనేక సందర్భాల్లో గగ్గోలు పెడుతున్న సత్యమే అయినా.. మరొకసారి మనం మననం చేసుకోవడం తప్పేమీ కాదు. సాంకేతికతతో మనం ఆడుకోవాలి. అది మనతో ఆడుకోకూడదు. మన జీవితాలకు అది ఉపయోగపడాలి. మన జీవితాలను అది శాసించకూడదు.

ఈసారి ఎక్కడికైనా వెళుతున్నప్పుడు.. మీ గమ్యాన్ని గూగుల్ చాలా స్పష్టంగా చూపిస్తున్నా సరే.. ఆ సమీపంలో కాస్త వాహనాన్ని ఆపండి.. మీకు కాస్త నడపడం నుంచి చిరు విరామం.. దాపున ఉన్న మనిషిని పలకరించండి.. ఓ చిరునవ్వు నవ్వండి.. గమ్యం చేరడానికి మేలైన దారి ఏదో అడగండి. సమాధానం వచ్చిన తర్వాత థాంక్స్ చెప్పండి.. ఉభయులూ చిరునవ్వు నవ్వుకోండి. తర్వాత కదలండి. వారు చెప్పేది అచ్చంగా.. గూగుల్ చూపించిన మార్గమే అయినా సరే!!

సాంకేతికతతోనే గరిష్టమైన కాలహరణం జరుగుతున్న, అనునిత్య సహజీవనం సాగుతున్న ఈ రోజుల్లో.. ఇలాంటి పనులు మాత్రమే మనం మనుషులం అనే స్పృహను అప్పుడప్పుడూ కలిగిస్తూ.. మనల్ని సజీవంగా ఉంచుతాయి. అదే లేనప్పుడు.. రక్తమాంసాలున్న యంత్రాలే అయిపోతాం. ఆహార నిద్రా భయ మైథునాదులు ఎరిగిన గాడ్జెట్స్ గా రూపాంతరం చెందుతాం. సందేహం లేదు.

..కె.ఎ. మునిసురేష్ పిళ్లె

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?