కాలం చాలా విచిత్రం. అది ఎవరి వైపూ వుండదు. అందరికీ ఆట చూపిస్తుంది. ఒకప్పుడు షర్మిల పాదయాత్ర చేస్తే సాక్షిలో పేజీల కొద్ది ఫొటోలు, కథనాలు. ఇప్పుడు ఆమె కొడుకు నిశ్చితార్థం జరిగినా సాక్షికి అదేం పెద్ద వార్త కాదు. జగన్ వెళ్లాడు కాబట్టి ఒక ఫొటో వార్త. వెళ్లకపోతే అదీ అనుమానమే. ఒకవేళ అన్నాచెల్లెళ్ల మధ్య సఖ్యతే వుంటే అర పేజీ ఫొటోలు, వార్తలు. అప్పుడు ఆంధ్రజ్యోతి, ఈనాడుల్లో వార్తే వచ్చేది కాదు. ఒకవేళ వచ్చినా సింగిల్ కాలమ్.
మన పత్రికలన్నీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ వుంటాయి కానీ, ఎవరి ఎజెండాలు వారికి వుంటాయి. జగన్ ఓదార్పు యాత్ర, పాదయాత్ర సాక్షికి చాలా ముఖ్యంగా కనిపించి పేజీల కొద్దీ ఫొటోలు, వార్తలు ఇచ్చాయి. అదే సమయంలో ఈనాడు, జ్యోతికి అవి చాలా చిన్న వార్తలు. జిల్లా పేజీల్లో చిన్న ఫొటో వార్త. లేదా మెయిన్ లోపలి పేజీలో చిన్న వార్త అదే విధంగా చంద్రబాబు వార్తలన్నీ సాక్షికి చాలా చిన్నవి. అన్ని పేపర్లు పత్రికా ప్రమాణాల గురించి మాట్లాడుతూ వుంటాయి. పాఠకుల్ని ఎడ్యుకేట్ చేస్తూ వుంటాయి.
జగన్, షర్మిల అంటీముట్టనట్టు ఉన్నారని వార్తలు. ఎవరు ఏం కోరుకుంటారో అదే కనిపిస్తుంది, వినిపిస్తుంది. వీడియోలున్నాయి కాబట్టి ఊరుకున్నారు కానీ, లేదంటే జగన్ , షర్మిల వేదిక మీద గొడవ పడ్డారని కూడా రాసేవాళ్లు. సాక్షి వీడియోలో జగన్ వెళ్లి అందరినీ పలకరించి, వధూవరుల్ని ఆశీర్వదించినట్టు క్లియర్‌గా వుంది. వేదిక మీద ఒక నిమిషానికి మించి లేరని రాశారు.
ఎక్కడా ఏ వేదికపైన ఎక్కువ సేపు ఎవరూ వుండరు. ఫొటో, వీడియో అయిపోతే దిగిపోతారు. ఎందుకంటే వెయిటింగ్‌లో ఉన్న మిగతా అతిథులకి అవకాశం ఇవ్వాలి కాబట్టి. ఇది జస్ట్ కామన్‌సెన్స్. పైగా జగన్ లాంటి వీఐపీ అక్కడ ఎక్కువ సేపు వుంటే సెక్యూరిటీ కారణాల వల్ల మిగతా వాళ్లకి ఇబ్బంది. దీన్ని కూడా ఇష్యూ చేయడం గ్రేట్. పిచ్చి యూట్యూబ్ చానల్స్ చేస్తే అర్థం వుంది కానీ, మెయిన్‌స్ట్రీమ్ మీడియా కూడా ఇదే పని చేయడం దిగజారుడుతనమే.
నిజానికి తెలుగులో గొప్పగా చెప్పుకునే రెండు పత్రికలు ఎపుడో దిగజారిపోయాయి. చంద్రబాబుని నెత్తిన పెట్టుకుని సొంత ప్రయోజనాలు, ఆస్తుల పరిరక్షణ, పెంపొందించడమే లక్ష్యం. ఒకప్పుడు లక్ష్మీపార్వతిపై వ్యూహం ప్రకారం దాడి చేసి, ఆమెని విలన్‌గా చిత్రీకరించారు. ఆమె కోట్ల రూపాయలు వెనకేసుకున్నారని ప్రచారం చేశారు. అదే నిజమైతే అవన్నీ ఏమయ్యాయి? ఆమె సాధారణంగా జీవిస్తూ వుండడం మనికి కనిపిస్తూనే వుంది కదా!
ఎన్టీఆర్‌ని దించేసిన తర్వాత ఆయన వాయిస్ వినిపించకుండా చేశారు. చంద్రబాబుని విజనరీగా మార్చారు. ఆయన ప్రతి చర్య అద్భుతం అన్నారు. ఇప్పుడు సోషల్ మీడియా వుంది కాబట్టి సరిపోయింది. లేదంటే చంద్రబాబుని మించిన పరిపాలకుడు ఇండియాలోనే లేడనే డప్పు స్టార్ట్ చేసేవాళ్లు. అన్ని వ్యాపారాల్లాగే జర్నలిజం కూడా వ్యాపారమే. పత్రికాధిపతులకి లాభం, ప్రజలకి నష్టం. ప్రజాస్వామ్యానికి అప్డేటెడ్ వెర్షన్ ఇది.