తెలుగుదేశం- జనసేన పొత్తుల్లోకి బిజెపి కూడా వచ్చి చేరుతుందో లేదో ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ముగ్గురూ కలవడంపై ఎవరి భయాలు వారికి ఉన్నాయి. ఎవరి కోరికలు వారికి ఉన్నాయి. పొత్తుల గురించి మా అభిప్రాయాలు నివేదిక రూపంలో అధిష్ఠానానికి నివేదించేశాం- అని చెప్పి రాష్ట్ర భాజపా నాయకులు చేతులు దులిపేసుకుంటున్నారు.
అయితే ఈ మూడు పార్టీలకు సంబంధం లేని నాలుగో పార్టీ వ్యక్తి.. మధ్యలో తలదూర్చి ఈ ముగ్గురి పొత్తులను కన్ఫర్మ్ చేసేస్తున్నట్టుగా మాట్లాడడమే కామెడీ. ఆయన మరెవ్వరో కాదు.. రఘురామక్రిష్ణ రాజు!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్ పుణ్యమాని ఎంపీ గా గెలిచి లోక్ సభలో అడుగుపెట్టిన ఈ ఆర్ఆర్ఆర్కు మళ్లీ గెలవాలనే కోరిక ఉంది. వైసీపీతో ఇన్నాళ్లుగా సున్నం పెట్టుకున్న పర్యవసానంగా ఎట్టి పరిస్థితుల్లోనూ తనని గెలవనివ్వకుండా ఆ పార్టీ అడ్డుపడుతుందనే భయం కూడా ఉంది. అలాగని సొంతంగా గెలిచే ధైర్యం లేదు.
చంద్రబాబు భజనతోను, పవన్ కల్యాణ్ కు ఢిల్లీలో సకల ఏర్పాట్లు చేసిపెడుతూ ఉండే చనువుతోనూ ఆ రెండు పార్టీల నుంచి టికెట్ పుచ్చుకోవచ్చు గానీ.. ఆ పార్టీలు అసలు రాష్ట్రంలో గెలుస్తాయో లేదో అనే భయం వెన్నాడుతుంటుంది. ఆ పార్టీల తరఫున గెలిచినా ఓడినా, ఆ పార్టీలు రాష్ట్రంలో అధికారంలోకి రాకపోతే.. జగన్ సర్కారు తనను టార్గెట్ చేస్తుందని.. తాను ఇన్నాళ్లు ప్రదర్శించిన దూకుడుకు బుద్ధి చెబుతుందని ఇంకో భయం.
అందువల్ల బిజెపి తరఫున పోటీచేయాలని కోరిక! కోరిక ఉన్నదిగానీ.. ఆ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగితే.. ఎన్నికల ఖర్చుగా పెట్టే కోట్ల రూపాయలు గంగపాలు అవుతాయని నమ్మకం. అందుకే ఆయన మూడు పార్టీల పొత్తులను కోరుకుంటున్నారు. తన కోరిక సంగతి చెప్పకుండా.. తాను మళ్లీ తెలుగుదేశం-జనసేన- బిజెపి కూటమి తరఫున అదే సీటునుంచి ఎంపీగా పోటీచేస్తానని సెలవిస్తున్నారు.
ఆ ముగ్గురి మధ్య పొత్తులు ఉంటాయో లేదో వారే చెప్పడం లేదు. కానీ ఆయన మాత్రం ఢంకా బజాయించి చెప్పేస్తున్నారు. మరెన్ని పార్టీలతో అయినా కలిసి పోటీచేయవచ్చు గాక.. కానీ.. ఆర్ఆర్ఆర్ మళ్లీ గెలిచి సభలో అడుగుపెట్టకుండా వైసీపీ తమ సర్వశక్తులనూ మోహరిస్తుంది కదా అనేది పలువురి సందేహం. మరి ఎవరి కలలు ఎలా తీరుతాయో.. ఎవరి భయాలు పైచేయి సాధిస్తాయో చూడాలి.