మొన్ననే ఓ ఇంటర్వ్యూ కూడా రిలీజ్ చేస్తే, మలి విడత ప్రచారం ప్రారంభించారని సంబరపడ్డారు. అంతలోనే ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించేసరికి భగ్గుమంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. సలార్ సినిమా ఇంకా థియేటర్లలో ఉంటుండగానే, ఇలా ఓటీటీకి ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
సలార్ సినిమా థియేటర్లలోకి వచ్చి 4 వారాలు పూర్తయింది. ఓవైపు థియేటర్లు, మరోవైపు ఆక్యుపెన్సీ తగ్గినప్పటికీ ఇంకా కొన్ని సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్సుల్లో ఈ సినిమా నడుస్తోంది. ఇలాంటి టైమ్ లో ఓటీటీలో సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొస్తే, థియేట్రికల్ రన్ ముగిసినట్టే.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 620 కోట్ల రూపాయలకు దగ్గరగా వసూళ్లు సాధించింది సలార్. ఓవర్సీస్ టాప్ గ్రాసర్స్ లో బాహుబలి-2, ఆర్ఆర్ఆర్ సినిమాల తర్వాత మూడో స్థానంలో నిలిచింది. సంక్రాంతి సినిమాల రాకతో సలార్ కు థియేటర్లు తగ్గిపోయాయి. ఫలితంగా వసూళ్లు కూడా బాగా పడిపోయాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితి దాదాపు ఇంతే.
అయినప్పటికీ మరో వారం పాటు సినిమా స్ట్రీమింగ్ ను వాయిదా వేయమని డిమాండ్ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు. అయితే ఓటీటీ సంస్థల అగ్రిమెంట్లు పక్కాగా ఉంటాయి. సినిమా స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకున్నప్పుడే 4 వారాల నిబంధన కింద నిర్మాతలు సంతకం చేసి ఉంటారు. కాబట్టి ఇప్పుడిక చేసేదేం లేదు.
ఈరోజు రాత్రి నుంచి నెట్ ఫ్లిక్స్ లో సలార్ సినిమా తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో పృధ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించగా.. శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది.
త్వరలోనే సెట్స్ పైకి సలార్ పార్ట్-2.. మరోవైపు సలార్ పార్ట్-2పై ఆసక్తికర ఊహాగానం వినిపిస్తోంది. సీజ్ ఫైర్ సూపర్ హిట్టవ్వడంతో.. వీలైనంత త్వరగా పార్ట్-2ను సెట్స్ పైకి తీసుకురావాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ భావిస్తున్నాడట. పార్ట్-2కు శౌర్యాంగ పర్వం అనే పేరుపెట్టిన సంగతి తెలిసిందే. సలార్ పార్ట్-1 క్లయిమాక్స్ లో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రాణ స్నేహితులుగా ఉన్న ప్రభాస్-పృధ్వీరాజ్, ఎలా బద్ధశత్రువులుగా మారారనే విషయాన్ని చూపించబోతున్నాడు.