ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడితే చాలు…. స్థాయితో సంబంధం లేకుండా ఎల్లో మీడియా విశేష ప్రచారం కల్పిస్తోంది. ముఖ్యంగా రామోజీరావు పత్రిక ఈనాడు అంటే… కొద్దోగొప్పో పాఠకులకు గౌరవం వుండేది. వైఎస్సార్ కుటుంబాన్ని టార్గెట్ చేయడం ద్వారా రామోజీ తన మీడియా స్థాయిని తానే దిగజార్చుకున్నారు.
ఎంతగా అంటే పాతాళానికి కింద మరేదైనా వుంటే, దానికి ఆ పేరు పెట్టాలనేంతగా. ఇటీవల వార్డు వాలంటీర్ టీడీపీలో చేరితే, దాన్ని ఈనాడు పత్రిక మెయిన్ పేజీలో క్యారీ చేసిందంటే, ఆ మీడియా స్థాయిని అంచనా వేయొచ్చు. తాజాగా వైఎస్ షర్మిల కూడా ఎల్లో మీడియా ప్రచార ఆస్త్రమయ్యారు. ఎందుకంటే ఆమె జగన్‌కు వ్యతిరేక రాజకీయాలు చేయడమే.
షర్మిల తనయుడు రాజారెడ్డి నిశ్చితార్థానికి జగన్ వెళ్లినా, వెళ్లకపోయినా తప్పే అని ప్రచారం చేయడానికి ఎల్లో మీడియా రెడీగా వుంది. మరీ ముఖ్యంగా ఎన్నికల సీజన్ కావడంతో ఎల్లో మీడియాలో ప్రతిదీ నెగెటివ్‌గా చిత్రీకరించడమే ఎజెండాగా పెట్టుకున్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను ఈ నెల 21న షర్మిల స్వీకరించనున్నారు. ఇక బాధ్యతలు తీసుకోవడమే తరువాయి, ఆమె కేంద్రంగా జగన్‌ను మరింతగా టార్గెట్ చేయడానికి అంతా సిద్ధంగా ఉన్నారు.
జగన్ పుణ్యమా అని షర్మిలకు ఎల్లో మీడియా పాజిటివ్ ప్రచారం కల్పిస్తోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు జగన్‌పై ఎల్లో మీడియా గత కొన్నేళ్లుగా చేస్తున్న దాడిని షర్మిల సులువుగా మరిచిపోయారు. తనకు అండగా నిలిస్తే చాలని ఆమె సరిపెట్టుకున్నట్టున్నారు. ఆమె కూడా రాజకీయాల్లోనే కదా వుండేది. అందులోనూ అన్నకు వ్యతిరేక కూటమిలో ఆమె చేరిపోయారు. ఇక మాట్లాడేది ఏముంటుంది?