ఇక్కడ దిల్ రాజు అంటే ఎస్ వి సి సంస్థ అన్నమాట. ఎందుకంటే అందులో దిల్ రాజు కూడా ఓ భాగస్వామి. నైజాంలో పండగ సినిమాల విడుదల సందర్భంగా నానా గత్తర జరిగింది. తన పేరు బ్యాడ్ చేస్తున్నారని దిల్ రాజు ఆగ్రహం వ్యక్తం చేసారు కూడా.
హనుమాన్ కు అగ్రిమెంట్ చేసిన మూడు థియేటర్లు, ఎస్ వి సి సంస్థ తిరిగి లాక్కోవడంతో గొడవ జరిగింది. ఈ మేరకు తెలంగాణ ఛాంబర్‌లో కేసు వేసారు మైత్రీ సంస్ధ శశి. ఈ నేపథ్యంలో కొంత మల్లగుల్లాలు జరిగినా, చివరకు మైత్రీ సంస్థ అధినేతలు, ఎస్ వి సి సంస్థ అధినేతలు కూర్చుని మాట్లాడుకుని ఓ అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు ఎస్ వి సి సంస్థ కు నైజాంలో చాలా మంది పోటీ వచ్చారు. కానీ వాళ్ల బ్యాడ్ లక్ నిలబడలేకపోయారు. హిట్‌లు పడకపోవడం ఒక కారణం. ఎస్ వి సి సంస్థ ప్లానింగ్‌ను తట్టుకోలేకపోవడం మరో కారణం. కానీ మైత్రీ సంస్ధ అలా కాదు. బలంగా నిలబడింది. మంచి హిట్‌లు కొట్టింది. పైగా మైత్రీ నిర్మాణ సంస్థ బ్యాకింగ్ వుంది.
బహుశా అందుకే కావచ్చు. ఇకపై గొడవలు పడకూడదని, కలిసి ప్లానింగ్‌తో ముందుకు వెళ్లాలని, అనవసరంగా పోటీ పడి, నిర్మాతలకు రేట్లు పెంచే విధంగా వ్యవహారించకూడదని ఇరు వర్గాలు ఓ రాజీ ప్లానింగ్ కు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా.
పండగ వారం గడిచిపోవడంతో, ఎస్ వి సి సంస్థ తమ థియేటర్లలోంచి తమ సినిమాలు తీసేసి, హనుమాన్ కు చాలా వరకు చోటిచ్చింది. రాబోయే భారీ సినిమాల విషయంలో గట్టి పోటీ వుంది. ఇది దృష్టిలో వుంచుకునే ఎస్ వి సి సంస్థ మైత్రీతో రాజీ ఫార్ములాకు వచ్చినట్లు వుందని ఇండస్ట్రీ టాక్.