ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన నేతలు, అలాగే రాజకీయాలు వద్దని ఇంటికే పరిమితమైన నేతలంతా యాక్టీవ్ అవుతున్నారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, అలాగే రాజకీయాలకు స్వస్తి చెప్పిన మాజీ మంత్రులు ముద్రగడ పద్మనాభం, కొణతాల రామకృష్ణ తదితర నేతలంతా జనసేన బాట పట్టారు. అలాగే ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ లాంటి నేతలు కూడా జనసేన గొడుగు కిందికే చేరారు.
నిజానికి టీడీపీ బలంతో పోల్చుకుంటే జనసేన చాలా బలహీనమైన పార్టీ. ఇంకా టీడీపీ మాటల్లో చెప్పాలంటే..ఉభయ గోదావరి జిల్లాలకు మాత్రమే పరిమితమైన కాపుల పార్టీ. అలాంటి పార్టీలోకి ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎక్కువగా, మిగిలిన వారు అరకొరా చేరడాన్ని టీడీపీ సీరియస్‌గా తీసుకుంది. పవన్‌తో పొత్తు పెట్టుకుంటే రాజకీయంగా తమకు లాభిస్తుందని టీడీపీ నేతలు ఆశించారు.
అయితే తాజా పరిణామాలను గమనిస్తే, అందుకు రివర్స్ అవుతోంది. టీడీపీతో పొత్తు వల్ల జనసేనకు రాజకీయంగా అత్యధిక ప్రయోజనం కలుగుతోంది. టీడీపీ హౌస్‌ఫుల్ కావడం, టికెట్ వస్తుందనే నమ్మకం లేదు. కానీ జనసేనకు నాయకుల కొరత వుంది. ఆ పార్టీకి కనీసం నియోజకవర్గ స్థాయి నేతలెవరూ లేరు. 30 సీట్లు ఇచ్చినా ఆ పార్టీ సొంతంగా నిలబెట్టుకునే పరిస్థితి లేదు.
ఈ విషయాన్ని గుర్తెరిగిన నాయకులు ఒక్కొక్కరుగా ఆ పార్టీ బాట పట్టారు. జనసేనలో చేరితో పొత్తులో భాగంగా తమకే టికెట్ లభిస్తుందన్న ధీమా ఆ నాయకుల్లో కనిపిస్తోంది. తాజాగా కొణతాల రామకృష్ణ జనసేనలో చేరుతుండడం వెనుక, ఆయనకు అనకాపల్లి నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో దింపడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే ముద్రగడ పద్మనాభం, ఆయన కుమారుడికి సీట్లు ఇచ్చేందుకు పవన్ ఓకే అన్నట్టు చెబుతున్నారు.
జనసేనలో నాయకులు లేరని, సీట్లు ఇచ్చి, అభ్యర్థులను కూడా తామే పంపుతామని అనుకున్న టీడీపీకి ఈ పరిణామాలు షాక్ ఇస్తున్నాయి. తమను అడ్డం పెట్టుకుని జనసేనాని బలపడుతున్నాడని, ఎప్పటికైనా ఇది తమకు ప్రమాదమే అని టీడీపీ నేతల్లో ఆందోళన కనిపిస్తోంది.