తెలుగు విద్యార్థుల అమెరికా కష్టాలు

అమెరికాలో చదువుతున్న చాలామంది తెలుగు విద్యార్థులు మధ్యతరగతి , ఎగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందినవాళ్లు. తెలుగువాళ్లే కాదు భారతీయ విద్యార్థుల్లో చాలామంది అంతే. అమెరికా జీవనం అనేది అంతిమ లక్ష్యంగా, ఘన విజయంగా భావించే…

అమెరికాలో చదువుతున్న చాలామంది తెలుగు విద్యార్థులు మధ్యతరగతి , ఎగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందినవాళ్లు. తెలుగువాళ్లే కాదు భారతీయ విద్యార్థుల్లో చాలామంది అంతే. అమెరికా జీవనం అనేది అంతిమ లక్ష్యంగా, ఘన విజయంగా భావించే వారిలో ఆ వర్గం వాళ్లే ఎక్కువగా ఉన్నారు.

నిజానికి గత దశాబ్దాల నుంచీ జరుగుతున్నది అదే. బ్యాంక్ లోన్స్ పుచ్చుకుని అమెరికా చదువులు చదవడం, చదువుతున్నంత కాలం పార్ట్ టైం జాబ్స్ చేసుకుని బతకడం, తర్వాత అక్కడే ఉద్యోగం సమపదించి ఆ లోన్ తీర్చడం రివాజుగా వస్తోంది. కానీ తాజాగా పరిస్థితులు మారాయి. బ్యాంక్ లోన్లు తీసుకుని అమెరికా వెళ్లిన చాలామంది విద్యార్థులకి పెద్ద సవాల్ ఎదురయ్యింది.

ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పదవిని చేపట్టిన నాటి నుంచీ చాలామందికి కంటి మీద కునుకులేకుండా ఉంటోంది. అక్కడ పార్ట్ టైం జాబ్స్ లేవిప్పుడు. గతంలో కూడా పెట్రోల్ బంకులోనో, రెస్టారెంట్లోనో పని చేసే విద్యార్థులు కామన్. అదసలు ఇల్లీగల్ అనే ఎవరికీ తెలియదు. స్టూడెంట్ వీసా మీద ఉన్నవాళ్ల క్యాంపస్ బయట జాబ్స్ చేయడం నేరమని ఈ మధ్యనే అధికశాతం మందికి తెలిసింది. మరేం చెయ్యాలి? ఇంటి నుంచి డబ్బు పంపమనాలి? ఎంత? ఉంటున్న ప్రాంతాన్ని బట్టి కనీసంలో కనీసం నెలకి లక్ష రూపాయల నుంచి రెండున్నర లక్షల వరకు.

మధ్య, ఎగువ మధ్య తరగతుల కుటుంబాలకి అలా పంపడం సాధ్యమయ్యే పనేనా? ఏ ఇల్లో, వాకిలో తాకట్టు పెట్టి రెండేళ్ల కాలపరిమితికి సరిపడా డబ్బంతా కూడబెట్టి పంపారే అనుకుందాం! తర్వాత ఉద్యోగమొస్తుందా అంటే ఆ గ్యారెంటీ కూడా లేదు. ఉద్యోగం సంపాదించి, హెచ్ 1 బి విసా పొందడం 10 మందిలో ఇద్దరికి మించి సాధ్యపడడంలేదు.

అంటే అమెరికా వెళ్లిన విద్యార్థుల్లో 80% మంది ఉద్యోగాలు రాక వెనుదిరగాల్సిందే. ఎందుకంటే అక్కడ ఏదో రకంగా ఉండిపోవడానికి గతం మాదిరి వ్యవస్థ కాదు. వీసా గడువు పూర్తైనా అక్కడ ఉంటే డిపోర్టేషన్ గ్యారెంటీ.

ఖర్మకాలి దొరికితే గబుక్కుని టికెట్ కొనుక్కుని ఇండియా రావడానికి కూడా చాలా మంది విద్యార్థుల దగ్గర డబ్బుల్లేవు. అమెరికా వాళ్లే పట్టుకుని ఫ్లైటెక్కించి పంపిస్తారులే అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడంతా “సెల్ఫ్ డిపోర్టేషనే”. ఒక్కసారి దొరికాక ఒక్క రోజు అదనంగా దేశంలో ఉన్నా రోజుకి 86,000 రూపాయల పెనాల్టీ పడుతుంది. కుటుంబసభ్యులు ఆ డబ్బంతా కడితే తప్ప సదరు విద్యార్థిని పంపించరు. అంతవరకు దుర్భరమైన జైలు జీవితం గడపాల్సి రావొచ్చు. ఏమిటీ దుస్థితి?

అదల ఉంచి, విద్యార్థుల్ని మధ్యలో ఒక సారి ఇంటికెళ్లొద్దామనే ఆలోచన కూడా చేయొద్దంటున్నారు చాలామంది. ఎందుకంటే వెనక్కి తిరిగి వచ్చే క్రమంలో ఏదో ఒక ఇమిగ్రేషన్ కారణం చూపి పంపించేసే పరిస్థితి ఉండొచ్చంటున్నారు. ముఖ్యంగా కొన్నాళ్లు పార్ట్ టైం జాబ్ చేసిన రికార్డ్ కనుక ఉంటే ఆ కారణం చూపించి వీసా నియమోల్లంఘన జరిగిందని చెప్పి విద్యార్థుల్ని వెనక్కి పంపేయవచ్చు.

తెలుగు సంఘాల నాయకులు కూడా ఈ విషయం మీద తమను సంప్రదించిన వాళ్లకి సలహాలిస్తున్నారు, జాగ్రత్తలు చెబుతున్నారు. లాయర్లు కూడా సమస్యల్లో ఇరుక్కున్నవాళ్ల తరపున నిలబడడానికి వస్తున్నారు. అయితే ఈ లీగల్ బ్యాటిల్ అనేది మళ్ళీ డబ్బుతో కూడుకునే పని.

ఇన్ని కష్టాలు పడి, ఇన్ని రిస్కులు తీసుకుని, ఆర్ధిక భారం మోస్తూ పిల్లల్ని అమెరికాలో చదివించాల్సిన అవసరం నిజంగా ఉందా? ఇప్పుడిప్పుడే మొదలు కనుక ఇంకా ఈ అమెరికా కష్టాలు తెలుగు నాట ఎక్కువమందికి అనుభవంలోకి రావడంలేదు. ఇప్పటికీ అమెరికా అంటే డాలర్ల జీతాలు, క్వాలిటీ జీవనం, ఘనమైన జీవితం అనుకుంటున్న వాళ్లే ఎక్కువమంది ఉన్నారు.

కొత్తగా అమెరికన్ చదువు కోసం వీసా లైన్లో నిలబడేవాళ్లు తగ్గినా, అమెరికా మీద ఆశ మాత్రం ఇంకా తగ్గలేదని, ఇదంతా టెంపరరీయే అని అనుకుంటున్నవారే ఎక్కువగా కనిపిస్తున్నారని అమెరికాలోని తెలుగు సంఘాల వాళ్లు అంటున్నారు.

స్టూడెంట్ వీసా అయినా, హెచ్ 1 బి అయినా, గ్రీన్ కార్డ్ అయినా నియమాల ఉల్లంఘన జరగనంత వరకూ ఇబ్బందులు ఉండవు. కంగారు పడి హెచ్ 1 బి వీసాల వాళ్లు వేరే జాబ్ కోసం ఉన్న జాబ్ వదిలేసాక..ఆ వేరే జాబ్ రాకపోయినా, విద్యార్థులు పార్ట్ టైం జాబులు చేసినా, గ్రీన్ కార్డ్ వాళ్లు ఏడాది కాలంలో అమెరికాలో ఉండాల్సినన్న రోజులు ఉండకపోయినా ఇబ్బందులు తప్పవు. ఈ జాగ్రత్తలు తీసుకున్నా రిసెషన్ వస్తే ఎవరికైనా ఇబ్బందులు తప్పవు.

పద్మజ అవిర్నేని

7 Replies to “తెలుగు విద్యార్థుల అమెరికా కష్టాలు”

  1. ఏది లీగల్ ఏది ఇల్లీగల్ లో కూడా తెలియదు అనుకోవడం మీ అమాయకత్వం. చాలా మందికి వారు ఏమి చేస్తున్నారో తెలుసు. కాని చల్తా హై ఆటిట్యూడ్.

  2. పద్దూ అక్కకి పండగే ఇంక.

    మన తెలుగు వాళ్ళు అమెరికా లో అంటే ఇన్నాళ్లు చర చర మని కోపం వచ్చేది అక్కాయికి.

    లేకపోతే మన వెంక*ట రెడ్డి గారికి పటేల్ బ్రదర్ పచారీ షాప్ లో క్యూ లో ముందుకు వెళ్ళనివ్వక్క తెలుగు విద్యార్థులు అడ్డు పడతార, ఆయ్ !

Comments are closed.