తెలుగు టీవీ సీరియళ్లు ఏళ్ళ తరబడి జీడిపాకంలా సాగుతుంటాయి. కథ ఉన్న చోటనే ఉంటుంది. ఏ మాత్రం ముందుకు సాగదు. అలాంటి జీడిపాకం సీరియల్స్ రాజకీయాల్లోనూ ఉంటాయి. అలాంటిదే తెలంగాణలోనూ నడుస్తోంది. దానికి చల్లారని సీఎం కేసీఆర్ పగ అనే పేరు పెట్టుకోవచ్చు.
రాజకీయాల్లో అభిప్రాయం భేదాలుంటాయి. విమర్శలుంటాయి. కానీ పగలు, ప్రతీకారాలు ఉండవు. ఉండకూడదు కూడా. ఆ లెక్కన చూసుకుంటే రాజకీయ నాయకులు చాలామంది మీద పగ తీర్చుకోవలసి ఉంటుంది. ఇది కేసీఆర్ కూడా వర్తిస్తుంది. కానీ ఆయన తనను బూతులు తిట్టినవారిని, ప్రత్యేక తెలంగాణాను వ్యతిరేకించిన నాయకులను చాలా మందిని తాను అధికారంలోకి వచ్చాక అక్కున చేర్చుకున్నారు. వారికి మంత్రి పదవులు, ఇతర కీలక పదవులు ఇచ్చి అందలం ఎక్కించారు కదా.
కానీ కేసీఆర్ మాత్రం ఇద్దరి మీద పగ, ప్రతీకారం వదులుకోవడంలేదు. వారిద్దరూ ఈ రాష్ట్రానికి చెందినవారు కూడా కాదు. ఇంతకీ వారెవరు? ఒకరు ప్రధాని నరేంద్ర మోడీ, మరొకరు రాష్ట్ర గవర్నర్ తమిళిసై. మోడీ ప్రధాని కాబట్టి ఆయన్ని అలా పక్కన పెడదాం. తమిళిసై గవర్నర్ కాబట్టి రాష్ట్రంలోనే ఉంటారు. ఆమె రాజ్యాంగ అధినేత. ఆమెకు కొన్ని అధికారాలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో స్వతంత్రంగా వ్యవహరించవచ్చు. తన అభిప్రాయాలు వెల్లడి చేయవచ్చు. కానీ చాలామంది ముఖ్యమంత్రులు అలా ఉండటాన్ని ఇష్టపడరు. అక్కడే వివాదాలొస్తాయి.
కేసీఆర్ కూడా ఇందుకు అతీతులు కాదు. గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డి (కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యాడు) ని నామినేట్ చేయడానికి తమిళిసై తిరస్కరించారు. దీంతో ఆమెపై అప్పటినుంచి కేసీఆర్ పగ పెంచుకున్నారు.
చాలాసార్లు ఆమెకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా అవమానించారు. సీఎం బాటలోనే మంత్రులు, అధికారులూ నడిచారు. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని రాజ్ భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం జరిగింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, మంత్రులను సైతం ఆహ్వానించారు.
ఐతే గవర్నర్ తమిళిసై తేనీటి విందుకు సీఎం కేసీఆర్ దూరంగా ఉండిపోయారు. చివరి నిమిషంలో సీఎం తన నిర్ణయం మార్చుకున్నారు. కార్యక్రమానికి రావడం లేదని రాజ్‌భవన్‌కు సీఎంవో కార్యాలయం సమాచారం అందించింది. మంత్రులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు రాజ్‌భవన్ వైపు రాలేదు. కేవలం అధికారులు మాత్రమే కార్యక్రమానికి తరలివచ్చారు.
ఎట్ హోం కార్యక్రమంలో సీఎస్ సోమేష్‌కుమార్, సీపీలు సీవీ ఆనంద్, మహేష్ భగవత్‌తోపాటు ఉన్నతాధికారులు, ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు. అధికారిక కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరుకాకపోవడంపై గవర్నర్ తీవ్ర మనస్తాపం చెందారు. గత కొంతకాలంగా రాజ్ భవన్- ప్రగతి భవన్ మధ్య వార్ నడుస్తోంది.
మొదట్లో సీఎం, గవర్నర్ మధ్య సఖ్యత ఉండేది. ఐతే క్రమంగా ఇరువురి మధ్య దూరం పెరుగుతోంది. గవర్నర్ తమిళిసై జిల్లాల పర్యటనకు మంత్రులు, అధికారులు పాల్గొనడం లేదు. ప్రోటోకాల్‌పై పెద్ద రగడే జరిగింది. ప్రభుత్వం తనను కనీసం పట్టించుకోవడం లేదని ఆమె బహిరంగంగానే విమర్శించారు. ఆడపడుచు అని లేకుండా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రభుత్వ తీరుపై ఫైర్ అయ్యారు.
కనీస ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు. ఢిల్లీ వేదికగా ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అసెంబ్లీ సమావేశాల్లో తన ప్రసంగాన్ని లేకుండా చేశారని ఆక్షేపించారు. జిల్లాల టూర్లకు వెళ్లినా అధికారులు పాల్గొనడం లేదన్నారు. తన తల్లి చనిపోయినా సీఎం కేసీఆర్ పరామర్శించలేదని..కనీసం మాట్లాడలేదన్నారు గవర్నర్. అప్పట్లో ఆమె వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. మహిళలను ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు మండిపడ్డాయి.
దీనికి టీఆర్ఎస్ నేతలు సైతం కౌంటర్ ఇచ్చారు. తమిళిసై గవర్నర్‌లా కాకుండా బీజేపీ నేతల వ్యవహారిస్తున్నారని ఫైర్ అవుతున్నారు. తాజాగా రాజ్‌భవన్‌కు సీఎం కేసీఆర్ వెళ్లకపోవడంతో మరింత దుమారం రేగే అవకాశం ఉంది. కేసీఆర్ పగ ఎప్పుడు చల్లారుతుందంటే గవర్నర్ ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినప్పుడే.