దసరాకు ముహూర్తం మార్చిన జగన్…?

ఏపీ సీఎం జగన్ మరోసారి మూడు రాజధానుల నినాదాన్ని గట్టిగానే స్వాతంత్ర దినోత్సవాల సాక్షిగా రాష్ట్ర ప్రజలకు వినిపించారు. వైసీపీ ఆలోచనలలో మూడు రాజధానులు ఇంకా అలాగే భద్రంగా ఉన్నాయని జగన్ వజ్రోత్సవ సంబరాల…

ఏపీ సీఎం జగన్ మరోసారి మూడు రాజధానుల నినాదాన్ని గట్టిగానే స్వాతంత్ర దినోత్సవాల సాక్షిగా రాష్ట్ర ప్రజలకు వినిపించారు. వైసీపీ ఆలోచనలలో మూడు రాజధానులు ఇంకా అలాగే భద్రంగా ఉన్నాయని జగన్ వజ్రోత్సవ సంబరాల వేదిక సాక్షిగా చాటి చెప్పారు.

మూడు రాజధానులు అంటే పాలనా వికేంద్రీకరణ అని వైసీపీ సర్కార్ బలంగా నమ్ముతోంది. అదే విధంగా వెనకబడిన ప్రాంతాలు ఎలాంటి వివక్షకు గురి కాకుండా సర్వముఖోభివృద్దికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందనే జగన్ తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు.

దానికి నాందిగా ఇప్పటికే పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా చేశామని జగన్ తెలిపారు. గ్రామ సచివాలయాలు కూడా అందులో భాగమే అని కూడా పేర్కొన్నారు. ఈ క్రమంలో మూడు రాజధానులు అంటే విశాఖకు పాలనా రాజధాని హోదా కల్పించాల్సి ఉంది.

అయితే దాని మీద అసెంబ్లీ చట్టం చేయాలి. దాని కంటే ముందు హై కోర్టు తీర్పుని సుప్రీం కోర్టులో సవాల్ చేయాలి. ఈ నేపధ్యంలో వాటి కంటే ముందుగా విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీస్ ని ఏర్పాటు చేసుకుని పాలనా రాజధానిగా అనధికారికంగా ప్రకటించాలన్న ఉత్సాహం అయితే వైసీపీ ప్రభుత్వంలో ఉంది.

దాని కోసం తాజా ముహూర్తంగా విజయదశమిని నిర్ణయించారు అని ప్రచారం సాగుతోంది. ఇప్పటికి రెండు ఉగాదులు, రెండు దసరాలు విశాఖ రాజధానికి అనధికార ముహూర్తాలుగా ప్రచారం అయ్యాయి. అవేమీ కాలేదు, మరి ఈ మూడవ దసరా అయినా విశాఖకు జగన్ సీఎం క్యాంప్ ఆఫీస్ ని రానిస్తుందా అన్నది చూడాలి.