మొన్నటికి మొన్న ఓ చానెల్ న్యూస్ ప్రెజెంటర్..విశ్లేషకుడు చాలా బాధపడి పోయారు. వైకాపా కు కౌంటర్ గా తేదేపా నాయకులు మాట్లాడడం లేదు అనే బాధను వెలిబుచ్చడానికి ఆయన వాడిన భాష భలేగా వుంది. ‘చచ్చిపోయారు..తెలుగుదేశం సీనియర్లు, పదవులు అనుభవించిన వారు, వ్యాపారాలు చేసుకున్నవారు చచ్చిపోయారు. సైనైడ్ మింగి చచ్చిపోయారు’ ఇదీ ఆయన భాష..ఆవేదన.
మరి ఇదే భాష వాడితే…
‘ఉత్తరాంధ్ర రాజకీయ పార్టీల నాయకులు చచ్చిపోయారు. ఉత్తరాంధ్ర కు పాలనా రాజధాని వద్దు అని నినదిస్తూ, ఉత్తరాంధ్రకే యాత్ర పేరుతో దండయాత్ర సాగించడం మొదలుపెడితే, ఇది తప్పు, మీకేనా రాజధాని, మాకు మాత్రం వద్దా అని అడగాల్సిన ఉత్తరాంధ్ర రాజకీయ నాయకులు చచ్చిపోయారు..సైనైడ్ మింగి చచ్చిపోయారు’ అని ఘాటుగా అనాలా?
కృష్ణ..గుంటూరు ప్రాంత జనాలకు వాళ్ల మద్దతు చానెళ్లు వున్నాయి, వాళ్లదే మీడియా వుంది కనుక రాజధానికి వాళ్లకే కావాలని గోల పెడతారు. గగ్గొలు పెడతారు. ఉద్యమాలు చేస్తారు. కానీ ఉత్తరాంధ్ర తరపున ఉద్యమించేది ఎవరు. మాకు రాజధాని కావాలి అని అడిగేదెవరు? ఉత్తరాంధ్ర జనాలకు మీడియా లేదు. ఉత్తరాంధ్ర జనాలకు డబ్బుల్లేవు. ఉద్యమం స్పాన్సర్ చేసే వాళ్లు లేరు.
అసలు ఉత్తరాంధ్రకు రాజధాని వద్దంటూ ఉత్తరాంధ్ర మీదకే యాత్రకు వస్తుంటే అదేంటీ అని అడిగేవారు లేరు. వైకాపా మంత్రులు తప్ప మరే రాజకీయ పార్టీకి ఉత్తరాంధ్ర అవసరం లేదా? ఎలాగైనా ఉత్తరాంధ్ర జనాలు తమకే ఓట్లు వేస్తారనే నమ్మకమా?
అందుకే ‘ ఆ ఛానెల్ న్యూస్ ప్రెజెంటర్ ‘ భాషలోనే మాట్లాడాలంటే ‘ఉత్తరాంధ్ర రాజకీయ నాయకులు చచ్చిపోయారు’ అని గట్టిగా అనాలేమో?