వైసీపీ సోషల్ మీడియా బాధ్యుడిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మార్చారు. పలువురు ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో జగన్ సోషల్ మీడియాకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో సోషల్ మీడియా అత్యంత శక్తిమంతమైన ప్రభావాన్ని చూపుతుండడంతో జగన్ దానిపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో నూతన బాధ్యతల్ని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు భార్గవ్‌కు అప్పగించడం గమనార్హం.
సోషల్ మీడియా విభాగాన్ని మొదటి నుంచి విజయసాయిరెడ్డి చూస్తున్నారు. తనకు నీడలా ఉండే గుర్రంపాటి దేవేందర్‌రెడ్డిని వైసీపీ సారథిగా విజయసాయిరెడ్డి నియమించారు. ఇటీవల ఆ బాధ్యతల్ని మరో నలుగురికి పంచారు. ఇదిలా వుండగా వైసీపీ సోషల్ మీడియా గత కొంత కాలంగా యాక్టీవ్‌గా పని చేయలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావన. అందుకే ఆయన దిద్దుబాటు చర్యలు చేపట్టారనే ప్రచారం జరుగుతోంది.
అయితే వైసీపీ సోషల్ మీడియా బాధ్యుడైన విజయసాయిరెడ్డిని మార్చి, ఆయన స్థానంలో సజ్జల కుమారుడు భార్గవ్‌ను నియమించినంత మాత్రాన …ఆ మాధ్యమం గాడిన పడుతుందా? అనే చర్చకు తెరలేచింది. వైసీపీకి సోషల్ మీడియా ఉపయోగపడాలంటే మారాల్సింది బాధ్యుడు కాదు, దాని విధానాలు అని చెప్పక తప్పదు. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీ కోసం చాలా మంది స్వచ్ఛందంగా సోషల్ మీడియాలో పని చేశారు. వివిధ కారణాలతో చంద్రబాబును ఎలాగైనా గద్దె దించాలని, ఇదే సందర్భంలో జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలనే ఆకాంక్ష… అంతిమంగా వైసీపీకి రాజకీయంగా కలిసొచ్చింది.
వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. అదేంటో గానీ, జగన్‌కు అధికారం వచ్చిన తర్వాత వైసీపీ పెద్దల తలలపై కొమ్ములు మొలిచాయని ఇదే సోషల్ మీడియాలో సెటైర్స్ వెల్లువెత్తాయి. దీన్ని బట్టి వైసీపీ పెద్దలు తమ కోసం పని చేసిన వాళ్ల విషయంలో ఎలా వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిపై అభిమానంతో ఆయన కుమారుడు జగన్‌ను సీఎంగా చూడాలనే ఆశయంతో సోషల్ మీడియాలో పని చేసిన వాళ్లంతా, ఇప్పుడు మనకెందుకులే అని నిరాశనిస్పృహల్లో ఉన్నారు.
వైసీపీపై అభిమానంతో పని చేసిన సోషల్ మీడియా యాక్టివిస్టులు ప్రభుత్వం నుంచి ఏమీ కోరుకోలేదు. కేవలం జగన్, ప్రభుత్వ పెద్దల ఆత్మీయ పలకరింపును మాత్రమే కోరుకున్నారు. వైఎస్సార్‌లా కాదనే చేదు వాస్తవం అనతికాలంలోనే తెలిసొచ్చింది. దీంతో ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. సోషల్ మీడియాలో టీడీపీ చాలా బలంగా ఉంది. దాన్ని తట్టుకోవడం వైసీపీ వల్ల కావడం లేదు. నిజానికి ఇప్పటికి కూడా వైసీపీ సోషల్ మీడియా బలహీనంగా ఉండడానికి కారణాలేంటో జగన్ తెలుసుకోలేకపోతున్నారు.
వైసీపీ సోషల్ మీడియా ఆత్మరక్షణ రాజకీయాలే చేస్తోంది. టీడీపీపై వైసీపీ సోషల్ మీడియా నుంచి ఎదురు దాడి కరువైంది. వైసీపీ సోషల్ మీడియా ప్రస్తుతం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, తదితర పాజిటివ్ అంశాలకే పరిమితమైంది. ఇలాంటి వాటికైతే ప్రత్యేకంగా వైసీపీ సోషల్ మీడియా ఎందుకో ఎవరికీ అర్థం కాదు. ఇలాంటి వార్తలను ప్రచారం చేయడానికైతే ప్రభుత్వ సమాచారశాఖ ఉంది కదా? ఆ శాఖ ఉద్యోగులకు ఇంతకంటే పనేం వుంటుంది? టీడీపీ, ఎల్లో మీడియాలకు దీటుగా ఇతర వ్యక్తిగత, కొన్ని వ్యవస్థాగత సోషల్ మీడియా వేదికలు పని చేస్తున్నాయి. వాటిలో వచ్చే కథనాలు, వీడియోలను మాత్రమే వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. గుడ్డిలో మెల్ల అంటే ఇదే.
రాజకీయంగా సోషల్ మీడియా ఉపయోగపడాలని జగన్ భావిస్తుంటే, దాని విధానాలు మార్చాల్సి వుంది. ఎప్పటికప్పుడు ప్రత్యర్థుల విమర్శలు, వార్తా కథనాల్లోని డొల్ల తనాన్ని తిప్పికొట్టేలా వైసీపీ సోషల్ మీడియాను తీర్చిదిద్దాలి. ఇందుకు ఇప్పుడున్న టీం ఎంత వరకు పనికొస్తుందో వైసీపీ సోషల్ మీడియా పెద్దలు ఆలోచించాల్సి వుంటుంది. ఇది జరగని పని. ఎందుకంటే మార్పు అనేది మొదట చేయాల్సి వస్తే… పెద్ద తలకాయల నుంచి ప్రారంభం కావాల్సి వుంటుంది.
ఇది అంత సులువు కాదు. తనకు విజయసాయిరెడ్డి సన్నిహితుడు కాబట్టి ఆయనకు సోషల్ మీడియా బాధ్యతల్ని జగన్ అప్పగించారు. తనకు గుర్రంపాటి దేవేందర్‌రెడ్డి ముఖ్యం కాబట్టి ఆయనకు సోషల్ మీడియా ఇన్‌చార్జ్ బాధ్యతలు విజయ సాయిరెడ్డి అప్పగించారు. తనకు ఎక్స్, వై, జెడ్ తెలుసు కాబట్టి వారికి కిందిస్థాయిలో గుర్రంపాటి బాధ్యతలు అప్పగించారు. ఇది ఇంత వరకూ సాగిన తంతు. ఇంతకూ సోషల్ మీడియాలో రెండు ముక్కలు రాయడం తెలిసిన వారికి చోటెక్కడ? అనేదే ఇప్పుడు ప్రశ్న. దానికి సమాధానం…దొరకదు.