విశాఖ జిల్లాలో ప్రమాద ఘంటికలు

స్వంత సర్వేలు ఎంతయినా చెప్పొచ్చు. పార్టీ నాయకులు ఎన్ని గాంభీర్యపు పోకడలు పోయినా పోవచ్చు. పథకాలు గట్టెక్కిస్తాయనే ధీమా వుంటే వుండొచ్చు. ఉత్తరాంధ్రకు రాజధాని అన్నాం కదా..ఆ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని అనుకున్నా అనుకోవచ్చు.…

స్వంత సర్వేలు ఎంతయినా చెప్పొచ్చు. పార్టీ నాయకులు ఎన్ని గాంభీర్యపు పోకడలు పోయినా పోవచ్చు. పథకాలు గట్టెక్కిస్తాయనే ధీమా వుంటే వుండొచ్చు. ఉత్తరాంధ్రకు రాజధాని అన్నాం కదా..ఆ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని అనుకున్నా అనుకోవచ్చు.

కానీ..గ్రౌండ్ లెవెల్ వాస్తవం అలా లేదు. విశాఖ జిల్లాలో వైకాపా కు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక సుస్పష్టంగా కనిపిస్తోంది. విశాఖ జిల్లాలో చంద్రబాబు సమావేశాలకు జనం భారీగా తరలివచ్చిన తీరు చూస్తుంటే రాజకీయ వర్గాలే విస్తుపోతున్నాయి. జనంలో అధికార పక్షం మీద ఇంతటి వ్యతిరేకత వచ్చిందా? అని ఆశ్చర్యపోతున్నాయి. దీంతో అధికార పక్షంలోంచి తెలుగుదేశంలోకి జంప్ చేయాలని ఆలోచించే వారు మొదలైపోయారు. ఇది సత్యం.

మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మీద ఆయన అనుచర గణం వత్తడి మొదలైపోయింది. అర్జంట్ గా చంద్రబాబును కలవమని ఆయనను అనుచరులు వత్తిడి చేస్తున్నారు. గతంలో జిల్లాలో చక్రం తిప్పిన నాయకుడు గంటా శ్రీనివాసరావు ప్రమేయం లేకుండానే చంద్రబాబు సభలు విజయవంతం కావడం విశేషం. గ్రామానికి కనీసం ముగ్గురిని అయినా తీసుకురండి అని పార్టీ నాయకులు గ్రామ స్థాయి నాయకులకు చెబితే పది పదిహేను మంది వంతున రావడం పెద్ద ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పైగా కనీసం మంచి నీళ్ల పాకెట్లు కూడా ఇవ్వకుండా.

చూస్తుంటే జగన్ యాంటీ మీడియా కథనాలు ప్రజల మీద గట్టిగానే ప్రభావం చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. రాజధాని సెంటిమెంట్ వుంటుంది అనుకుంటే జనాలు ఇలా భయంకరంగా రావడం చూస్తుంటే వైకాపా పట్ల జనం వ్యతిరేకత పెంచుకుంటున్నారా? లేదా చంద్రబాబు మీద ప్రేమ పెంచుకుంటున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

అనకాపల్లి సభ విజయవంతం కావడం గమ్మత్తయిన విషయం. ఎందుకంటే ఇక్కడ కాపులకు ప్రాధాన్యత ఇచ్చి, గుడివాడకు మంత్రి పదవి ఇచ్చారు. గవర్లకు కార్పొరేషన్ ఏర్పాటు చేసారు. పదవులు ఇచ్చారు. అన్నింటికి మించి అనకాపల్లిని జిల్లా కేంద్రం చేసారు. అయినా జనం ఇలా రావడం వెనుక ఏముంది? అన్నది పాయింట్. వెలమలను పక్కన పెట్టడం అన్నది గట్టిగా ప్రభావం కనబరుస్తోందని లోకల్ రాజకీయనాయకులు అంచనా వేస్తున్నారు. నిజానికి వెలమలకు కూడా ఇటీవలే మంత్రి పదవి దక్కింది. కానీ దాని ప్రభావం మాత్రం కనిపిస్తున్నట్లు లేదు. తెలుగుదేశం పార్టీ ఆది నుంచీ వెలమలకు పెద్ద పీట వేస్తూ వస్తోంది. బండారు, అయ్యన్న తరచు వైకాపాను గట్టిగా ఢీ కొంటున్నారు.

ఇక చోడవరం లాంటి చిన్న సెంటర్ లో జనం వేలాదిగా తరలి రావడం చూసి వైకాపా చోటా నాయకులు కిందా మీదా అయిపోతున్నారు. చోడవరం సభ అంత భారీ సక్సెస్ కావడానికి రీజన్ ఏమిటి అని కారణాలు లెక్కిస్తున్నారు.

విజయనగరం అన్నది అటు బొత్సా, ఇటు కొలగట్ల లాంటి వైకాపా నాయకులు వున్న ప్రాంతం. అక్కడ సభ ఏ రేంజ్ లో జరిగిందో తెలుస్తూనే వుంది. అలా అని దేశం నాయకుడు అశోక్ గజపతి డబ్బులు ఖర్చు చేసే నాయకుడు కారు. నిజానికి ఇటు విశాఖ, అటు విజయనగరం ప్రాంత దేశం జనాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం చంద్రబాబు సభలకు ఎవ్వరూ డబ్బులు తీయలేదు. ఎందుకంటే ఇంకా టికెట్ అన్నది ఎవ్వరికీ ఖరారు కాలేదు. అలా అని ఆశావహులు ఎవ్వరూ డబ్బులు తీయలేదు. కాస్త డబ్బులు తీయడం ఇప్పటి నుంచీ మొదలుపెట్టాలని సభలకు వెళ్లి వచ్చిన కార్యకర్తలే చెబుతుండడం విశేషం.

చంద్రబాబు కూడా ప్రతి సభలో గంట సేపు ఉపన్యాసాలు ఇచ్చారు. కదలకుండా, కూర్చోకుండా అలా నిల్చుని గంట సేపు అనర్గళంగా మాట్లాడడం కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపింది అన్నది వాస్తవం. ఈ వయస్సులో ఆ స్టామినా ఏమిటి అని కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. మరోపక్కన జనసేన పొత్తుకూడా వుండాలనే తెలుగుదేశం కింది స్థాయి నాయకులు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో కాపులు గణనీయ సంఖ్యలో వున్నారు. వీళ్లు అన్ని పార్టీల్లోనూ వున్నారు. జనసేన..దేశం ఒకటైతే మూడు వంతుల ఓట్లు ఒకవైపే పడతాయని లెక్కలు కడుతున్నారు.

మొత్తం మీద ఉత్తరాంధ్రలో వైకాపా కు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. కానీ ఇది ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక మాత్రమే కావచ్చు. పదవులు పొందిన నాయకులు ధీమా పడిపోయినా, పదవులు పోయిన వారు పట్టించుకోకుండా వదిలేసినా, ఫలితం దారుణంగా వుండే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా గ్రామాల్లో స్కూళ్ల పనులు తప్ప మరో పని జరగలేదు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు అన్ని గ్రామాలకు వుండవు. రోడ్లు అయితే అన్ని గ్రామాలకు వస్తాయి. కేంద్రం ఇస్తున్న రోడ్ల నిధులు కిందకు రావడం లేదు. దాని ప్రభావం గట్టిగా వుంది.

పైగా వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన పనులకు బిల్లులు ఇప్పటి వరకు రాలేదు. తెలుగుదేశం హయాంలో బిల్లులు కూడా పెండింగ్ లోనే పెట్టారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఈ బిల్లులు అన్నీ వస్తాయని కింది స్థాయి చోటా కాంట్రాక్టర్లు నమ్ముతున్నారు. ఒకటి ఒకటి కలిస్తే రెండు అన్నట్లు..వైకాపా కు ప్రమాద ఘంటికలు మోగడానికి ఇలా చాలా కారణాలు కనిపిస్తున్నాయి. దీనికి గమనించి ప్రణాళికలు మార్చుకోవాల్సి వుంది.